వేసవి ఉపాధి


Wed,April 17, 2019 01:42 AM

నిర్మల్‌టౌన్ : నిర్మల్ జిల్లాలో ఉపాధిహామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.100 కోట్ల ప్రణాళికతో జాతీయ గ్రా మీణ ఉపాధిహామీ పనులను చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది. దీంతో ఏప్రిల్ మాసంలోనే నెలవారీగా పనుల లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు జాబ్‌కార్డు ఉన్న కూలీలందరికీ చేతినిండా పనులను కల్పిస్తున్నారు. జిల్లా లో మొత్తం 19 మండలాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,58,943 జాబ్‌కార్డులుండగా.. ఈ జాబ్‌కార్డుల్లో 2లక్షల 15వేలకుపైగా మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ జాతీయగ్రామీణ ఉపాధిహామీ పథకం కింద ప్రతి ఏడాది 100 పనిదినాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ మాసం ప్రారంభం నుంచే జిల్లా వ్యా ప్తంగా అన్ని మండలాల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనులను చేపట్టింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ రోజుకు సగటున 80వేల మంది జాబ్‌కార్డు కూలీలు ఉపాధిహామీ పనుల్లో పాల్గొంటున్నారు. వీరికి ఒకరోజు కూలీ కింద రూ.211 చెల్లించడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఉపాధిహామీ పనుల్లో పాల్గొంటూ వేసవి కాలంలో ఉపాధిని పొందుతున్నారు.

ప్రజా ప్రాధాన్యత పనులకే మొగ్గు
జిల్లా వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఫాంపాండ్స్, మట్టితీత పనులు, రోడ్డు పనులు, మొరం పనులు, చెరువుల్లో పూడికతవ్వకాలు, పంట చేలకు మట్టిని తరలించడం, గ్రామానికి ఒక్క నర్సరీల్లో మొక్కల పెంపకం, గ్రామాల్లో డంపింగ్ యార్డు, కందకాల తవ్వకం, వాటర్‌షెడ్ నిర్మాణం, నీటి తొట్టెలు, పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం గదుల నిర్మాణం వంటి పనులను నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో మొత్తంగా 19 మండలాలు ఉండగా.. అన్ని మండలాల్లో ఉపాధిహామీ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభంకాగా... యాసంగి సీజన్ కూడా ముగియడంతో వ్యవసాయ పనులు మందగించాయి. దీంతో వ్యవసాయ కూలీలు సైతం ఉపాధిహామీ పనుల్లో పాల్గొంటూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.

జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు పనులకు వెళ్లడంతో రోజుకు రూ.211 చొప్పున కూలీ చేస్తూ వారానికి రూ. 1500 వరకు సంపాదిస్తున్నారు. ఉదయం 6 గంటలకే పనులకు వెళ్తున్న కూలీలు మధ్యాహ్నం 12 గంటలలోపే తిరిగి వస్తున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో అధికారులు ఎండ దెబ్బ తగలకుండా పనులు జరిగేప్రదేశాల్లో టెంట్లు, నీటి సౌకర్యం కల్పించడమే గాకుండా ఓఎస్‌ఆర్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచారు. పని వివరాలను ఏరోజుకారోజు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో వారం రోజులలోపే కూలీ డబ్బులు వారి ఖాతాల్లోనే జమ చేయడంతో ఉపాధి పనులకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. నిర్మల్ జిల్లాలో ప్రధానంగా కుభీర్, కుంటాల, లోకేశ్వరం, తానూర్, సారంగాపూర్, కడెం, పెంబి, తదితర మండలాల్లో రోజుకు సగటున 6వేల నుంచి 7వేల మంది కూలీలు పనుల్లో పాల్గొంటుండగా.. మిగిత మండలాల్లో 3వేల నుంచి 4వేల మంది పనులు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.

అడిగిన వెంటనే పనులను కల్పిస్తున్న అధికారులు
జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనులు మందగించిన నేపథ్యంలో వ్యవసాయ కూలీలకు చేతినిండా పని కల్పించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ఎంతగానో ఉపయోగ పడుతుంది. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా పనులు అడిగిన వెంటనే పనులు కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి వెంకటేశ్వర్లు అన్ని మండలాల ఏపీవోలను ఆదేశించారు. పనులు జరిగే చోట మౌలిక సదుపాయాలు, టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. జాబ్‌కార్డు లేనివారికి సైతం దరఖాస్తులు చేసుకుంటే 24 గంటల్లోనే జాబ్‌కార్డు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు, సలహాలు అందిస్తున్నారు. గతేడాది తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా ఉపాధిహామీ పనుల్లో ప్రథమంగా నిలవగా... అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...