పరిషత్ పోరుకు సై


Tue,April 16, 2019 01:33 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం ప్రారంభమైంది. ఇదివరకే అసెంబ్లీ, పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియగా.. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడా ప్రభుత్వం నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే స్థానిక ఓటర్ల జాబితా ప్రకటించారు. 4,08,301 మంది ఓటర్లుండగా.. 871 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 19 మండలాలుండగా.. ఇందులో 18 గ్రామీణ మండలాలు ఉన్నాయి. 156 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 18 జడ్పీటీసీ స్థానాలు, 18చోట్ల ఎంపీపీ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాలో తొలి విడతలో ఏడు మండలాలు, రెండో విడతలో ఆరు మండలాలు, మూడో విడతల్లో ఐదు మండలాల్లో చొప్పున స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ముగిసిన శిక్షణ
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పీవోలు, ఏపీవోలకు ఆదివారం తొలి విడత శిక్షణ తరగతులు నిర్వహించగా.. ఆర్వోలు, ఏఆర్వోలకు సోమవారం శిక్షణ ఇచ్చారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అర్హతలు, అనర్హతలు, ఫాం-ఎ, ఫాం- బి స్వీకరణపై శిక్షణ ఇచ్చారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేయనున్నారు. గతంలో జడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులు జిల్లా కేంద్రంలో నామినేషన్లు వేయగా.. తాజాగా మండల కేంద్రాల్లో నామినేషన్లు వేయనున్నారు. గతంలో ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు మండల కేంద్రాల్లో నామినేషన్లు వేయగా.. ఇకపై క్లస్టర్లలో నామినేషన్లు వేసేందుకు వెసులుబాటు కల్పించారు. జడ్పీటీసీ స్థానాలకు జిల్లా స్థాయి అధికారులను, ఎంపీటీసీ స్థానాలకు మండల స్థాయి అధికారులను ఎన్నికల అధికారులుగా నియమించారు.

ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో ఆశావహులు
జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు జనరల్ అయితే రూ.5000, రిజర్వేషన్ ఉంటే రూ. 2500, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వు స్థానంలో రూ.1250, జనరల్ స్థానంలో రూ. 2500 ఫీజు చెల్లించి నామినేషన్ వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో రాజకీయంగా వేడెక్కింది. నెల రోజులుగా ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకొనే పనిలో పడ్డారు. ముఖ్య నాయకులను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలను, మండలాలను ఏర్పాటు చేయడంతో జిల్లాల విస్తీర్ణం తగ్గడం, తక్కువ జడ్పీటీసీ స్థానాలు ఉండటం, కొత్తగా మండలాలు పెరగడం, మండలాల్లో తక్కువ ఎంపీటీసీ స్థానాలు ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ పదవులు సులభంగా దక్కించుకోవచ్చని భావిస్తున్నారు.

వివక్షాల్లో నైరాశ్యం
రిజర్వేషన్ల ఆధారంగా నాయకులు పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు సైతం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. పోయిన చోటనే వెతుక్కోవాలనే సామెత మాదిరిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చోటే.. ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచి సత్తాను చాటుకునేందుకు కదనరంగంలో దిగుతున్నారు. పార్టీ గుర్తులపై ఎన్నికలు నిర్వహించడంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో అధికార పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో దిగితే గెలుపు సులభమని భావిస్తున్నారు. బీ ఫారం దక్కితే సగం విజయం ఖాయమైనట్లేనని భావిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేల మద్దతు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఎవరికివారు ఓటర్లను, ముఖ్య నాయకులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. విపక్షాల్లో మాత్రం వరుస ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర నైరాశ్యం నెలకొంది. పార్టీ గుర్తులపై జరిగే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకువచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...