కాయ్ రాజా కాయ్..!


Tue,April 16, 2019 01:29 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో అటు ఐపీఎల్.. ఇటు లోక్‌సభ ఫలితాలపై జోరుగా బెట్టింగ్ నడుస్తున్నది. ఈ నెల 11న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నిర్వహించగా.. మే 23న వీటి ఫలితాలు ప్రకటించనున్నారు. సుమారు 41రోజుల పాటు ఫలితాల ప్రకటనకు గడువు ఉండడంతో.. జిల్లాలో బెట్టింగ్ జోరందుకుంది. ఇక ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మ్యాచ్‌లు ఉండగా.. పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారు. ఒకవైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు బెట్టింగ్‌తో జిల్లాలో వాతావరణం మరింత వేడెక్కింది. జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో.. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. సాయంత్రం 6గంటల వరకు ఎండలు మండుతుండగా.. రాత్రి వరకు వేడిగాలులు తగ్గడం లేదు. జనం బయటకు వెళ్లే పరిస్థితి లేకపోగా.. పందెంరాయుళ్లు మాత్రం బెట్టింగ్ దందాను జోరుగా సాగిస్తున్నారు.ఎండల్లో బయటకు వెళ్లకుండానే.. ఈ బెట్టింగ్ ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే నడవడం గమనార్హం.

ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ
ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియగా.. అన్ని విడతల ఎన్నిలకు పూర్తయ్యాకే ఫలితాలు ప్రకటించనున్నారు. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తుండగా.. ఈ ఫలితాలపై జిల్లాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంతో పాటు రాష్ట్రంలో ఎన్ని స్థానాల్లో ఎవరు గెలుస్తారు.. కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి వస్తుందనే.. అంశాల మీద జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఏ రాజకీయ పార్టీ అభ్యర్థి గెలుస్తారు.. ఎంత మెజార్టీ వస్తుంది అనే అంశంపై జోరుగా పందెం కాస్తున్నారు. అభ్యర్థుల గెలుపోటములతో పాటు ఎంత మెజార్టీ వస్తుందనే దానిపై కూడా బెట్టింగ్ కాస్తున్నారు. లక్షకు లక్ష ఇస్తామంటూ పందెం రాయుళ్లు బెట్టింగ్ కాస్తున్నారు. గతంలో ఈ పందేలు పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యేవి. ప్రస్తుతం గ్రామాలకు పాకింది. ప్రతి గ్రామంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై జోరుగా చర్చ నడుస్తోంది. ఎవరు గెలుస్తారు.. ఎంత మెజార్టీతో గెలుస్తారు అనే దానిపై పందెం కాస్తున్నారు.మరోవైపు ఐపీఎల్‌కు సంబంధించి జిల్లాలో జోరుగా పందెం దందా నడుస్తోంది. ఏ టీం గెలుస్తుంది.. పది ఓవర్లలో ఎన్ని పరుగులు చేస్తారు.. ఎన్ని ఓవర్లలో లక్ష్యం చేరుతారు.. ఏ క్రికెటర్ ఎన్ని పరుగులు చేస్తారు.. ఈ ఓవర్లో సిక్స్‌లు, ఫోర్‌లు ఎన్ని కొడుతారనే దానిపై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది.

వాట్సప్ గ్రూపుల ఏర్పాటు
లోక్‌సభ, ఐపీఎల్ బెట్టింగ్ ఎక్కువగా ఆన్‌లైన్‌లో నడుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. గతంలో ఫోన్లలో, ఒక ప్రదేశంలో బెట్టింగ్ నిర్వహించేవారు. ప్రస్తుతం వాట్సప్‌లో గ్రూపులు ఏర్పాటు చేసి పందెం కాస్తుండడంతో మరింత సులువుగా మారింది. ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి ప్రతి ఓవర్‌పైన కూడా పందెం కాస్తున్నారు. డబ్బులకు సంబంధించి కోడ్ భాష పెట్టుకుంటున్నారు. 2కె, 3కె, 5కె (కె=1000) అంటూ ఫోన్లలో కాల్స్, వాట్సప్‌లో మెసెజ్‌ల రూపంలో పందెం దందా నడుస్తోంది. లోక్‌సభ ఫలితాలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గెలిచేదెవరో... ఓడేదెవరో.. మే 23న తేలనుండగా.. పందెంరాయుళ్లలో లాభపడేదెవరో.. నష్టపోయేదెవరో.. అప్పుడే తేలనుంది

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...