నేటి నుంచి క్రాప్ కాలనీల సర్వే


Mon,April 15, 2019 02:16 AM

నిర్మల్ టౌన్: జిల్లాలో నేటి నుంచి క్రాప్ కాలనీల కోసం సర్వే చేపట్టనున్నారు. సర్వేలో భాగంగా సమగ్ర వ్యవసాయ సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ సర్వేకు గత జనవరిలోనే శ్రీకారం చుట్టగా వరుస ఎన్నికల నేపథ్యంలో బ్రేక్ పడింది. తాజాగా ప్రభుత్వం నుంచి మళ్లీ ఆదేశాలు రావడంతో సర్వే నిర్వహణకు వ్యవసాయశాఖ సమాయత్తమైంది. త్వరలో స్థానిక సంస్థల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో వ్యవసాయాధికారులకు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించవద్దని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. మే 15 వరకు సర్వే పూర్తిచేసి నివేదికను అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖ సోమవారం నుంచి క్లస్టర్ల వారీగా రైతుల వివరాలను సేకరించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం పంపిన ఫార్మాట్‌లో వివరాలను పొందుపరచనున్నారు. రైతు ఆరుగాలం శ్రమించి పండించే పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

ఎవరికి తోచిన పంట వారు వేసుకొని తీరా పంట చేతికి రాగానే డిమాండ్ లేక గిట్టుబాటు ధర రాక నష్టాల బారినపడి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతన్నకు ఈ పరిస్థితి నుంచి విముక్తి కలిగించేందుకు సీఎం కేసీఆర్ సమగ్రమైన ప్రణాళికను రూపొందించారు. మార్కెట్లో ధర ఉన్న పంటను రైతులంతా పండిస్తే చేతికొచ్చే సమయానికి మార్కెట్లో ఆ పంటకు డిమాండ్ లేక ధర పడిపోయి పంట అగ్గువ సగ్గువకు అమ్ముకునే పరిస్థితి నిత్యం కనిపిస్తూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పలు రైతు సమావేశాల్లో ఈ విషయాల పై చాలా సార్లు మాట్లాడారు. ఇక పై ఆ పరిస్థితి ఉండవద్దని క్రాప్ కాలనీలు ఏర్పాటు చేసుకుని ఏ ప్రాంతంలో ఏ పంటకు అనువైన నేల, వాతావరణం అనుకూలంగా ఉంటుందో ఆ మేరకే పంటలు వేసుకొని మార్కెట్లో డిమాండ్‌ను సృష్టించి గిట్టుబాటు ధరను పొందే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇప్పుడు ఆ విధానానికి కార్యాచరణ రూపొందుతున్నది. ప్రభుత్వం నుంచి జిల్లా వ్యవసాయశాఖకు క్రాప్ కాలనీల ఏర్పాటుకు సంబంధించిన అంశం పై సర్వే చేపట్టాల్సిందిగా సంకేతాలు అందాయి. త్వరలో దీనికి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. వ్యవసాయ శాఖతో పాటు ఉద్యానవన శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీవో), జిల్లా పరిశ్రమల శాఖ (డీఐసీ), రైతు సమన్వయ సమితి సభ్యులు సంయుక్తంగా ఈ సర్వేలో పాల్గొని రైతులతో చర్చించి ప్రాంతాల వారీగా పంటల వివరాలను సేకరించనున్నారు. అక్కడి వాతావరణం పరిస్థితులను అంచనా వేయనున్నారు. ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధంగా ఉండడంతో పాటు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్న క్రమంలో క్రాప్ కాలనీల సర్వే కూడా దీనికి కీలకం కానుంది. వానాకాలం, రబీ సీజన్‌లలో ఆరుతడి పంటలు తక్కువగా వేసుకొని, వరి వైపు రైతు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

తక్కువ పెట్టుబడితో నీటి వినియోగత తక్కువ మోతాదుతో పండించే ఆరుతడి పై పూర్తిగా శ్రద్ధ పెట్టడం లేదు. అందరూ వరి వైపు వెళ్లడంతో మిగిలిన పంటలకు అవకాశమున్న అవి తక్కువ విస్తీర్ణంలోనే సాగులోకి వస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం క్రాప్ కాలనీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టునున్నది. జిల్లాలో పసుపు, మొక్కజొన్న, పత్తి, సోయా తదితర పంటలకు అనుకూలమైన నేలలు ఉన్నాయి. వీటిని అధికంగా పండించి ఆహార ఉత్పత్తులకు ఈ పంట దిగుబడులను వినియోగించుకునే విధంగా పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందులో భాగంగా క్రాప్ కాలనీల ఏర్పాటుతో రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు మెరుగుపడి వ్యవసాయ రంగంతో తో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుందనే ఆలోచనతో ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...