ప్రాంతీయ పార్టీలు లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు


Mon,March 25, 2019 01:42 AM

ఆదిలాబాద్ టౌన్ : పార్లమెంటులో ప్రాంతీయ పార్టీల ప్రాతినిధ్యం చాలా అవసరం. జాతీయ పార్టీలు ప్రత్యేకించి రాష్ర్టాల సమస్యలను గుర్తించలేవు. పార్లమెంటు సమావేశాల్లో ప్రాంతీయ పార్టీ నేతలు తమ గళాన్ని బలంగా వినిపించగలరు. పార్లమెంటులో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించడంతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకత దేశమంతటికీ తెలిసి వచ్చింది. ప్రాంతీయ పార్టీయే లేకుంటే అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యపడేది కాదు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఎంత బలంగా ఉంటే రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువ నిధులు సమకూర్చుకోవచ్చు. పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీలకు సంపూర్ణ మెజార్టీ వస్తే ప్రాంతీయ పార్టీల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. దీంతో రాష్ర్టాలకు సరిగా న్యాయం జరగదు. రాష్ర్టాల సమస్యలను పట్టించుకునే వారుండరు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రాంతీయ పార్టీల సహకారం తీసుకుంటే రాష్ర్టానికి అధికంగా నిధులు పొందేందుకు అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలను ప్రాంతీయ పార్టీ గెలుచుకోగలిగితే జాతీయ రాజకీయాల్లో బలమైన పాత్ర పోషించేందుకు ఆస్కారం ఉంటుంది.

స్వాతంత్య్రం వచ్చి72 సంవత్సరాలు గడిచినా దేశాన్ని ఇంకా అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో దేశానికి దశ, దిశ చూపించే నాయకులు రావాలి. నిరుద్యోగం పెరిగిపోతోంది. వ్యవసాయ రంగం ఇంకా అభివృద్ధి చెందడం లేదు. విద్య, వైద్య రంగాల్లో ఇంకా వెనుకబాటే కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ వల్ల మధ్య తరగతి ప్రజలకు చాలా నష్టం జరుగుతోంది. అంతిమంగా పన్నుల భారం ప్రజలపైనే పడుతోంది. జీఎస్టీ అమలులో అనేక లొసుగులున్నాయి. సరిగా అమలు కావడం లేదు. అలాగే గతంలో పెద్ద నోట్లను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద తప్పిదం చేసింది. పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నెరవేరకపోగా ఆ నిర్ణయం దేశ ప్రజలను ఇబ్బందుల పాలు చేసింది. దేశ పరిపాలనలో మార్పు రావాలి. పరిపాలనా వ్యవస్థలో సంస్కరణలు తేవాలి. కొత్త సంస్కరణలు తీసుకురావడంలో ప్రజల మనోగతాలు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. ప్రస్తుతం జరగబోయే పార్లమెంటు ఎన్నికలు రాష్ర్టానికి కూడా చాలా కీలకమైనవి. ప్రతి ఒక్కరు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...