ఓటరు కోసం నా ఓటు


Sat,March 23, 2019 11:59 PM

నేరడిగొండ : వందశాతం పోలింగ్ సాధించేలా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటున్నది. ఓటుహక్కుపై ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రతి ఏటా కార్యక్రమాలు చేపడుతున్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటర్లలో సామాజిక స్పృహ కలిగించేలా నూతన పద్ధతులు అవలంబిస్తున్నది. ఏదేమైనా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి.. ఓటు వేసేలా రూపొందించుకున్న ప్రణాళిక మేరకు ముందుకు సాగుతున్నది. సోషల్ మీడియా ప్రభావం చూపుతున్న ఈ ఆధునిక జీవనంలో ఓటర్ల కోసం నా ఓటు అనే ప్రత్యేకమైన యాప్‌ను ఎన్నికల సంఘం అందుబాటలోకి తెచ్చింది.

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఓటర్లు వారి ఓటుహక్కును పోలింగ్ బూతుకెళ్లి సౌకర్యవంతంగా వినియోగించకునేందుకు ఎన్నికల కమిషన్ నా ఓటు యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ అనే రెండు ఆపరేటింగ్ సిస్టంల ద్వారా పనిచేసేలా దీన్ని రూపొందించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు దీన్ని విరివిగా ఉపయోగించినట్లు ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. స్మార్ట్‌ఫోన్ ద్వారా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచేందకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఎన్నికల కమిషన్ చొరవ తీసుకుంటున్నది. ఈ యాప్ ద్వారా ఓటరు కార్డు ఎపిక్ నంబరును తెలుసుకోవడంతో పాటు ఓటరు పేరును క్షణాల్లో వెతికి పట్టుకోవచ్చు. పోలింగ్ స్టేషన్‌కు వెళ్లే దారిని కూడ ఈ యాప్‌లో తెలుసుకునే అవకాశం ఉంది. పోలింగ్ స్టేషన్‌ల దగ్గరలో ఉన్న బస్టాండ్, రైల్వే స్టేషన్ల వివరాలతో పాటు అందుబాటలో ఉండే క్యాబ్, ట్యాక్సీల వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. పోటీ చేసే అభ్యర్థుల పూర్తి వివరాలు సైతం ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. అలాగే దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్నవారు, వృద్దులు తదితరులు ఈ యాప్‌లో ఉన్న ఓటరు అన్వేషణ ద్వారా ఓటరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఓటరు వివరాలు యాప్‌లో నమోదు చేసేందుకు సెర్చ్ కొడితే ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డు(ఎపిక్) సంఖ్యతో సహా పోలింగ్ కేంద్రం వివరాలు కనిపిస్తాయి. ఇది కాకుండా ఎపిక్ సంఖ్య తెలిస్తే దాన్ని నేరుగా నమోదు చేసి వివరాలను తెలుసుకోవచ్చు. దివ్యాంగుల కోసం పికప్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా వారు తమ ఎపిక్ నంబరును నమోదు చేస్తే నిర్దేశిత బీఎల్‌ఓకు పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలనే సమాచారాన్ని యాప్ ద్వారా ఎన్నికల అధికారులకు చేరవేస్తుంది. ఈ సర్వీసు వాడుకోవాలంటే ముందుగా దివ్యాంగులు తమ ఫోన్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకంటే యాప్‌లో పొందుపరిచిన బీఎల్‌వో ఫోన్ నంబరుకు ఫోన్ చేస్తే నేరుగా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్తారు. యాప్‌తో పాటు ప్రభుత్వం పంపిణీ చేసే ప్రత ఓటరు చీటీపై సంబంధిత పోలింగ్ కేంద్రం బీఎల్‌వో నంబర్‌ను ఫ్రింట్ చేస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి పీడబ్ల్యూడీ వలంటీర్లను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమిస్తుంది. యాప్‌లో పోలింగ్ కేంద్రం పేరును నొక్కితే ఆ కేంద్రంలోని సంబంధిత వలంటీర్ పేరు, హోదా, ఫోన్ నంబరు తదితర వివరాలు ఫోన్‌లో కనిపిస్తాయి. దివ్యాంగులు, వృద్దులు వలంటీర్లకు ఫోన్‌చేస్తే ప్రత్యేక వాహనంలో వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి, తిరిగి ఇంటికి తీసుకువస్తారు.

ఎన్నికల షెడ్యూల్ సమాచారం...
ఎన్నికల్లో పోటీచేసే ప్రతి అభ్యర్థి పేరు యాప్‌లో పొందుపరుస్తారు. ప్రతి నియోజకవర్గం నుంచి పోటీచేసే అభ్యర్థుల వివరాలు అందులో నిక్షిప్తమై ఉంటాయి. అభ్యర్థుల ప్రొఫైల్ ఇందులో ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల పేర్లు, వారి వివరాలు, ఫోన్ నంబర్లతో పాటు ఈ-మెయిల్ వివరాలు సైతం లబిస్తాయి. అవే కాకుండా ఎన్నికల షెడ్యూల్ సమాచారం యాప్‌లో కనిపిస్తుంది.

రవాణా సమాచారం...
పోలింగ్ కేంద్రానికి చేరుకునేలా రూట్ మ్యాప్ ఆప్షన్ ఈ యాప్‌లో ఉంది. ఓటర్లు తాము ఉన్నచోటు నుంచి ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రానికి చేరుకోవడానికి ఉన్న రూట్ మ్యాప్ పెట్టడమే కాకుండా పోలింగ్ కేంద్రం చిరునామా కూడా కనిపిస్తుంది. యాప్ కింద భాగంలో పోలిస్టేషన్, బస్టాండ్ వివరాలతో కూడిన ఆప్షన్లు ఉన్నాయి. ఓటర్లు తాము ఉన్న ప్రదేశానికి, పోలింగ్ కేంద్రానికి సమీపంలో పోలీస్‌స్టేషన్, బస్టాండ్ వివరాలను సులువుగా తెలుసుకునేలా ఎన్నికల సంఘం ఈ ఏర్పాట్లు చేసింది.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...