ఓటు పట్టనిభద్రులు


Sat,March 23, 2019 11:59 PM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గానికి శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. జిల్లాలో 27 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. వీటి పరిధిలో 12,345 మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు. ఇందులో కేవలం 6,999 మంది పట్టభద్రులు మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు. దీంతో జిల్లాలో సగటున 56.69శాతం పోలింగ్ నమోదు కాగా.. మరో 43.31శాతం మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్లు ఉండగా.. నిర్మల్ డివిజన్‌లో 19, భైంసా డివిజన్‌లో 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్మల్, భైంసా పట్టణాల్లో ఉపాధ్యాయులు, పట్టభద్రులకు వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మిగతా మండలాల్లో మాత్రం రెండింటికి కలిపి ఒకే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 8గంటల వరకు పోలింగ్ నిర్వహించగా.. పట్టభద్రుల నుంచి ఆశించిన మేర స్పందన లభించలేదు. జిల్లాలో పెద్ద సంఖ్యలో పట్టభద్రులు ఉన్నప్పటికీ.. పోలింగ్ విషయంలో పూర్తి నిర్లక్ష్యం చూపారని తెలుస్తోంది.

అత్యధికంగా బాసర మండలంలో..
జిల్లాలో 12,345మందికిగాను కేవలం 6999 మంది మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు. సగటున 56.69శాతం మంది పోలింగ్‌లో పాల్గొనగా.. అత్యధికంగా బాసర మండల పోలింగ్ కేంద్రంలో 75.96శాతం మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాసర మండలంలో మొత్తం 208మంది పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోగా.. 158మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. అత్యల్పంగా భైంసాలోని 42/ఎ పోలింగ్ కేంద్రంలో కేవలం 28.38శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక్కడ 754మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉండగా.. కేవలం 214మంది మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు. ఇక్కడ పురుషులు 31.63శాతం నమోదుకాగా.. మహిళలు 18.62శాతమే పోలింగ్‌లో పాల్గొన్నారు. ఇక సోన్ మండలంలో 44.9శాతం నమోదుకాగా.. నిర్మల్‌లోని 51/ఎ కేంద్రంలో 48.64శాతమే పోలింగ్ నమోదయింది. మిగతా అన్ని మండలాల్లో 50శాతానికిపైగా పోలింగ్ నమోదయింది. జిల్లాలో పెద్ద సంఖ్యలో పట్టభద్రులు ఉన్నప్పటికీ.. ఓటు నమోదులోనూ పెద్దగా ఆసక్తి చూపలేదు. తాజాగా పోలింగ్‌లోనూ అదే నిర్లక్ష్యం, నిరాసక్తత కనబరిచారు. దీంతో తక్కువ పోలింగ్ శాతం నమోదైంది.

చైతన్యం ప్రదర్శించిన ఉపాధ్యాయులు
జిల్లాలో ఉపాధ్యాయులు మాత్రం చైతన్యం ప్రదర్శించారు. జిల్లాలో ఉపాధ్యాయులకు సంబంధించి 1738 మంది ఓటర్లుండగా.. ఇందులో 1428 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. దీంతో జిల్లాలో సగటున 82శాతం మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి పోలింగ్ పోటెత్తారు. జిల్లాలో ఉపాధ్యాయులకు సంబంధించి.. 1074 మంది పురుషులు, 354మహిళలు శాసన మండలి ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ లెక్కన 83.64శాతం పురుషులు,
77.97శాతం మహిళా ఉపాధ్యాయులు పోలింగ్‌లో పాల్గొన్నారు.

తానూర్ మండలంలో 100శాతం ఉపాధ్యాయులు పోలింగ్‌లో పాల్గొన్నారు. 13మంది ఉపాధ్యాయులు ఉండగా.. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత కుంటాలలో 96.55శాతం పోలింగ్ నమోదుకాగా.. మెజారిటీ మండలాల్లో 80శాతానికిపైగా పోలింగ్‌లో పాల్గొన్నారు. జిల్లాలో ఆయా సంఘాలకు చెందిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేయటంతో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైనట్లు స్పష్టమవుతోంది.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...