కొనసాగుతున్న పశుగణన


Sat,March 23, 2019 11:59 PM

నిర్మల్ టౌన్: జిల్లాలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశు గణన ప్రక్రియ పూర్తికావచ్చింది. ఈ నెలాఖరులోపు అన్ని జిల్లాల్లో పశుగణను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో నిర్వహిస్తున్న పశుగణన ఇప్పటివరకూ 95శాతం పూర్తయ్యింది. ఈ నెల 31లోగా పశుగణను పూర్తిచేయడానికి అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. జిల్లాలో గత డిసెంబర్‌లో పశు గణన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం 15గ్రామీణ పశువైద్య శాలలు, 29 పశువైద్యశాలల పరిధిలో 29వైద్యుల సమక్షంలో పశుగణన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

లక్ష్యం దిశగా అడుగులు
జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాలు, మున్సిపాల్టీలో సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా గుర్తించబడిన కుటుంబ జాబితా ఆధారంగా పశు గణన నిర్వహిస్తున్నారు. జిల్లాలో లక్షా 65వేల కుటుంబాలుండగా ఇప్పటి వరకు లక్షా 55వేల 116 కుటుంబాలను సర్వే చేసిన అధికారులు పశువుల లెక్కను తేల్చేశారు. 2011 తరువాత నిర్వహిస్తున్న ఈ సర్వేకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న పాడి పశుపరిశ్రమను ప్రొత్సహించేందుకు అనేక పథకాలను అమలు చేయడంతో పశువుల లెక్క ఆధారంగానే ప్రభుత్వ నిధులు వచ్చే అవకాశం ఉండడంతో పక్కాగా పశువుల లెక్క కొనసాగుతున్నది. పశు సంవర్ధక శాఖ సిబ్బందికి పశువుల లెక్క తేల్చేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించి ట్యాబ్‌లో పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఆయా కుటుంబాలకు వెళ్లిన సిబ్బంది ఆ కుటుంబంలో పోషించుకుంటున్న తెల్లజాతి పశువులు, నల్లజాతి పశువులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, కుక్కలు , గాడిదలు, కోళ్ల వివరాలను అడిగి పూర్తి డాటాలను అందులో నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలో లక్షా 17వేల 011 తెల్లజాతి పశువులు,81.889 నల్లజాతి పశువులు, 3లక్షల 18 వేల 173 గొర్రెలు, 85వేల 075 మేకలు, 41 గుర్రాలు, 2100 పందులు, 8 గాడిదలు, 43 00 కుక్కలు, 2లక్షల 10వేల కోళ్ళు, 12 కుందేళ్ళు లెక్కలు తేల్చిన్నట్లు అధికారులు తెలిపారు.

పశువుల సంఖ్య ఆధారంగా నిధుల మంజూరు
జిల్లాలో పశు గణన లెక్క పూర్తి కావడంతో వీటి ఆధారంగానే ప్రభుత్వం నిధుల మంజూరుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. రాష్ట్రప్రభుత్వం పశు పోషణకు అత్యధికప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో పశువైద్యాన్ని మెరుగు పరిచేందుకు పలు చర్యలను తీసుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శాలల నిర్మాణంతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి, పశువులకు సక్రమించే వ్యాధుల నివారణకు ఉపయోగించే మందులు, బడ్జెట్ వీటి ఆధారంగానే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పశుగణనకార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సురేశ్‌కుమార్ తెలిపారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...