ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం


Sat,March 23, 2019 12:03 AM

- జిల్లాలోముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
- పట్టభద్రులు 56.69 శాతం, ఉపాధ్యాయులు 82 శాతం
- సగానికే పరిమితమైన పట్టభద్రుల పోలింగ్
- పోటెత్తిన ఉపాధ్యాయ ఓటర్లు
- పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్, జేసీ


నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో శుక్రవారం శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా సాగింది. పట్టభద్రులకు సంబంధించి 56.69 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఉపాధ్యాయులకు సంబంధించి 82శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 27 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఉపాధ్యాయ ఓటర్లు పోటెత్తారు. ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల సంఘం అవగాహన కార్యక్రమాలు, స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించినా పట్టభద్రులకు సంబంధించి సగం మంది ఓటర్లే పోలింగ్‌లో పాల్గొనడం గమనార్హం. పోలింగ్ సరళిని కలెక్టర్ ప్రశాంతి, జేసీ భాస్కర్‌రావు పరిశీలించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం, ఉపాధ్యాయుల నియోజకవర్గానికి శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించగా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. జిల్లాలో 12,345 మంది పట్టభద్రుల ఓటర్లుండగా.. ఇందులో నుంచి 6,999 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. 56.69 శాతం పోలింగ్ నమోదు కాగా.. 43శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఉపాధ్యాయులకు సంబంధించి 1738 మంది ఓటర్లుండగా.. ఇందులో 1428 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. దీంతో జిల్లాలో సగటున 82శాతం మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి పోలింగ్ పోటెత్తగా.. పట్టభద్రులకు సంబంధించి సగం మంది మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు. పట్టభద్రులు పోలింగ్ పట్ల ఆసక్తి చూపలేదని పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే తెలుస్తోంది.

డివిజన్ల వారీగా పోలింగ్ సరళి
జిల్లాలో 12,345 మంది పట్టభద్రులైన ఓటర్లుండగా.. ఇందులో 8461 మంది పురుషులు, 3884 మహిళ ఓటర్లు ఉన్నారు. 6999 మంది పోలింగ్‌లో పాల్గొనగా.. ఇందులో 5225 మంది పురుషులు, 1774 మంది మహిళలు పోలింగ్‌లో పాల్గొన్నారు. సగటున 61.45శాతం మంది పురుషులు, 45.67శాతం మంది మహిళలు పోలింగ్‌లో పాల్గొన్నారు. డివిజన్‌ల వారీగా చూస్తే నిర్మల్ డివిజన్‌లో 9020 మంది ఓటర్లుండగా.. 5987 మంది పురుషులు, 3033 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. డివిజన్‌లో 52.05 మంది పోలింగ్‌లో పాల్గొనగా.. ఇందులో 3786 మంది పురుషులు, 1419 మంది మహిళలు ఉన్నారు. నిర్మల్ డివిజన్‌లో 57.71 శాతం పట్టభద్రుల పోలింగ్ నమోదైంది. భైంసా డివిజన్‌లో 3325 మంది పట్టభద్రుల ఓటర్లుండగా.. ఇందులో 2474 మంది పురుషులు, 851 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. మొత్తం 1794 మంది ఓటింగ్‌లో పాల్గొనగా.. 1439 మంది పురుషులు, 355 మంది మహిళ పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. భైంసా డివిజన్‌లో 53.95శాతం పట్టభద్రుల పోలింగ్ నమోదైంది.

ఉపాధ్యాయులకు సంబంధించి 1738 మంది ఓటర్లుండగా.. 1284 మంది పురుషులు, 454 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. ఇందులో 1428 మంది పోలింగ్‌లో పాల్గొనగా.. ఇందులో 1074 మంది పురుషులు, 354మహిళలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. 83.64శాతం పురుషులు, 77.97శాతం మహిళలు పోలింగ్‌లో పాల్గొన్నారు. డివిజన్‌లో వారీగా చూస్తే నిర్మల్ డివిజన్‌లో 1179 మంది ఉపాధ్యాయ ఓటర్లుండగా.. ఇందులో 839 మంది పురుషులు, 340 మంది మహిళ ఓటర్లుగా ఉన్నారు. 955 మంది పోలింగ్‌లో పాల్గొనగా.. 714 మంది పురుష ఓటర్లు, 271 మంది మహిళ ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. నిర్మల్ డివిజన్‌లో 83.55శాతం ఉపాధ్యాయుల పోలింగ్ నమోదైంది. భైంసా డివిజన్‌లో 559 మంది ఉపాధ్యాయ ఓటర్లుండగా.. ఇందులో 445 మంది పురుషులు, 114 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. మొత్తం 443 మంది ఉపాధ్యాయులు పోలింగ్‌లో పాల్గొనగా.. 360 మంది పురుషులు, 83 మంది మహిళలు ఓటు వేశారు. భైంసా డివిజన్‌లో 79.25శాతం ఉపాధ్యాయుల పోలింగ్ నమోదైంది.

జిల్లాలో 27 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. నిర్మల్ డివిజన్‌లో 19, భైంసా డివిజన్‌లో 8 పోలింగ్ కేంద్రాలున్నాయి. కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, జేసీ పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఎం.ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎ.భాస్కర్‌రావు పరిశీలించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని పోలింగ్ కేంద్రాన్ని, సోన్, దిలావర్‌పూర్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించగా.. జాయింట్ కలెక్టర్ ఎ.భాస్కర్‌రావు నిర్మల్ ఎంపీడీవో కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంతో పాటు ఖానాపూర్, కడెం, మామడ మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి అల్లోల, జేసీ
రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెం.50లో ఓటు వేశారు. జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...