25న నగేశ్ నామినేషన్


Fri,March 22, 2019 02:48 AM

నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసింది. వచ్చే నెల 11న జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం ఆదిలాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గొడాం నగేశ్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నగేశ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనను టీఆర్‌ఎస్ మరోసారి బరిలోకి దింపుతున్నది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసినకేసీఆర్ గురువారం సాయంత్రం అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎస్టీ రిజర్వు స్థానమైన ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి మరోసారి సిట్టింగ్ ఎంపీ నగేశ్‌కే అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన నగేశ్.. తాజాగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆయన పేరును అధికారికంగా ప్రకటించడంతో నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 25న నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో..
బోథ్ నియోజకవర్గానికి చెందిన గొడాం నగేశ్ గొండు సామాజిక వర్గానికి చెందినవారు. బజార్‌హత్నూర్ మండలం జాతర్ల గ్రామ వాస్తవుడైన ఆయన రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది. మాజీ మంత్రి గొడాం రామారావుకు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో టీడీపీ నుంచి బోథ్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి కే.చౌవాన్‌పై విజయం సాధించారు. 1999లో మరోసారి టీడీపీ నుంచి పోటీ చేయగా... కాంగ్రెస్ అభ్యర్థి కొడప కోసురావుపై గెలిచారు.

2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సోయం బాపురావు చేతిలో ఓడిపోయారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి అనిల్‌జాదవ్‌పై విజయం సాధించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి ఆదిలాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆయన తండ్రి గొడాం రామారావు రెండుసార్లు గెలువగా, గతంలో ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేస్తే, నగేశ్ చంద్రబాబు క్యాబినెట్‌లో పనిచేశారు. ఇలా తండ్రి, కొడుకులు ఇద్దరూ మంత్రులైన ఘనత వీరికే దక్కింది.

వివాదరహితుడిగా పేరు
2014లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన భారీ ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిచారు. తాజాగా కూడా ఎంపీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ పార్టీ ఆయనకే అవకాశం కల్పించింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండడం, వివాదాలకు దూరం ఉండడం, అందరినీ కలుపుకొని పోవడంతో ఆయనకు మరోసారి అవకాశం లభించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో క్యాడర్‌తో మంచి సంబంధాలు ఉండడం, లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమన్వయం, సత్సాబంధాలు ఉన్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వు కాగా.. మిగతా నాలుగు నియోజకవర్గాలు జనరల్ స్థానాలుగా ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లోని క్యాడర్‌తో ఆయనకు మంచి సంబంధాలుండడంతో బాగా కలిసి వస్తోంది. గొండు సామాజిక వర్గానికి చెందిన ఆయన లంబాడ, ఇతర వర్గాల వారితోనూ సత్సబంధాలు ఉండడం అందరి పనులను చేయడం, అందరిని కలుపుకోని పోవడంతో ఆయనకు అందరి మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలు, ప్రజల్లో టీఆర్‌ఎస్, ప్రభుత్వంపై ఉన్న పూర్తి సానుకూలతతో ఆయన గెలుపు మరింత సులువు కానుంది.

టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి గొడాం నగేశ్ బయోడేటా
తల్లిదండ్రులు : గొడం రామారావు, భీంబాయి.
భార్య : లత
పిల్లలు : మనోజ్ఞ (కూతురు),
రిత్విక్ (కుమారుడు)
పుట్టిన తేది : 21.10.1964
విద్యార్హత : ఎంఏ, ఎంఈడీ
(ఉస్మానియా యూనివర్సిటీ)
ఉద్యోగ ప్రస్థానం : 1989నుంచి 94 వరకు స్కూల్ అసిస్టెంట్‌గా పని చేశారు.
చేపట్టిన పదవులు : 1994 నుంచి 99వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గిరిజన, వికలాంగుల సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. 1999 నుంచి 2003 వరకు ఎమ్మెల్యేగా, గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేశారు.
2000 నుంచి 2003 వరకు పీఏసీ మెంబర్‌గా ఉన్నారు.
2001 నుంచి 2003 వరకు 610జీవో హౌజ్ కమిటీ మెంబర్‌గా పని చేశారు.
2010 నుంచి 2014 వరకు అసెంబ్లీ వెల్ఫేర్ కమిటీలో పని చేశారు. హెచ్‌ఆర్‌డీ బడ్జెట్ స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా కొనసాగారు.
2014 సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో బొగ్గు ఖనిజాల స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా, సోషల్ జస్టీస్, ఇన్‌పవర్‌మెంట్ కాన్సిలేటివ్ కమిటీలో సైతం సభ్యునిగా ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...