మొదటి ప్రాధాన్యత ఓటే కీలకం


Fri,March 22, 2019 02:46 AM

నేరడిగొండ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటే కీలకమైనది. ఈ ఎన్నికల్లో గెలుపు ఎక్కువ శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లపైనే ఆధారపడి ఉంటుంది. ఓటర్లు వేసే మొదటి ప్రాధాన్యత ఓటుపైనే అభ్యర్థుల ఆశలుంటాయి. గెలుపోటములు నిర్ణయించేది కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లే. అలాంటి ఓటును ఇద్దరు, ముగ్గురికి వేస్తే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. అందుకే ఓట్ల లెక్కింపు సమయంలో ముందుగా మొటి ప్రాధాన్యత ఓట్లనే లెక్కిస్తారు.

ఇలా ఓటువేస్తారు..
2019 ఎమ్మెల్సీ ఎన్నికలను ఓటర్లు బ్యాలెట్ ద్వారా వినియోగించుకోనున్నారు. ఆయా ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు ఆ బ్యాలెట్ పేపర్‌లో వరుస క్రమంలో ఉంటా యి. అయితే ఓటరు మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నాడో ఆ అభ్యర్థి పేరుకు నేరుగా ఉన్న ఖాళీ స్థలం లో (1) ఒకటి అని రాయాల్సి ఉంటుంది. అనంతరం రెండో ప్రాధాన్యత ఓటు, మూడో ప్రాధాన్యత ఓటు కూడా ఏయే అభ్యర్థులకు వేస్తారో వారి పేర్లకు ఎదురుగా ఉన్న స్థలంలో (2),(3) లను రాయాల్సి ఉంటుంది. ఇద్దరు అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు (అంటే ఇద్దరు అభ్యర్థుల పేర్ల పక్కన ఒకటి నంబరు రాయడం)చేస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదు. రెండు, మూడు ప్రాధాన్యత గల ఓటును ఇద్దరు అభ్యర్థులకు వేసినా లెక్కింపు సమయంలో ఆ బ్యాలెట్‌ను పక్కన పెట్టే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. కాగా, ఉపాధ్యాయుల, పట్టభద్రుల స్థానాలకు వినియోగించే బ్యాలెట్ పేపర్లు రెండు రంగుల్లో ఉండనున్నాయి.

లెక్కింపులో ప్రాధాన్యత ఓట్లే కీలకం..
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులోనూ మొదటి ప్రాధాన్యత ఓటునే ముందుగా లెక్కిస్తారు. పట్టభద్రుల స్థానానికి ఐదుగురు పోటీ చేస్తున్నారనుకుందాం. ఆ ఐదుగురు అభ్యర్థులకు ఒక్కొక్కరికి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎన్ని వచ్చాయనేది లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువగా వస్తాయో ఆ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటిస్తారు. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లు ఇద్దరు అభ్యర్థులకు సమానంగా వస్తే.. రెండో ప్రాధాన్యత ఓట్లను పరిగణలోకి తీసుకొని లెక్కిస్తారు. రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువగా వస్తే..వారే విజయం సాధించినట్లుగా ప్రకటిస్తారు. రెండో ప్రాధాన్యతలో కూడా సమానంగా వస్తే..మూడో ప్రాధాన్యత పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దాదాపు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది మొదటి ప్రాధాన్యత ఓట్లేనని, కొన్ని సందర్భాల్లో మాత్రమే రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకంగా మారే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

రెండు వేళ్లకు సిరా చుక్కలు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న ఓటర్లకు రెండు వేళ్లకు సిరా గుర్తులు పెట్టనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓటు వేసిన ఓటర్లకు కుడిచేయి మధ్య వేలికి సిరా గుర్తు వేయనుండగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓటు వేసిన ఓటర్లకు కుడి చేయి చూపుడు వేలుకు సిరా గుర్తు పెట్టనున్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...