ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం..!


Wed,March 20, 2019 02:15 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దమైంది. ఈనెల 22న పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసన మండలి స్థానానికి పోలింగ్ నిర్వహించ నున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా.. ఇందుకోసం అవస రమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. జిల్లాలో 27 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. నిర్మల్ రెవెన్యూ డివిజన్‌లో 19, భైంసా రెవెన్యూ డివిజన్‌లో 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిర్మల్ పట్టణంలో 4, మిగతా మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఓటర్లు తక్కువ గా ఉన్నచోట రెండింటికి కలిపి ఒకే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని నిర్మల్‌లో రెండు, భైంసాలో ఒక చోట మాత్రమే వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగతా అన్ని మండలాల్లో ఒకే పోలింగ్ కేంద్రం రెండింటికి కలిపి ఉంది. నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో రెండు, మండల పరిషత్ కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాలున్నాయి.

సిబ్బంది నియామకం
ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కూడా నియమించారు. ఇప్పటి కే భైంసా, నిర్మల్ డివిజన్‌లకు స్థానిక ఆర్డీవోలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికా రులుగా నియమించారు. అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలను నోడల్, రూట్ అధికారులుగా నియమించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక పీవో, ఒక ఏపీవో, ఇద్దరు సహాయకులను నియమిం చారు. మొత్తం 109 మంది పోలింగ్ అధికారులను నియమించగా.. విద్యాశాఖ మినహా మిగతా శాఖల అధికారులను పోలింగ్ నిర్వహ ణకు నియమించారు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, అగ్రికల్చర్, సంక్షేమ శాఖల సిబ్బందిని పోలింగ్ నిర్వహణలో వినియోగిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం లో అన్ని శాఖల వారు ఉండేలా చూస్తున్నారు. ఉపాధ్యాయుల స్థానానికి ఏజెంట్లుగా రిటైర్డు ఉపాధ్యాయులను మాత్రమే నియమించుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. పట్టభద్రుల స్థానానికి మాత్రం ఎవరినైనా నియమించుకోవచ్చని తెలిపింది.

కేంద్రాలకు చేరినపోలింగ్ సామగ్రి
పోలింగ్ బ్యాలెట్ పద్ధతిన నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సామగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపించారు. బ్యాలెట్ విధానంలో నిర్వహించే ఈ ఎన్నికల్లో నోటా లేదు. ప్రాధాన్యత క్రమంలో ఓటును వేయవచ్చు. పోలింగ్ సిబ్బంది ఇచ్చిన పర్పుల్ రంగు పెన్నునే వినియోగించాల్సి ఉంటుంది. సాధారణంగా ఓటర్లకు కుడిచేతి చూపుడు వేలిపై సిరా వేస్తారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులుగా రెండు ఓట్లు ఉన్న వారికి కుడిచేతి మధ్య వేలుకు కూడా వేస్తారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ నిర్వహించారు. పట్టభద్రుల స్థానానికి 17 మంది పోటీ చేస్తుండగా.. ఉపాధ్యాయుల స్థానానికి ఏడుగురు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కొన్ని రోజులుగా హోరాహోరీగా అభ్యర్థులు ప్రచారం నిర్వహించగా...నేటి సాయంత్రం 4 గంటలతో ప్రచారపర్వానికి తెర పడనుంది. 48 గంటల పాటు వైన్స్‌లు, బార్లు మూసివేయనున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు సాయంత్రం 4గంటలకు బ్యాలెట్ బాక్స్‌లను కరీంనగర్‌కు తీసుకెళ్తారు. ఓట్ల లెక్కింపు కూడా అక్కడే చేపడతారు. ఈ నెల 22న నిర్వహించనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జేసీ భాస్కర్‌రావు తెలిపారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...