హస్తవ్యస్తం!


Sun,March 17, 2019 02:59 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కోలుకోలేని దెబ్బలు, షాక్‌లు తగులుతున్నాయి. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో ఉన్న పార్టీకి.. తాజాగా పార్లమెంట్ ఎన్నికల వేళ సొంత పార్టీ నాయకులే చుక్కలు చూపిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వంలో సమన్వయ లోపం, జాతీయ నాయకత్వం పట్టించుకోకపోవడంతో.. కీలక నాయకులు, సీనియర్లు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. జాతీయ, రాష్ట్ర నాయకత్వంపై నమ్మకం కోల్పోవడంతో.. ఇప్పటికే పలువురు ముఖ్య నాయకులు పార్టీని వీడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇందులో తొమ్మిది స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఒక్క ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆత్రం సక్కు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కూడా ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. టీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమం కోసం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని.. ఆయనకు మద్దతుగా నిలవాలని భావించి కాంగ్రెస్‌ను వీడారు. దీంతో జిల్లాలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయారు.

సోయం చూపు..బీజేపీ వైపు
తాజాగా కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. బోథ్ అసెంబీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సోయం బాపురావు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్ బరిలో నిలిచే ఆ పార్టీ అభ్యర్థుల జాబితాలో సోయం బాపురావు పేరు కూడా ఉండడం కలకలం రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉండగా.. నేడో, రేపో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరుతారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సోయం బాపురావు.. గోండు సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన తాజాగా ఎంపీ టికెట్ కూడా ఆశించగా.. లంబాడా సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ పేరును ఖరారు చేశారు. దీంతో కాంగ్రెస్‌లో టికెట్ దక్కని ఆశావహులు.. బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న గోండు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కీలక నాయకులు ఆత్రం సక్కు, సోయం బాపురావు పార్టీ వీడడంతో ఆ పార్టీకి దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు సీనియర్లు, కీలక నాయకులు పార్టీ వీడడంతో కలవరం మొదలైంది.

సొంత పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు
మరోవైపు రాథోడ్ రమేశ్‌ను లోక్‌సభ అభ్యర్థిగా ఖరారు చేయడంతో.. సొంత పార్టీలోనే అసంతృప్తి మొదలైంది. 2014ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నరేశ్ జాదవ్.. తాజాగా కూడా లోక్‌సభ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయకుండా ఉన్నారు. తనకు లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉంచాలని భావించి.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ముందుకు రాలేదు. తాజాగా ఆయనను కాదని.. రాథోడ్ రమేశ్‌కు ఇవ్వడంతో ఆయనలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పని చేస్తున్న వారిని కాదని.. కొత్తగా పార్టీలో చేరిన వారికి, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చెందిన వారికి మళ్లీ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించడం సరికాదని మండిపడుతున్నారు. తనకు అవకాశం ఇవ్వాలని కోరినా.. పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆయన నిర్ణయం ఏంటనేది వేచి చూడాలి. అటు ఆత్రం సక్కు పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరడం, సోయం బాపురావు పార్టీని వదిలి బీజేపీలో చేరుతుండడం, నరేశ్ జాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉండడం, మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి వర్గం ఈ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో.. పార్లమెంట్ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో కాంగ్రెస్ నాయకులకు అర్థం కాకుండా ఉంది. ఎన్నికలకు ముందే వరుస షాక్‌లతో ఆ పార్టీ విలవిలలాడుతోంది.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...