పదికి పకడ్బందీ ఏర్పాట్లు


Thu,March 14, 2019 12:29 AM

నిర్మల్ అర్బన్,నమస్తే తెలంగాణ : పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 16వ తేదీ నుంచి సెకండరీ బోర్డు పరీక్షలను నిర్వహించనుంది. ఇందుకోసం విద్యాశాఖ ఆధ్వర్యంలో డీఈవో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు పరీక్షా కేంద్రాల ఏర్పాటు, అక్కడ మౌలిక సదుపాయాలైన తాగు నీరు, మరుగుదొడ్లు, విద్యార్థులు పరీక్ష రాసేందుకు బల్లాలు, ప్యాన్‌లు ఏర్పాటు చేయించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు పరీక్షా సమయాల్లో విద్యుత్ కోతను విధించవద్దని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగకుండా ఉండేందుకు జిల్లాలోని 46 పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్‌ను అమలు పర్చడంతో పాటు చుట్టు పక్కల జిరాక్స్ కేంద్రాలను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా 217 పాఠశాలల నుంచి 9707 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాలు..
జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జి ల్లాలో 217 పాఠశాలలు ఉండగా ఇందులో 140 ప్ర భుత్వ పాఠశాలలు కాగా 77 ప్రైవేటు పాఠశాలలు ఉన్నా యి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం 9707 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల నుంచి 6571మంది రెగ్యులర్ విద్యార్థులు, 3136 మంది ప్రైవేటు పాఠశాలల రెగ్యులర్ విద్యార్థుతో పాటు 647 ప్రైవేటు విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. విద్యార్థుల కోసం మొత్తం 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసారు. ఇందులో రెండు ప్రైవేటు పాఠశాలు, 44 ప్రభుత్వ పాఠశాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ పూర్తయింది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల హాల్ టికెట్ పంపిణీకి ఇబ్బందుకి గురి చేస్తే విద్యాశాఖకు ఫిర్యాదు చేయాలని, తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు.

పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక దృష్టి..
పదో తరగతి పరీక్షల సందర్భంగా పోలీస్ స్టేషన్ లేని పరీక్షా కేంద్రాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో పోలీస్ స్టేషన్ లేని పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏడు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో నిర్మల్ నియోజక వర్గంలో మూడు, ముథోల్ నియోజక వర్గంలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో జడ్పీఎస్‌ఎస్ ఆష్టా, జడ్పీఎస్‌ఎస్ బోసి, జడ్పీఎస్‌ఎస్ బీరవెల్లి, జడ్పీఎస్‌ఎస్ వడ్యాల్, జడ్పీఎస్‌ఎస్ తానూర్, జడ్పీఎస్‌ఎస్ తిమ్మాపూర్, గురకుల పాఠశాల లెఫ్ట్ పోచంపాడ్ ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఏంఈవోలు, సిట్టింగ్ స్కాడ్‌ను నియమించి పరీక్షలను ప్రశాంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా వీటిపై పోలీస్ నిఘా కూడా పటిష్ఠం చేశారు.

మాస్ కాపీయింగ్ నిరోధించేందుకు ప్రత్యేక బృందాలు..
పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రతీ పరీక్షా కేంద్రంలో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీస్ నిఘాను ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా పరీక్షా జరిగే సమయాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో అబ్జర్వర్లు, సిట్టింగ్‌స్కాడ్, ఫ్లయింగ్ స్వాడ్ బృందాలను ఏర్పాటు చేసి మాస్ కాపీయింగ్ నిరోధానికి చర్యలు చేపట్టారు. గతంలో జిల్లాలో పలు సెల్ఫ్ సెంటర్లలో ఇన్విజిలెటర్లు విద్యార్థులను మాల్ ప్రాక్టీస్‌కు ప్రోత్రహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ పాఠశాలలోనైనా ఇన్విజిలెటర్లు మాల్ ప్రాక్టీస్‌ను ప్రోత్సహిస్తే ఇన్విజిలెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

గంట ముందే చేరుకోవాలి..
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సెల్‌ఫోన్‌లు, క్యాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఎట్టి పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాలకు తీసుకురావద్దని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైతే ఆరోగ్య సిబ్బందిని నియమించారు.

మెరుగైన స్థానం సాధిస్తాం..
గతేడాది నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మెరుగైన ఫలితాలను సాధించి మంచి స్థానంలో నిలించేందుకు విద్యాశాఖ, ఉపాధ్యాయులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఉత్తీర్ణత శాతం పెంచడంతో పాటు మెరుగైన జీపీఏ సాధించేందుకు పాఠశాల ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు తీసుకున్నారు. దీంతో రాష్ట్ర స్థాయిలో మెరుగైన స్థానం సాధిస్తామన్న నమ్మకం ఉంది.
- టామ్నె ప్రణీత, డీఈవో

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...