ప్రతి ఇంటికీ నల్లా!


Sun,February 17, 2019 03:12 AM

నిర్మల్ టౌన్: ప్రభుత్వం పట్టణవాసులకు మరో వరం ప్రకటించింది. ఇక నుంచి అన్ని మున్సిపాలిటీల్లో వం రూపాయలకే నల్లా కనెక్షన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వాలని, ఏపీఎల్ కుటుంబాలకు రూ. 100కు ఇవ్వాలని మున్సిపల్‌శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో పదివేల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీ పాలనపై ప్రత్యేక దృషిసారించింది. అనేక సంస్కరణలు చేపట్టి పరిపాలనలో పారదర్శకత పెంచింది. ఇందులో భాగంగానే మిషన్ భగీరథ ద్వారా ప్రతి కుటుంబానికి శుద్ధ జలాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియను మే నెలాఖరు వరకు పూర్తి చేయనున్న నేపథ్యంలో పట్టణ, మున్సిపాలిటీలో ప్రతి కుటుంబానికి నల్లా కనెక్షన్ ఇచ్చే విధంగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

జిల్లాలో పదివేల మందికి లబ్ధి.
జిలా కేంద్రంతో పాటు భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. నిర్మల్‌లో 36 వార్డులు ఉండగా.. లక్షా 20వేల పైచిలుకు జనాభా ఉంది. 20,235 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికే వీటిలో 10,300 కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఖానాపూర్ మున్సిపాలిటీలో 11 వార్డులుండగా.. 26,566 జనాభా నివాసిస్తున్నారు. ఇందులో 6,340 కుటుంబాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో 2,700 కుటుంబాలకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. భైంసా మున్సిపాలిటీలో మొత్తం 60వేల జనాభా ఉండగా.. 14 వేల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికే ఎనిమిది వేలకు పైగా నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీలో ప్రతి కుటుంబానికి నల్లా కనెక్షన్ ఇవ్వాల్సిందే. ఈ లెక్కన ఇప్పటికే నల్లా కనెక్షన్ కోసం నిర్మల్ మున్సిపాలిటీలో ఐదు వేల దరఖాస్తులు రాగా.. ఖానాపూర్‌లో 3,300, భైంసాలో నాలుగు వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. పట్టణంలో మిషన్ భగీరథ పనులు పూర్తి కాగానే నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలో బీపీఎల్ కుటుంబాలకు కేవలం రూపాయికి, ఏపీఎల్ కుటుంబాలకు రూ.100లకే కనెక్షన్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదివరకు మున్సిపాలిటీలో నల్లా కనెక్షన్ పొందాలంటే మున్సిపాలిటీకి రూ.6వేల డిపాజిట్ చేయాల్సి ఉండేది. దీనికితోడు నల్లా సామగ్రి ఖర్చు యజమాని భరించుకోవాల్సి వచ్చేది. కానీ కొత్త పథకంలో ఇవన్నీ ప్రభుత్వమే సమకూర్చి నామమాత్రపు రుసుముతో కనెక్షన్ ఇవ్వనుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నల్లా కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని అనుమతి కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న కుటుంబాలకు ప్రభుత్వమే ప్రచారం నిర్వహించి కనెక్షన్ ఇవ్వనుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రెండు, మూడేండ్లుగా పట్టణంలో పిల్లల చదువుల కోసం ఉద్యోగాల కోసం, ఇతర వ్యాపారం, అవసరాల కోసం పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇవ్వాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంది. గతంలో నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చెల్లిస్తేనే అధికారులు నల్లా కనెక్షన్ ఇచ్చేవారు. ప్రభుత్వ నిర్ణయంతో పరిస్థితి పూర్తిగా మారిపోవడంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో కలిసి పదివేల మందికి పైగానే ప్రయోజనం పొందనుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...