పాలనలో పారదర్శకత


Fri,February 15, 2019 12:10 AM

నిర్మల్ టౌన్: ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాల్లో సమయపాలన పాటించేందుకు, పాలన పారదర్శకత అమలుచేసేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ ప్రశాంతి ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో ఉన్న 64 ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ కచ్చితంగా అమలు చేయనున్నారు. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానానికి మూడు నెలల క్రితమే శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల, మెటర్నటి దవాఖానా, ఎంపీడీవో కార్యాలయం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జిల్లా కార్యాలయంలో, పంచాయతీరాజ్‌శాఖ, ఇరిగేషన్, పౌర సరఫరాలశాఖ, తహసీల్దార్, ఆర్‌అండ్‌బీ, డీఆర్‌డీఏ, విద్యాశాఖ, వ్యవసాయశాఖ, పశు సంవర్ధకశాఖ, మార్కెటింగ్‌శాఖ, మున్సిపాలిటీ, ట్రెజరీ, ఐసీడీఎస్ తదితర శాఖల కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రతిరోజు ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు వచ్చేందుకు తప్పనిసరిగా వేలిముద్రలు వేసి తిరిగి వెళ్లేటప్పుడు బయోమెట్రిక్‌తోనే వెళ్లాల్సి వస్తోంది.

ఉద్యోగుల్లో వచ్చిన మార్పు...
వివిధ కార్యాలయాల్లో పనిచేసే జిల్లా అధికారితో మొదలుకొని కిందిస్థాయి అటెండర్, వాచ్‌మన్ వరకు ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ హాజరు శాతం ఉండాల్సిందేనని కలెక్టర్ ఆదేశించారు. దీంతో అధికారులు కూడా ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో సకాలంలో హాజరవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు గతంలో 11 దాటిన కార్యాలయానికి వచ్చేవారు కాదు. కొందరు జిల్లాస్థాయి అధికారులైతే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి అప్పుడప్పుడు వచ్చి మధ్యాహ్నం 2 గంటల్లోపే తిరిగి ఇంటికి వెళ్లిపోయేవారు. జిల్లా ఉన్నతాస్థాయి అధికారులైతే ఆ శాఖకు సంబంధించిన ఫైళ్లను వారు ఉండే నివాసానికే తెప్పించుకుని ఉద్యోగ నిర్వహణ చేసేవారు. కలెక్టర్ కొన్ని కార్యాలయాలను అకస్మికంగా తనిఖీ చేయడంతో సమయపాలన పాటించని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తే ఉద్యోగులు క్రమం తప్పకుండా సమయపాలన కూడా పాటిస్తారని భావించి బయోమెట్రిక్ అమలుకు ఆదేశించారు. ఈ విధానంతో ఇప్పటికే ప్రభుత్వ శాఖలైన తహసీల్ డీఆర్‌డీఏ, మున్సిపల్, కలెక్టర్, పంచాయతీరాజ్, నీటిపారుదలశాఖ, తదితర కార్యాలయాల్లో ఉదయం 10 గంటలకే ఉద్యోగులు తప్పనిసరిగా ప్రభుత్వ కార్యాయాలకు చేరుకుని విధులకు హాజరవుతున్నారు. తిరిగి సాయంత్రం 5 గంటల తర్వాతనే వెళ్తున్నారు. జిల్లాస్థాయి అధికారులకు బయోమెట్రిక్‌లో మినహాయింపు ఇవ్వగా.. మిగతా వారందరూ కూడా బయోమెట్రిక్‌లో హాజరు కచ్చితంగా పాటిస్తుండటంతో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.

కలెక్టరేట్‌లో బయోమెట్రిక్ అనుసంధానం...
హెచ్‌సీఎల్ కంపెనీ సౌజన్యంతో ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ మిషన్‌లను ఏర్పాటు చేసి ఆన్‌లైన్ సేవల ద్వారా ఇంటర్‌నెట్ ఉపయోగించి కలెక్టరేట్ కంట్రోల్ కార్యాలయానికి అనుసంధానం చేస్తున్నారు. ఈప్రక్రియను జిల్లా ఈ-మేనేజర్ నదీం పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు కలెక్టర్ కార్యాలంయలో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌లో జిల్లాలో ఉద్యోగుల హాజరుశాతాన్ని కలెక్టరే స్వయంగా పరిశీలిస్తున్నారు. వరుసగా మూడు రోజుల పాటు విధులకు ఆలస్యంగా వచ్చిన వారికి నోటీసులు జారీ చేయడమే కాకుండా ఒక్క సీఎల్‌ను అమలు చేస్తున్నారు. అలాగే ప్రతిరోజు విధులకు సమయానుకులంగా రాకుంటే చర్యలు తీసుకునేందుకు జిల్లా అధికారికి ఆదేశాలు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా బయోమెట్రిక్ విధానంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టిపెట్టి ఎంపీడీవో, తహసీల్, పీహెచ్‌సీల్లో అమలు చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను ఈనెల చివరి వరకు అన్ని కార్యాలయాల్లో అమలు చేయాలని సూచించారు. బయోమెట్రిక్ ఏర్పాటుకు రూ. 16వేల ఖర్చు అవుతుందని, మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...