సాగు సరికొత్తగా..


Wed,February 13, 2019 12:50 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ సర్కారు మరో బృహత్తర సర్వేకు సిద్ధమైంది. రైతు ఆదాయాన్ని పెంచి.. వారిని రాజు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలు, మిషన్ కాకతీయ, సాగుకు 24గంటల పాటు ఉచిత విద్యుత్తు, భూరికార్డుల ప్రక్షాళన, కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, పెద్ద ఎత్తున గోదాంల నిర్మాణం, రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయటం ఇలా.. అనేక కార్యక్రమాలు చేపడుతోంది. సమగ్ర కుటుంబ సర్వే, భూరికార్డుల ప్రక్షాళన మాదిరిగానే మరో బృహత్తర సర్వేకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉద్యాన వన శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖతో కలిసి నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇంటింటికీ తిరిగి రైతుల నుంచి సమగ్ర వివరాలు సేకరించేందుకు ఏఈవోలతో సమగ్ర సర్వే చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన విధి విధానాలు జిల్లా వ్యవసాయ శాఖకు అందాయి. మరో వారం రోజుల్లో సమగ్ర సర్వే చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రైతుల వారీగా సమగ్ర సర్వే చేపట్టగా.. రైతుకు సంబంధించిన సమగ్ర వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇకపై పంటల వారీగా సర్వే చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

అన్నదాతల అభిప్రాయాల సేకరణ
జిల్లాలో 4లక్షల ఎకరాల వరకు సాధారణ సాగు ఉండగా.. వర్షాకాలంలో పూర్తిగా సాగవుతోంది. యాసంగిలో మాత్రం లక్ష ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా పత్తి, వరి, సోయాబీన్, మొక్కజొన్న సాగు చేస్తుండగా.. అక్కడక్కడ పసుపు, పప్పుధాన్యాలు సాగు చేస్తున్నారు. ఉద్యాన వన శాఖకు సంబంధించి పలు చోట్ల కూరగాయలు, పండ్లు, పూల తోటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో పండించే పంటలకు మద్దతు ధర లభించేలా.. రైతు ఆదాయం పెంచడంపై సర్కారు దృష్టి సారించింది. ఒకే ప్రాంతంలో రైతులు ఎక్కువగా పండించే పంటలను సర్వే చేశాక.. వాటికి అనుబంధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఏయే పంటలు సాగు చేస్తున్నారు.. ఎంతమేర సాగు చేస్తున్నారు.. స్థానికంగా ఉన్న భూముల స్వభాగం, వర్షపాతం, ఉష్ణోగ్రత, వాతావరణం, పంటల దిగుబడిపై సర్వే చేయనున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏయే పంటలు వేయాలనేది తేలనుంది. స్థానికంగా పండించే పంటలకు సరైన ధరలు రాకపోవడంతో రైతులు నష్టపోతుండగా.. దళారులు లబ్ధి పొందుతున్నారు. మధ్యవర్తి వ్యవస్థ లేకుండా.. స్థానికంగా రైతులు పండించే పంటలకు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగా ఎలాంటి యూనిట్లు ఏర్పాటు చేయాలో రైతుల అభిప్రాయాలు కూడా సేకరించనున్నారు.

యువతకు ఉపాధి
జిల్లాలోని నిర్మల్ ప్రాంతంలో పసుపు పండిస్తుండగా.. ఆర్మూర్‌లో పసుపు యూనిట్, భైంసా, ముథోల్ ప్రాంతాల్లో పత్తి ఉండగా.. కాటన్ ఇండస్ట్రీ, సోయాబీన్ ఉన్న చోట సోయాబిన్ పాలు, నూనె, సేమియా, సోయా స్టిక్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ నెలకొల్పుతారు. వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటే ఈ సర్వేలో ఉద్యాన వన శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ కూడా భాగస్వాములు కానున్నారు. వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలు ఉండగా.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ కీలక పాత్ర పోషించనుంది. ఇక రానున్న రోజుల్లో నియోజకవర్గానికి 1,2 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సర్కారు నిర్ణయించగా.. ఐకేపీ సంఘాల ద్వారా నిర్వహణ చేయాలని భావిస్తున్నారు. పంట కాలనీలతో దిగుబడి పెరగటం, ఆహార శుద్ధి యూనిట్లతో పంటలకు మద్దతు ధర లభించి.. రైతుల ఆదాయం పెరగనుంది. ఈ యూనిట్లతో యువతకు ఉపాధి లభించనుంది.

రైతుల నుంచి వివరాల సేకరణ
ఇప్పటికే 39అంశాలతో కూడిన ఫార్మాట్‌ను వ్యవసాయ శాఖకు పంపించారు. ఈ సర్వేలో రైతు పట్టాదారు పాసు పుస్తకం నంబరు, బ్యాంకు ఖాతా నెంబరు, సామాజిక స్థితి, భూవిస్తీర్ణం, నీటి వసతి, భూమి స్వభావం, పండించే పంటలు, మార్కెటింగ్ సౌకర్యం, రైతుల రుణాలు, పంటలకు బీమా, కుటుంబంలో స్వయం సహాయక సభ్యులు, గ్రూపుల వివరాలు, పశువుల వివరాలు, సేంద్రియ సేద్యంలో అవగాహన వంటి అంశాలను సర్వేలో సేకరిస్తారు. వాస్తవానికి ఈ నెల ఒకటి నుంచి ప్రారంభించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం అయిదెకరాల్లోపు ఉన్న రైతులకు మూడు విడతల్లో కలిపి రూ.6వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని ఇప్పటికే సూచించింది. దీంతో 39అంశాలంతో పాటు ఈ వివరాలను అందులో కలిపి ఒకే సారి సర్వే చేయాలని భావిస్తున్నారు. మరోవారం రోజుల్లో ఈ సర్వేను ప్రారంభించేందుకు నిర్ణయించారు. జిల్లాలో 79ఏఈవో క్లస్టర్లు ఉండగా.. 77మంది ఏఈవోలు పని చేస్తున్నారు. మరోవైపు ఉద్యాన వన శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది సహకారం కూడా తీసుకుంటారు. గ్రామ, మండల, జిల్లా రైతు సమన్వయ సమితీలు ఉండగా.. వీరికి గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొందరు పోటీ చేసి గెలుపొందారు. దీంతో వీరి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టింది. పంట కాలనీల ఏర్పాటు, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటులో వీరి సహకారం పూర్తిగా తీసుకోనున్నారు.

వారంలోగా సర్వేను ప్రారంభిస్తాం
సాగుకు సంబంధించి సమగ్ర సర్వే పత్రాలు అందాయి. రైతు వివరాలు ఇప్పటికే సేకరించినందున.. మొదటి పేజీ రావాల్సి ఉంది. వారంలోగా సమగ్ర సర్వే ప్రారంభిస్తాం. వ్యవసాయ శాఖతో పాటు ఉద్యాన వన, గ్రామీణాభివృద్ధి శాఖల సిబ్బంది సహకారం కూడా తీసుకుంటాం. పంట కాలనీల ఏర్పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనతో పంట దిగుబడితో పాటు మద్దతు ధర లభిస్తుంది.
- అమ్రేశ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి, నిర్మల్

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...