టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి


Wed,February 13, 2019 12:49 AM

నిర్మల్ టౌన్: పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.ప్రశాంతి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పదోతరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా ఉన్నతాధికారుల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. మార్చి 16 నుంచి పదోతరగతి పరీక్షలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో 44 రెగ్యులర్, రెండు ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో 9707 మంది రెగ్యులర్ విద్యార్థులు, 668 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు. పరీక్ష కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు.
పరీక్షల సమయంలో ఆర్టీసీ బస్సులు నడపాలి
పరీక్షల సమయంలో ఆయా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నడుపాలని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. జిల్లావ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారిణి టామ్నె ప్రణీత, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి అలెగ్జాండర్, ఆర్డీవోలు ప్రసూనాంబ, రాజు, డీఎంఅండ్‌హెచ్‌వో జలపతినాయక్, డీఎస్‌వో కిరణ్‌కుమార్, డీపీఆర్‌వో కలీం, ఇంటలిజెన్స్ అధికారులు కరీం తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...