నిషేధం ఉత్తదేనా !


Thu,January 17, 2019 02:29 AM

నిర్మల్ క్రైమ్ : గుట్కా వ్యాపారానికి జిల్లా కేంద్రం అడ్డాగా మారింది. నిషేధిత గుట్కా, పాన్ మసాలాల విక్రయాలను ప్రభుత్వం నిషేధించినా వీటి వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి కొందరు వ్యాపారులు పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుని కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్ని గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు.

గుట్కా విక్రయాలకు అడ్డాగా జిల్లా కేంద్రం
గుట్కా వ్యాపారానికి జిల్లా కేంద్రం అడ్డాగా మారిం ది. మహారాష్ట్ర,కర్ణాటక,తదితర ప్రాంతాల నుంచి భారీగా గుట్కా సంచులను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాకు మహారాష్ట్ర ప్రాంతం సరిహద్దున ఉండడం నిఘా కొరవడడంతో వీరి వ్యాపారం మూడు గుట్యా ప్యాకెట్లు, ఆరు అంబర్ ప్యాకెట్లలా కొనసాగుతోంది. నిర్మల్ జిల్లాకు భైంసా, సారంగపూర్, ఆదిలాబాద్ ఇలా మూడు వైపుల నుంచి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో అధికారుల కళ్లు కప్పి రాత్రి వేళల్లో ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తూ కోట్ల రూపాయల విలువగల గుట్కాను దిగుమతి చేస్తున్నారు. దిగుమతి చేసుకున్న గుట్కా సంచులను జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతాలు, గోదాములు, పాత ఇం డ్లలో నిల్వ చేస్తున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో పట్టణంలోని పలు హోల్‌సేల్ దుకాణాలకు సరఫ రా చేస్తున్నారు. పెద్ద మొత్తంలో అవసరం ఉన్న వ్యాపారులకు గోదాముల నుండే సరఫరా చేస్తున్నారు. జిల్లా కేంద్రం నుండే నిజామాబాద్, ఆర్మూ ర్, మంచిర్యాల్, ఖానాఫూర్, జన్నారం, కడెం, లక్షెట్టిపేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండలాలకు సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

పాత ఇండ్లు, గోదాముల్లో భారీగా నిల్వలు
వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న గుట్కాను రహస్య స్థావరాల్లో నిల్వ చేస్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాని ప్రదేశాల్లో నిల్వ ఉంచు తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తూ, భారీగా విక్రయిస్తున్నారు. పట్టణంలోని శివారు ప్రాంతాలు, గోదాములు,పురాతన ఇండ్లలో ఎవరికీ అనుమానం రా కుండా ఏదో వ్యాపారం చేసుకుంటామని యజమానులను నమ్మించి ఇండ్లను అద్దెకు తీసుకుని నిల్వ చేస్తున్నారు. గతేడాది పట్టణంలోని చిక్కడపల్లిలోని పాత ఇంట్లో రూ.5 లక్షల విలువ చేసే 47 గుట్కా సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సంవత్సరంలో అదే పెద్ద మొత్తంలో ప ట్టుకున్న గుట్కా... దీనిని బట్టి చూస్తే గుట్కా వ్యా పారానికి జిల్లా కేంద్రం అడ్డాగా మారిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసులకు సవాల్‌గా మారిన దందా
నిషేధిత గుట్కా, పాన్ మసాలాల అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. అన్ని దుకాణాల్లో వీటిని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 55 కేసు లు నమోదు చేసి గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న 84 మందిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి రూ. 30,36,700 విలువ చేసే గుట్కా ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. చిన్న చిన్న దుకాణాల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులు పెద్ద మొత్తంలో ఉన్న నిల్వలను పట్టుకోలేక పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమాచారం వచ్చినప్పుడు మాత్రమే పోలీసులు స్పందిస్తున్నారని, గుట్కా దందాకు అడ్డాగా మారిన నిర్మల్‌లో అక్రమ వ్యాపారానికి అడ్డుకట్టవేసి ప్రజల ప్రాణాలను రక్షించాలని పట్టణవాసులు కోరుతున్నారు.

ఇటీవల జరిగిన ఘటనలు....
ఈనెల 12వ తేదీన జిల్లా కేంద్రంలోని నారాయణ రెడ్డి మార్కెట్‌లో సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న రూ.2లక్షల 50వేల విలువ చేసే 10 గుట్కా బ్యాగులను పట్టుకున్నారు. 14వ తేదీన పట్టణంలోని కబూతర్ కమాన్ కాలనీలో అజీం ఇంట్లో గుట్కా నిల్వ చేసినట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీ చేసి లక్ష రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా బుధవారం లక్ష్మణచాంద మండలం కనకాపూర్ చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించగా కర్ణాటక రాష్ట్రం నుంచి కడెంకు ఐచర్ వాహనంలో తరలిస్తున్న రూ.27 లక్షల విలువ చేసే 150 బ్యాగుల గుట్కాను పట్టుకున్నారు.

నిఘాను పటిష్టం చేశాం..
జిల్లాలో నిషేధిత గుట్కా క్రయవిక్రయాలను అడ్డుకునేందుకు తనిఖీలు విస్తృతం చేస్తాం. గుట్కాలు ఎవరైనా విక్రయించినా,కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవు. జిల్లాలో ఈ వ్యాపారం చేస్తున్న వారి వివరాలను సేకరించి విక్రయాలను అడ్డుకుంటాం. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే గుట్కాను ఎవరైనా విక్రచయించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలి. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం.
- శశిధర్ రాజు, ఎస్పీ

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...