టైగర్లే.. టార్గెట్..!


Fri,January 11, 2019 01:36 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో ఏడు లక్షల చదరపు మీటర్ల మేర అటవీ ప్రాంతం ఉండగా.. నాలుగు జిల్లాల్లో అటవీ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి గత ఏడాది జనవరిలో జంతుగణన చేపట్టారు. ప్రతి నాలుగేళ్లకోసారి జంతుగణన చేపడుతుంటారు. 2010లో పులుల గణన చేపట్టగా... దేశవ్యాప్తంగా 1700 పులులు ఉన్నట్లు గుర్తించారు. 2014లో వీటి సంఖ్య భారీగా పెరిగిందని... 2226 పులులు ఉన్నట్లు లెక్క తేల్చారు. 2014లో చివరిసారిగా పులుల గణన జరగ్గా.. కవ్వాల్‌లో రెండు, కాగజ్‌నగర్‌లో ఆరు ఉన్నట్లు తేలింది. 2018లో చేపట్టిన జంతుగణనలో పూర్వ జిల్లాలో ఐదు పెద్దపులులు ఉన్నట్లు గుర్తించారు. కాగజ్‌నగర్‌లో అప్పుడు గుర్తించిన ఆరు పులుల్లో నాలుగు మాత్రమే మిగిలాయి. కోటపల్లిలో ఓ పులిని వేటగాళ్లు హతమార్చగా, ఈ మధ్య కాలంలో మరోపులి బెజ్జూరు ప్రాంతంలో ఉచ్చుకు తగిలి తప్పించుకుని వచ్చినట్లు గుర్తించారు. 2014లో చైత్ర, వైశాఖ అనే రెండు పులులు, 2015లో ఫాల్గుణ 1, ఫాల్గుణ 2 అనే రెండు పులులు సిర్పూరు ప్రాంతానికి చేరుకున్నాయి. వీటికి పుట్టిన నాలుగు పిల్లలు పెద్దయ్యాక ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కాగజ్‌నగర్‌లో 2, బెల్లంపల్లిలో 1, చెన్నూర్‌లో 1, నిర్మల్‌లో ఒకటి చొప్పున పెద్దపులులున్నాయని గత ఏడాది జంతుగణన తర్వాత అధికారులు చెప్పారు.

సంరక్షణపై సర్కారు ప్రత్యేక దృష్టి
పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో పులులకు ఆహారం, సంరక్షణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని అందుకే పులులు వెనక్కి వెళ్లిపోతున్నట్లు గుర్తించిన అధికారులు.. తెలంగాణ ప్రభుత్వం పెద్దపులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పెద్దపులుల సంరక్షణలో భాగంగా.. కేంద్రం, తెలంగాణ సర్కార్ కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టు (కేటీఆర్) ఏర్పాటు చేసింది. పులులకు ఆహారంగా హైదరాబాద్‌లోని డీర్ పార్కు నుంచి తెచ్చిన కుందేళ్లను కవ్వాల్ అడవుల్లో వదిలారు. గతంలో కవ్వాల్ అభయారణ్యంలో ఒక్క పులి లేకపోగా.. మళ్లీ తాడోబా నుంచి వచ్చి చేరింది. 2018, జనవరి 22న ఖానాపూర్ బీట్‌లోని సోమావార్‌పేట్ దగ్గర పెద్దపులి అడుగులు కనుగొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక పెద్దపులి, రెండు పిల్లలున్నట్లు గుర్తించారు. ఒక పిల్ల మంచిర్యాల్ వైపు వెళ్లిందని, మరొక పిల్ల తల్లి రెండు కదంబ అడవుల్లో ఉన్నట్లు చెప్పారు. మంచిర్యాల జిల్లాలో చెన్నూర్ డివిజన్‌లోని నీల్వాయి ప్రాంతంలో పులి అడుగులు గుర్తించారు. పూర్వ జిల్లాలో ఐదు పెద్దపులులుండగా.. తాజాగా పెంబి మండలంలోని పుల్గంఫాండ్రిలో మరో పెద్దపులిని హతమార్చారు.

గతంలోనూ కోటపల్లి మండలం పిన్నారం వద్ద పెద్దపులిని వేటగాళ్లు హతమార్చారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో ఏడు లక్షల చదరపు మీటర్ల అటవీ విస్తీర్ణం ఉండగా.. దీన్ని సంరక్షించేందుకు కేంద్రం, తెలంగాణ సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అటవీ విస్తీర్ణం పెంచడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణపై దృష్టి సారించింది. ముఖ్యంగా పెద్దపులులను సంరక్షించేందుకు దృష్టి పెట్టగా.. కవ్వాల్ ప్రాంతంలోని కోర్ ఏరియాలోని గ్రామాలను తరలిస్తోంది. వీరికి పునరావాసం, భూములను చూపుతోంది. అలాంటిది వేటగాళ్లు మాత్రం పెద్దపులులను హతమారుస్తున్నారు. విద్యుత్తు తీగలను పెట్టి పెద్దపులులను చంపేస్తున్నారు. వీటి చర్మం, గోళ్లు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కోటపల్లి మండలం ఇన్నారం వద్ద విద్యుత్ తీగలు అమర్చగా 2015 డిసెంబర్ 3న పెద్దపులి మృతి చెందింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత పెంబి మండలం పుల్గంఫాండ్రి వద్ద ఇలాగే విద్యుత్ తీగలు అమర్చి పెద్దపులిని హతమర్చారు. ఈ చర్మాన్ని విక్రయించేందుకు వెళ్తుండగా.. ఇచ్చోడ వద్ద అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కోటపల్లి ఘటనలో చెన్నూర్ బీట్ ఆఫీసర్ అంజారి, చెన్నూర్ సెక్షన్ ఆఫీసర్ నరేశ్‌లను సస్పెండ్ చేశారు. తాజా ఘటనలో కూడా ఎవరెవరీ పాత్ర ఏమేరకు ఉందో అధికారులు లోతుగా విచారిస్తున్నారు.

కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులో ఒక పెద్ద పులి లేకపోగా.. గతేడాది జనవరి 22న ఖానాపూర్ రేంజ్, బీట్‌లోని సోమార్‌పేట్ వద్ద పెద్దపులి అడుగులను గుర్తించారు. కవ్వాల్‌లోకి పెద్దపులి వచ్చినట్లు గుర్తించిన అధికారులు.. సంరక్షణపై ప్రత్యేక దృష్టిసారించారు. అప్పటికే నిర్మల్, ఖానాపూర్ రహదారిపై ఎక్బాల్‌పూర్ వద్ద రోడ్డు దాటుతూ పెద్దపులి కన్పించినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఇటీవల గత నెల 18న ఇందన్‌పెల్లి రేంజ్ కవ్వాల బీట్‌లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. కవ్వాల్ పరిసరాల ప్రాంతాల్లో పులి అడుగులు ఉండగా.. కవ్వాల్ అడవిలో మేకలు మేపేందుకు వెళ్లిన కాపరుల ముందే మందపై దాడి చేసి ఒక మేకను హతమార్చిందని అధికారులు కూడా ధ్రువీకరించారు. అంతకుముందు కడెం మండలం పాండ్వాపూర్ అడవిలో పెద్దపులి సీసీ కెమెరాకు చిక్కింది. మేకల మందపై దాడి చేసిన పెద్దపులి, సీసీ కెమెరాలో రికార్డు అయిన పెద్దపులి, సోమార్‌పేట్ వద్ద లభించిన అడుగులు ఈ ఒక్క పెద్ద పులివేనా, కవ్వాల్ నుంచి వచ్చిందా, తాడోబా నుంచి వచ్చిందా అనే విషయంపై అధికారులు పరిశీలిస్తుండగానే.. తాజాగా పెంబి మండలం పుల్గంఫాండ్రి వద్ద పెద్దపులిని హతమార్చారు.

నిజం తేల్చే పనిలో అధికారులు
గతేడాది జనవరి 22న సోమార్‌పేట్ వద్ద సీసీ కెమెరాలు చిక్కిన పులి అడుగులు, ఇటీవల డిసెంబర్ నెలలో ఇందన్‌పెల్లి వద్ద మేకల మందపై దాడి చేసిన పెద్దపులి, పాండ్వాపూర్ వద్ద సీసీ కెమెరాకు చిక్కిన పెద్దపులి ఒక్కటేనా.. ప్రస్తుతం అదే పెద్ద పులిని పుల్గంఫాండ్రి వద్ద హతమార్చారా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. కవ్వాల్‌లో ఒక్కటే పెద్ద పులి ఉందని అధికారులు భావిస్తుండగా.. ప్రస్తుతం హతమైన పెద్దపులి అదేనా అనే కోణంలో లోతుగా విచారణ చేపట్టారు. అయితే ఏ1 నిందితుడు గుగ్లావత్ ప్రకాశ్ మాత్రం ఏడాది క్రితం పులిని హతమార్చామని చెబుతున్నట్లు తెలిసింది. ఏ2 నిందితుడు మున్యా మాత్రం మూడు నెలల క్రితం హతమార్చినట్లు చెప్పినట్లు సమాచారం. ఎవరూ చెప్పేది నిజమో, ఇద్దరూ చెప్పేది ఎంత వరకు నిజమో అధికారులు విచారిస్తున్నారు. ఏ1, ఏ2 నిందితులు పులిని చంపిన ప్రదేశాలు వేర్వేరుగా చూపడంతో వాస్తవమేదో తేల్చే పనిలో అధికారులు దృష్టి సారించారు. ఇక పులి గోర్లను ఎక్కడ విక్రయించారనే విషయంపై దృష్టిపెట్టారు. సాధారణంగా గ్రామాల్లోనే ఒక్కో గోరుకు రూ. 10-20వేల డిమాండ్ ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో ఇంక ఎక్కువగానే ధర పలుకుతోంది.

అధికారుల ఉదాసీనత
వేటగాళ్లు పెద్దపులులను లక్ష్యంగా చేసుకుని హతమారుస్తున్నారు. అడవిలో విద్యుత్ తీగలను అమరుస్తుండగా.. ఆహారం, నీళ్ల కోసం వస్తున్న పెద్ద పులులు తీగల్లో చిక్కుకుని చనిపోతున్నాయి. ఆశ్చర్యకర విషయమేమిటంటే కొందరు క్షేత్రస్థాయి అధికారులు వేటగాళ్ల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించడం, కొందరైతే వేటగాళ్లతోనే కుమ్మక్కు కావడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. గతంలో కోటపల్లి సంఘటనలో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేయగా.. తాజా ఘటనలోనే అధికారుల పాత్ర ఏ మేరకు ఉందో లోతుగా విచారిస్తున్నారు. పుల్గంఫాండ్రి వద్ద పులిని హతమార్చిన ఘటనలో నిందితులుగా ఉన్న గుగ్లావత్ ప్రకాశ్ (ఏ1) ఇంట్లో డిసెంబర్ 31న నీలుగాయి మాంసం పది కిలోలు పట్టుకుని కేసు నమోదు చేయకుండా, ఉన్నతాధికారులకు చెప్పకుండా ఎఫ్‌ఆర్వో హాఫీజుద్దీన్ దాచి పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే నీలుగాయి వ్యవహారంలో ఎఫ్‌ఆర్వో, ఎఫ్‌ఎస్‌వో, ఎఫ్‌బీవోలపై వేటు వేయగా.. క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. ఎఫ్‌ఆర్వో పరారీలో ఉండగా.. ఎఫ్‌ఎస్‌వో, ఎఫ్‌బీవోలను అరెస్టు చేశారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...