నామినేషన్లు షురూ..


Wed,November 14, 2018 11:56 PM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పర్వం మొదలైంది. జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలో బుధవారం రోజున నామినేషన్లకు బోణీ మొదలైంది. సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తుండగా.. సోమ, మంగళవారాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. బుధవారం రోజునే ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజక వర్గాలుండగా.. మూడు చోట్ల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్లు దాఖలు చేశారు. నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు.. ముథోల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డిగారి విఠల్‌రెడ్డి, ఉట్నూర్‌లో ఖానాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి అజ్మీరా రేఖా నాయక్ నామినేషన్ వేశారు. ముథోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పవార్ రామారావు పటేల్, నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ స్వర్ణారెడ్డి, ఉట్నూర్‌లో స్వతంత్ర అభ్యర్థి కనక తుకారాం నామినేషన్లు చేశారు. మంత్రి అల్లోల నాలుగు సెట్లు, గడ్డిగారి విఠల్‌రెడ్డి రెండు సెట్లు, అజ్మీరా రేఖానాయక్ రెండు సెట్లు, డాక్టర్ స్వర్ణారెడ్డి, పవార్ రామారావు పటేల్, కనక తుకారాం ఒక్కో సెట్ చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు.

మంత్రికి నిర్మల్‌లో నీరాజనం
నిర్మల్ నియోజక వర్గంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భారీ జనసమీకరణతో ఆర్భాటంగా నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం 11గంటలకు భారీ జన సందోహం మధ్య ఆయన నివాసం నుంచి బయలు దేరి.. మంచిర్యాల రోడ్డు, మంచిర్యాల చౌరస్తా, బస్ డిపో, కలెక్టరేట్ మీదుగా తహసీల్దారు కార్యాలయం వరకు భారీ ర్యాలీతో తరలి వెళ్లారు. నిర్మల్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి భారీగా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి రావడంతో ప్రధాన వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. గులాబీ జెండాలతో ర్యాలీగా వెళ్లగా.. ప్రధాన రహదారి గులాబీమయంగా మారింది. యువత, పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తూ.. ద్విచక్ర వాహనాలు, కాలినడక భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. మధ్యాహ్నం 1గంట నుంచి 2గంటల మధ్య మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం నాలుగు సెట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా కేంద్రంలో తన నామినేషన్‌కు ఇంత భారీ స్థాయిలో జనం తరలిరావడం ఇదే మొదటిసారని.. తన విజయం ఇప్పటికే ఖాయమైందని, ఇక మెజారిటీయే తేలాల్సి ఉందనే ధీమా వ్యక్తం చేశారు. ముథోల్‌లో పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు తరలిరాగా.. విఠల్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉట్నూర్‌లో ఖానాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి రేఖానాయక్ సాదాసీదాగా నామినేషన్ వేయగా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పర్యటన రోజున పెద్ద ఎత్తున జనసమీకరణతో నామినేషన్ దాఖలు చేయాలని భావిస్తున్నారు.

153
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...