సర్వం సిద్ధం!


Tue,November 13, 2018 12:02 AM

- అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- నామినేషన్ల స్వీకరణ పర్వం ప్రారంభం
- తొలిరోజు నామినేషన్లు వేయని అభ్యర్థులు
- ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధం
- దివ్యాంగులకు ప్రత్యేక వసతుల ఏర్పాటు
నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 12 నుంచి 19వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 20న నామినేషన్ల పరిశీలన చేస్తుండగా.. 22వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, గుర్తుల ప్రకటన చేస్తారు. డిసెంబర్ 7న ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు, ఫలితాలను ప్రకటిస్తారు. ఈ నెల 12 నుంచి 19వరకు ఎనిమిది రోజుల పాటు నామినేషన్ల స్వీకరణకు సమయం ఇవ్వగా.. ప్రతి రోజు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు కార్యాలయం వద్దకు మూడు వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. ముథోల్, ఖానాపూర్, నిర్మల్ మూడు చోట్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఉండగా.. ఇక్కడ మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు. ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. తొలి రోజు జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మంచి ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు వేయాలని భావిస్తున్నారు. ఈ నెల 14, 19 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండడంతో.. ఆ రెండు రోజులే అందరూ నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలున్నాయి.

ఎన్నికల నిర్వహణ సామగ్రి సిద్ధం
జిల్లాలో గత నెల 12న ప్రకటించిన తుది జాబితా ప్రకారం నిర్మల్ నియోజకవర్గంలో 6,09,362 మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఖానాపూర్ నియోజకవర్గంలో 1,85,235మంది, నిర్మల్ నియోజకవర్గంలో 2,10,462మంది, ముథోల్ నియోజక వర్గంలో 2,13,663 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను ఈనెల 19న అనుబంధంతో విడుదల చేయనున్నారు. జిల్లాలో 4200మంది అధికారులు, సిబ్బంది ఎన్నికల నిర్వహణకు అవసరమవుతున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందికి ఇప్పటికే శిక్షణా తరగతులు నిర్వహించారు. మండలానికో ఎన్నికల పరిశీలకుడిగా జిల్లా స్థాయి అధికారులను నియమించారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్స్ సిద్ధం చేశారు. జిల్లాకు 1200 బ్యాలెట్ యూనిట్లు, 940 కంట్రోల్ యూనిట్లు, 1020 వీవీ ప్యాట్స్ వచ్చాయి. ప్రతి పోలింగ్ కేంద్రానికి మూడు టేబుళ్లు, రెండు బెంచీలు, 12కుర్చీల చొప్పున సిద్ధం చేశారు. ప్రతి పార్టీకి ఇద్దరు పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఇప్పటికే తుది ఓటర్ల జాబితా ప్రతులు బూత్‌ల వారీగా వచ్చాయి.

నామినేషన్ల ప్రతులు, చెక్ లిస్టు, ఆఫిడవిట్ పత్రాలు, బ్యాంకు ఖాతాల వివరాల ప్రతులు, ఎన్నికల నియమావళి పుస్తకాలు జిల్లాకు చేరాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో మూత్రశాలలు, మరుగుదొడ్లు, విద్యుత్తు వెలుతురు, ఫ్యాన్లు ఉండేలా చర్యలు చేపట్టారు.ఇప్పటికే పోలీసులు కార్డన్ సెర్చ్‌లు నిర్వహించి.. అక్రమంగా నిల్వ చేసిన డబ్బు, మద్యం, వాహనాలను సీజ్ చేస్తున్నారు. జిల్లాలో 100బీఎస్‌ఎఫ్ బలగాలతో పాటు 4ప్యారా మిలటరీ బలగాలను దింపారు. జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తిగా ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే బైండోవర్లు చేస్తుండగా.. లైసెన్సు పొందిన తుపాకులను వెనక్కి తీసుకుంటున్నారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమంగా మద్యం, డబ్బులు, ఇతర విలువైన వస్తువులు తీసుకెళ్తే.. పట్టుకుని డిపాజిట్ చేస్తున్నారు. బెల్టుషాపులు, గుడుంబా స్థావరాలపై దాడులు చేసి.. కేసులు నమోదు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి 100మీటర్లలోపు 144సెక్షన్ విధించి.. పూర్తిగా ఆంక్షలు విధించారు. పార్టీ కార్యాలయాలు, జెండాలు లేకుండా చేస్తున్నారు. ఈ పరిసరాల్లో ఎలాంటి ప్రచారం చేయడానికి లేదు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...