అడుగడుగునా బ్రహ్మరథం


Tue,November 13, 2018 12:01 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రెండు నెలలకు పైగా ప్రజల్లో ఉండగా.. ఇప్పటికే అన్ని గ్రామాలు చుట్టి వచ్చారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఆదివారం రోజున బీ-ఫారాలు కూడా అందుకున్నారు. సోమవారం నుంచి రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేపట్టారు. సోమవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దిలావర్‌పూర్ మండలంలో పర్యటించి ప్రచారం చేశారు. దిలావర్‌పూర్ మండల కేంద్రంతో పాటు కాల్వ, కాల్వతండా, లోలం, మాడేగాం, కదిలి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. నర్సాపూర్ (జి) మండల కేంద్రంతో పాటు కుస్లీ, అంజనితండా గ్రామాల్లో ప్రచారం చేశారు. దిలావర్‌పూర్, సోన్ మండలంలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. దిలావర్‌పూర్‌లో సుమారు 150 మంది మైనార్టీలు టీఆర్‌ఎస్ పార్టీలో మంత్రి అల్లోల సమక్షంలో చేరారు. నిర్మల్‌లోని మంత్రి నివాసంలో సోన్ మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు అల్లోల సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ముధోల్ నియోజకవర్గ అభ్యర్థి గడ్డిగారి విఠల్‌రెడ్డి లోకేశ్వరం మండలంలో పర్యటించి ప్రచారం చేశారు. ఖానాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి అజ్మీరా రేఖనాయక్ కడెం మండలంలోని సారంగాపూర్, చిట్యాల్, బెల్లాల్ గ్రామాల్లో పర్యటించి ప్రచారం చేశారు.

కాంగ్రెస్‌లో గందరగోళం
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు మహాకూటమి పొత్తుల పంచాయితీ నడుస్తుండగా.. మరోవైపు కాంగ్రెస్‌లో టికెట్ల రగడ సాగుతోంది. నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ఇప్పటివరకు అభ్యర్థుల జాబితా వెలువడలేదు. గత కొన్ని రోజులుగా నేడు, రేపు అంటూ ఊరిస్తున్న జాబితా ప్రకటన తరచూ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సోమవారం జాబితా వెలువడుతుందని ఆశావహులు కళ్లల్లో వత్తులు పెట్టుకొని ఎదురుచూడగా.. చివరికి నిరాశే మిగిలింది. సోమవారం కూడా మరోసారి వాయిదాల పర్వం కొనసాగింది. ఇప్పటికే రెండు నెలలకు పైగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారం చేస్తుండగా.. సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు తమ భవిష్యత్‌పై స్పష్టత లేకపోవడంతో ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు తమకు టికెట్ వస్తుందో లేదో తెలియక గందరగోళంలో ఉన్నారు. పుణ్యకాలం కాస్త గడిచిపోయాక టికెట్ ఇచ్చినా ప్రయోజనం ఉండదని లోలోన మదనపడుతున్నారు. నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కావడంతో ఇంత తక్కువ కాలంలో ఏ విధంగా ముందుకెళ్లాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఒకరికి టికెట్లు ఇస్తే మరొకరు సహకరించే పరిస్థితి లేదు. ఇప్పటికే ఖానాపూర్‌లో రాథోడ్ రమేశ్‌కు టికెట్ ఇవ్వవద్దంటూ హరినాయక్ వర్గం నాలుగు రోజులుగా గాంధీభవన్ ఎదుట ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ముథోల్‌లోనూ పటేల్ సోదరుల మధ్య పంచాయితీ నడుస్తోంది. ఒకరికి టికెట్ వస్తే మరొకరూ సహకరించేది లేదని.. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు. ఖానాపూర్, ముథోల్‌లో ఒకరికి టికెట్ వస్తే మరొకరూ స్వతంత్రంగా బరిలోకి దిగాలని యోచిస్తున్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...