నిర్భయంగా ఓటు వేసేలా చర్యలు


Sun,November 11, 2018 04:49 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ : ప్రజలు నిర్భయంగా ఓటు వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నట్లు నిర్మల్ జిల్లా కలెక్టర్, ఉమ్మడి జిల్లా ఎన్నికల అధికారి ఎం ప్రశాంతి అన్నారు. శనివారం ఉట్నూర్ ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులకు ర్యాంపులు, పార్కింగ్ సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులకు క్యూ లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వికలాంగులకు గ్రామపంచాయతీ అధికారులు వీల్ చైర్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీచేస్తున్నట్లు తెలిపారు. పీడబ్ల్యూఏసీటీ యాక్ట్ ప్రకారం వికలాంగులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సారి వికలాంగులకు ఆటో సౌకర్యం కల్పించి ఓటు హక్కు వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ పరిధిలో వికలాంగుల వివరాలు తీసుకున్నామని వారికి ఫోన్ చేసి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామన్నారు.

ఎస్‌సీసీ కెడెట్ల సేవలు కూడాతీసుకోనున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో రాజకీయ కార్యక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సారి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు ఏ పార్టీకి ఓటు వేశారో తెలియకుండా లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల సహకారం తీసుకుంటున్నామన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు. ఇప్పటికే కేంద్రబలగాలు వచ్చి కవాతు నిర్వహిస్తున్నాయని గుర్తు చేశారు. ప్రజలపై ఎటువంటి ఒత్తిడి, ప్రభావాలు లేకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహణకు పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికే పోలీసుల తనిఖీల ద్వారా నియోజకవర్గంలో రూ.7 లక్షల నగదు, మద్యం పట్టుకొని కమిటీ ముందు పెట్టామన్నారు. మీడియా, సోషల్ మీడియాపై కమిటీ కన్నేసి ఉంచిందన్నారు. ఒక్కో అభ్యర్థి రూ. 28 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చని, ఈ వివరాలు పూర్తిస్థాయిలో అధికారులకు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఖర్చుకు సంబంధించిన పర్యవేక్షణకు ఖానాపూర్‌కు ప్రకాశ్, ముథోల్‌కు వికాస్ ఐఏఎస్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిందన్నారు. ఈ సారి కొత్తగా 9 శాతం యువత ఓటు హక్కు పొందారన్నారు. ఈవీఎం వినియోగంపై అవగాహన కల్పించామన్నారు. సమావేశంలో ఉట్నూర్ ఆర్డీవో వినోద్‌కుమార్, ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్, సీఐ వినోద్ తదితరులు ఉన్నారు.

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...