టీఆర్‌ఎస్‌దే జోరు..


Sat,November 10, 2018 12:01 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఎవరు ఎన్ని చెప్పినా తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్ అధికారం చేపడుతుందని ఇండియా టుడే సర్వే తేటతెల్లం చేసింది. తొమ్మిది నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు, ప్రజాకంటక విధానాలు ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టేందుకు, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే అనుకూలమని సర్వేలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఎంతో కృతజ్ఞతతో ఉన్నారని స్పష్టమైంది. డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. 75 శాతం మంది ఓటర్లు టీఆర్‌ఎస్ పట్ల అనుకూలంగా ఉన్నారని వెల్లడించింది. మరోవైపు ఏకకాలంలో 105 మంది అభ్యర్థులను ఏకకాలంలో ప్రకటించిన పార్టీలో కేడర్, లీడర్ మధ్య సమన్వయంతో, కార్యకర్త నుంచి అభ్యర్థి దాకా ఐక్యతతో గులాబీ శ్రేణులు ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే జిల్లాలోని అభ్యర్థులు నియోజకవర్గం మొత్తం చుట్టి వచ్చారు. కొన్ని గ్రామాలను రెండు, మూడు సార్లు వెళ్లి వచ్చారు. వారి ప్రచారానికి సైతం ప్రజల నుంచి అనూహ్యంగా మద్దతు లభిస్తోంది. వారి వెంట ప్రజలు కుప్పులు తెప్పలుగా తరలి వస్తున్నారు. ప్రజలంతా ఇంటి పార్టీ వైపే ఉన్నారని స్పష్టమవుతోంది.

తాజా సర్వేలో పెరిగిన మద్దతు..
టీఆర్‌ఎస్ పార్టీకి, ప్రభుత్వ పని తీరుకు ప్రజల నుంచి విశేషంగా మద్దతు వస్తోందని ఇండియా టుడే సర్వే పేర్కొంది. సెప్టెంబర్‌కు నవంబర్‌కు మధ్య మూడు శాతం ప్రజల మద్దతు పెరిగింది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు గడిచిన నాలుగున్నరేండ్లుగా చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలతో టీఆర్‌ఎస్ వైపే ప్రజలు ఆకర్షితులవుతున్నారని తాజా సర్వే ఫలితాలే నిదర్శమని చెప్పవచ్చు. గత సెప్టెంబర్‌లో టీఆర్‌ఎస్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజల్లో 43 శాతం మద్దతుంటే... నవంబర్ నాటికి అది 46 శాతానికి పెరగడం విశేషం. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా 75శాతం ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా కేసీఆరే పగ్గాలు చేపట్టబోతున్నారని ఇండియా టుడే సర్వే తేల్చేసింది. మొదటి నుంచి కూడా కేసీఆర్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల్లోనే ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతుభీమా, 24గంటల పాటు సాగుకు ఉచిత విద్యుత్తు, రోడ్లు.. ఇలా అన్నింటితో ప్రజల మద్దతు మొదటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ఉంది.

మహాకూటమివి మాయ మాటలే..!
కేసీఆర్ ఒక్కడిని ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమై ముందుకు వస్తున్న నేపథ్యంలో వారి కూటమిని నమ్మడం లేదు. కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ అందరూ కలిసి ముందుకు సాగేందుకు సిద్ధమైనా.. ప్రజలు వారిని నమ్మడం లేదు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ చేసిన ద్రోహం, కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తెలంగాణకు అడ్డుపడి, అభివృద్ధి విషయాన్ని మరిచిన నాయకులు.. ఇప్పుడు ఎన్నికల వేళ ఓట్ల కోసం రావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని నమ్మేది లేదని.. ఇప్పటికే ఎన్నో సర్వేలో ప్రజలు స్పష్టం చేయగా, ఇప్పుడు దానిని ఇండియా టుడే సర్వే మరింత సమర్థించినట్లయింది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్‌కే అధికారం కట్టబెడతామని ప్రజలు కంకణం కట్టుకుని ముందుకు సాగుతున్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎదురులేదు..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. తెలంగాణ సర్కార్ ఏర్పడిన తర్వాత రైతులు, కూలీలు, విద్యార్థ్థులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా, రైతు బంధు, 24 ఉచిత కరెంట్ అందిస్తున్నారు. ఏదో ఒక్క పథకం రూపంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో టీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. ఇండియాలో ఉన్న ప్రతి వార్త పత్రిక, టీవీ చానల్ సర్వే చేసి టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్‌కు ఎదురు లేదు.
- ఆశీల మధుకర్, మెడికల్ వ్యాపారి, సిరికొండ

ప్రజలకు టీఆర్‌ఎస్‌పై గట్టి నమ్మకం ఉంది
నాలుగున్నర ఏళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కేసీర్‌పై ప్రజల్లో గట్టినమ్మం ఏర్పడింది. అందుకే ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతు బీమా పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరాయి. అవినీతికి తావులేని ప్రభుత్వం. అందుకే కేసీర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలి. అన్ని సర్వేలు టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి
- బి. పున్న చందు

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...