సబ్బండ వర్ణాల సంబురం


Thu,October 18, 2018 01:43 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: తెలంగాణ రాష్ర్టానికి దశా దిశా.. బంగారు తెలంగాణ సాధన సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని జిల్లా వాసులు నమ్ముతున్నారు. ఎవరి వల్ల సాధ్యం కాని..ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని 14ఏళ్ల పాటు పోరాడి సాధించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు కోసమే అహర్నిశలు తపిస్తున్న సీఎం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని వాటిని కూడా అమలు చేశారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని.. అమలు చేసి చూపారు. తాజాగా కూడా రూ.లక్ష వరకు రుణమాఫీ ప్రకటించగా.. చేసి తీరుతారని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం అమలు చేసి.. ఎకరానికి ఏటా రూ.8వేలు ఇస్తున్నారు. ఇప్పుడు రూ.10వేలు ఇస్తామని హామీ ఇస్తుండగా.. తప్పక అమలు చేస్తారని రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు.

రైతులకు ప్రభుత్వానికి వారధిలా ఉండేలా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశారు. వీరికి గౌరవ వేతనం ఇవ్వటంతో మరింత బాధ్యతతో పని చేస్తారు. రెండు నియోజకవర్గాలకు మధ్య ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ పెట్టడంతో రైతులకు మద్దతు ధరతో పాటు స్వయం సహాయక సంఘాలకు ఉపాధి, ఆర్థిక స్వావలంబన లభించనుంది. గతంలో రూ.200 పింఛను ఇవ్వగా.. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పింఛన్లు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొప్పున ప్రతినెలా ఇస్తున్నారు. ఇతర పార్టీల వారు గొప్పలు చెప్పటం, ఫ్లెక్సీలు, గోడలపై రాతలు, వాల్ పోస్టర్లు వేసుకుంటున్నా.. అమలు చేయడం అనుమానమేనని అంటున్నారు. టీఆర్‌ఎస్ మాత్రం గతంలో మాదిరిగానే తప్పకుండా.. 100శాతం అమలు చేసి తీరుతుందని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. గతంలో సరిగా ఇవ్వని వారు పెంచి ఇస్తామంటే నమ్మరని.. టీఆర్‌ఎస్‌నే నమ్ముతారని చెబుతున్నారు.

డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంలో పలు మినహాయింపులు ఇవ్వడంతో.. నిర్మల్, భైంసాతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలాలు ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇస్తామనడంతో.. పేద, మధ్యతరగతి యువతకు ఆర్థికంగా చేయూత లభించనుంది. అగ్రవర్ణాల్లోని పేదలకు కార్పొరేషన్‌తో పాటు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతో పేద పిల్లల చదువులు, ఉపాధికి ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోపై జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు వివిధ వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి బాణాసంచాలు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

162
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...