నేడే ఆఖరు


Mon,September 24, 2018 11:21 PM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం. మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు ఆయుధంగా ఉపయోగపడుతుంది. వచ్చే ఐదేళ్ల పాటు తమ గ్రామం, మండలం, నియోజకవర్గంలో ఎలాంటి నాయకుడు ఉండాలి, ఎలాంటి ప్రభుత్వం ఉండాలో నిర్ణయించేందుకు ఓటే ప్రధానం.. అలాంటిది అర్హత ఉండి కూడా ఓటరుగా దు చేసుకోక పోవటం సరికాదు.. 18ఏళ్లు నిండిన వారందరికీ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ నెల 10నుంచి 25వరకు ఓటు హక్కు నమోదు ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. జనవరి 1, 2018 నాటికి 18ఏళ్లు నిండిన వారందరికీ ఓటరుగా అవకాశం కల్పించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది.. ఇందులో భాగంగా అధికారులు ఓటర్ల నమోదు కార్యక్రమం చేపడుతున్నారు. జిల్లాలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేస్తున్నారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో ఓటరు నమోదుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేశారు. బూత్ స్థాయిలో బీఎల్‌వో(బూత్ లెవల్ ఆఫీసర్)లను నియమించారు. వీరి వద్ద ముసాయిదా ఓటరు జాబితాను సిద్ధంగా ఉంచారు. జిల్లాలో ఓటరు నమోదు కోసం మూడు విధానాలను అమలు చేశారు. బూత్ స్థాయిలో బీఎల్‌వో వద్ద, మండల తహసీల్దార్ కార్యాలయంలో, ఆన్‌లైన్‌లో ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 10 నుంచి ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలో ఇప్పటి వరకు 18,086 మంది కొత్త ఓటర్లు తమ పేర్ల నమోదు కోసం దరఖాస్తులు చేసుకున్నారు.

ఇందులో 102 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేయగా.. మిగతా 17,984 మంది ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇప్పటికే 2,492 మంది దరఖాస్తులను ఓటర్లుగా నమోదు ప్రక్రియ పూర్తయింది. మిగతావి ప్రగతిలో ఉన్నాయి. పేరు మార్పులకు సంబంధించి 2007 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్షర దోషాలను సరి చేసుకునేందుకు సంబంధించి 296 దరఖాస్తులు అందాయి. నియోజకవర్గ మార్పునకు సంబంధించి 524 దరఖాస్తులు చేసుకున్నారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించి నేటితో గడువు ముగియనుంది. ఓటరు నమోదు కోసం అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జిల్లాలో అర్హులైన వారందరినీ ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసేలా అవగాహన కల్పించారు. ప్రతి పట్టణ, గ్రామాల్లో ఓటరు నమోదుకు సంబంధించి ఫెక్సీలు, వాల్‌రైటింగ్‌లు, కర పత్రాలతో ప్రచారం చేశారు. ఓటు నమోదు కోసం ఇప్పటికే రెండు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మరోవైపు చివరి రోజైన మంగళవారం రోజు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున్న బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు.

ఉదయం 8.30గంటలకు స్థానిక ఎన్‌టీఆర్ స్టేడియం నుంచి బైక్ ర్యాలీ బయలుదేరి పట్టణంలోని అన్ని వీధుల మీదుగా నిర్వహిస్తారు. ఓటరు నమోదుపై యువతను చైతన్యవంతులుగా చేసేందుకు బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, యువజన సంఘాలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొంటారు. ఫ్లకార్డులతో ఓటుహక్కు అవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఓటర్లు ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా జాబితాను పరిశీలించాలి. పేర్లు గల్లంతయ్యాయని పోలింగ్ సమయంలో గగ్గోలు పెడితే ప్రయోజనం ఉండదు. గతంలో నమోదు చేసుకున్న వారు తమ పేర్లు, ఫొటోలు జాబితాలో ఉన్నయో లేవో సరి చూసుకోవాలి. తప్పు, ఒప్పులుంటే గుర్తించి ఆక్షేపణల దరఖాస్తులు ఇవ్వాలి. భాషాదోషాలు లేకుండా దరఖాస్తుదారు స్వయంగా తన వివరాలు పొందుపరిస్తే.. అదే సమాచారంతో కార్డు మంజూరు అవుతుంది. సలహాలు, సూచనలకు హెల్ప్‌లైన్ 08734-241422, టోల్ ఫ్రీ నంబర్ 1950లో సంప్రదించాల్సి ఉంటుంది.

ఓటు నమోదు చేసుకోవడం ఇలా..
జనవరి 1, 2018 నాటికి 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటుహక్కు పొందేందుకు అర్హులు. పోలింగ్‌బూత్‌లలో ఏర్పా టు చేసిన ఓటరు నమోదు కేంద్రాలు వెళ్లి దరఖాస్తు చేసుకోవ చ్చు. పాస్‌పోర్టు, ఫొటో, చిరునామా, వయసు ధ్రువీకరణ ప త్రాలు తీసుకువెళ్లి ఫారం-6 నింపి ఇవ్వాలి. తెలంగాణ సీఈవో http:ceotela ngana. nic.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి. ఈ - రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మెనూ కనిపిస్తుంది. అందులో రకరకాల దరఖాస్తులు ఉంటాయి. ఫారం -6 పైన క్లిక్ చేస్తే కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన దరఖాస్తు వస్తుంది. భాషకు సంబంధించిన గడిపై క్లిక్ చేసి ఇంగ్లీషు ఎంచుకోవాలి.
- మొదట రాష్ట్రం, జిల్లా, శాసనసభ - పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. తర్వాత నూతన ఓటరు నమోద లేదా ఇతర నియోజకవర్గానికి కార్డును మార్చుకోవడం అనే రెండు ఆప్షన్ల నుంచి ఒకదాన్ని సెలక్ట్ చేయాలి.
- దరఖాస్తు దారుపేరు, చిరునామా వంటి వివరాలు నింపాక, తెలిసిన ఓ ఓటరు పేరు కార్డు నంబర్ పొందుపర్చాల్సి ఉంటుంది.
- అనంతరం ఇతర వివరాలనూ నింపేసి పక్కన కనిపించే ప్రాంతీయ భాషకు చెందిన గడుల్లో తెలుగు భాషలో ప్రత్యక్షమయ్యే పేరు, ఇతర వివరాలు సరిచూసుకోవాలి. భాషాదోషాలు ఉంటే అక్కడే సరి చేసుకోవచ్చు.
- ఫొటో, వయసు (పదవ తరగతి మార్కుల పత్రం, పాస్‌పోర్టు, జనన ధ్రువ పత్రం, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్‌కార్డు) చిరునామా (గ్యాస్ కనెక్షన్, పాస్‌పోర్టు, విద్యుత్ బిల్లు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఇన్‌కంటాక్స్, అసెసెమెంట్ పుస్తకం, టెలిఫోన్ బిల్లు, నీటి బిల్లు, బ్యాంకు పాసుపుస్తకం తదితరాలు)కు సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అదే సమయంలో ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ స్పష్టంగా ఇవ్వాలి.
- దరఖాస్తులో పేర్కొన్న వివరాలు అన్నీ సరి చూసుకుని సబ్‌మిట్ క్లిక్ చేస్తే... రిఫరెన్స్ ఐడీ నంబర్ ప్రత్యక్షం అవుతుంది. ఆ సంఖ్యతో దరఖాస్తు స్థితిగతులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. కార్డు మంజూరులో జాప్యం జరిగితే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
- కొత్త ఓటు నమోదు కోసం ఫారం - 6, పేరు మార్చుకోవాలంటే ఫారం - 7, అక్షర దోషాలు సరిదిద్దుకునేందుకు ఫారం - 8, కార్డును ఇతర నియోజకవర్గాలకు మార్చుకోవాలంటే ఫారం 8ఏను ఎంచుకోవాల్సి ఉంటుంది.
- ఫొటోలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వారి పరిమాణం 100కేబీ లోపు ఉండాలి. లేకపోతే ఆన్‌లైన్‌లో వాటిని తీసుకోరు.

171
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...