కంటి వెలుగుకు భారీ స్పందన


Mon,September 24, 2018 11:20 PM

నిర్మల్, నమస్తే తెలంగాణ : జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు వైద్య శిబిరాలకు జనం పోటెత్తుతున్నారు. ఏ ఊర్లో చూసినా కంటి వైద్య శిబిరాలు కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో 16 కంటి వైద్య బృందాలు నిర్విరామంగా శిబిరాల నిర్వహణలో తలమునకలవుతున్నాయి. ప్రతి బృందంలో వైద్యుడు, కంటి వైద్య సహాయకులు, పది మంది ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొంటున్నారు. అనేక గ్రామాల్లో అక్కడి అంగన్‌వాడీ కార్యకర్తలు సైతం చేయూతగా నిలుస్తున్నారు. ఆగస్టు 15న మొదలైన కంటి వెలుగు కార్యక్రమం సోమవారం నాటికి 25రోజుల పాటు జిల్లావ్యాప్తంగా కంటి పరీక్షలు జరిగాయి. 68,637 మందికి కంటి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. వీరిలో 28,567 మంది పురుషులు కాగా.. 4,0062 మంది మహిళలు కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. సామాజికవర్గాల వారీగా చూస్తే షెడ్యూల్డ్ కులాల వారు 12169 మంది, షెడ్యూల్డ్ తెగల వారు 10438 మంది పరీక్షలు చేయించుకున్నారు. అలాగే వెనుకబడిన తరగతుల వారు 37874 మంది, మైనార్టీలు 5288 మంది, ఓసీలు 2868 మంది ఉచిత కంటి వైద్య శిబిరాలకు తరలివచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు.

కాగా జిల్లావ్యాప్తంగా కంటి పరీక్షలనంతరం 7029 మందిని ఇతర దవాఖానలకు ఉన్నత చికిత్సల కోసం రిఫర్ చేశారు. వీరిలో సుమారు 95శాతం మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని నిర్ధారించారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి హైదరాబాద్‌లోని పుష్పగిరి, ఎల్వీ ప్రసాద్, సరోజినిదేవి, ముథోల్‌లోని గోపాల్‌రావుబోస్లే కంటి దవాఖానలతోపాటు ఆదిలాబాద్‌లోని శేషన్నచెన్నావార్ కంటి వైద్యశాలలో శస్త్ర చికిత్సలు చేయించేందుకు చర్యలు తీసుకంటున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన 150 మందిని కంటి వైద్య చికిత్సల కోసం వివిధ దవాఖానలకు పంపారు. వీరిలో శస్త్ర చికిత్సలు పూర్తి చేయించుకుని 60 మంది దాకా తిరిగి సొంత గ్రామాలకు చేరుకున్నారు. ప్రభుత్వం తమకు అన్ని దగ్గరుండి ఉచితంగా కంటి వైద్య శస్త్ర చికిత్సలు చేయించడం గొప్ప వరంగా చెప్పుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న అనేక మంది ఈ ఉచిత శస్త్ర చికిత్సలు చేయించుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ తోబుట్టువుగా నిలుస్తున్నారని కొనియాడుతున్నారు. ఇక పరీక్షలు నిర్వహించిన సుమారు 70వేల మందిలో 14,692 మందికి ఉచితంగా కంటి అద్దాలను అందజేశారు. మరో11,262 మందికి త్వరలోనే హైదరాబాద్ కంటి అద్దాలు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో జలపతినాయక్ తెలిపారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...