గులాబీ పార్టీలో చేరికల జోష్


Mon,September 24, 2018 03:48 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ: జిల్లాలో టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరుతున్నామని ప్రజలు చెప్పుకొస్తున్నారు. గడిచిన నాలుగున్నర ఏండ్ల కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్షని పల్లె ప్రజలు చెబుతున్నారు. ఆదివారం నిర్మల్ నియోజకవర్గంలో భారీగా వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాల నేతలు, కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి అల్లోల నివాసానికి భారీగా తరలివచ్చి టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని తీసుకున్నారు. వారిని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించి గులాబీ కండువాను కప్పారు. పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను చూసి తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సోన్ మండలం పాక్‌పట్ల గ్రామానికి చెందిన నాయక్‌పోడ్ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ర్యాలీగా తరలివచ్చి మంత్రి అల్లోల సమక్షంలో నిర్మల్‌లో జరిగిన కార్యక్రమంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పార్టీ కండువాను కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో మరోసారి ప్రభు త్వం ఏర్పడితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఈ సందర్భంగా పాక్‌పట్ల గ్రామస్తులు పేర్కొన్నారు.

ప్రతిపక్షాలకు చావుదెబ్బ...
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ సహా కూటమి కడుతున్న ప్రతిపక్ష పార్టీలకు చావుదెబ్బ తప్పదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన వందలాది మంది టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ పౌర సమాజం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను మాత్రమే కోరుకుంటుందని చెప్పారు. ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకునేందుకు రాజకీయం చేయడం తప్ప మరేమీ సాధించలేరని వ్యాఖ్యానించారు. 60 ఏళ్ల పాలనలో సాధించని అభివృద్ధి పనులు ఇప్పుడు ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే మేనిఫెస్టోతో కాంగ్రెస్ మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసింది శూన్యమన్నారు. తెలంగాణను మోసం చేసిన తెలుగుదేశం పార్టీతో నేడు జతకడుతున్నదన్నారు. తెలంగాణ ప్రజలు కచ్చితంగా ఆ పార్టీలకు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశంతో పాటు అన్ని పార్టీలు జతకట్టి పోటీ చేసినా ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఆ కూటమి అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. వివిధ పార్టీలను వదిలి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నావారికి పార్టీ పూర్తి భరోసా నిస్తుందని వారికి ఎళ్లవేళలా అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రామ్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రామేశ్వర్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు మోహినొద్దీన్, ముత్యంరెడ్డి, రఘునందన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...