దేశానికే ఆదర్శం కంటి వెలుగు


Fri,September 21, 2018 01:42 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వైద్యారోగ్య శాఖ కమిషనర్ యోగితా రాణా అన్నారు. ఆదిలాబాద్‌లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో ఆదివారం ఆదివారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిని స్థానిక వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం దూరదృష్టితో కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిందని, రాష్ట్రంలో అంధత్వ నిర్మూలనకు ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. కార్యక్రమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలకు వివరించి సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమ అమలులో వైద్యాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.

తాను వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ కంటి వెలుగు కార్యక్రమాలను సమీక్షిస్తూ వస్తున్నానని, ఇది పదో జిల్లా అని తెలిపారు. సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమగ్ర నివేదిక రూపంలో ప్రగతిని ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. మండల, గ్రామ స్థాయిలో మరింత చైతన్యం తీసుకురావాలన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించిందని, పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మైక్రో యాక్షన్ ప్లాన్ చేసి మలేరియా, డెంగ్యూ, టీబీ వంటి వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సీజన్ కంటే ముందుగానే వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతోందని కలెక్టర్‌ని అభినందించారు. సమావేశంలో కలెక్టర్ దివ్యదేవరాజన్, ప్రజాఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస్ రావు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వైద్య శాఖ అధికారులు డాక్టర్ రాజీవ్‌రాజు, డాక్టర్ జలపత్ నాయక్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...