లంబోదరుడి పూజకు వేళాయే..!


Thu,September 13, 2018 12:42 AM

-సిద్ధమైన మండపాలు
-ఆకట్టుకుంటున్న గణపతి విగ్రహాలు
-నేడు వినాయక చవితి
నిర్మల్ కల్చరల్: వినాయక చవితి అంటే తెలుగింట సంబురం అంబరాన్నంటుతుంది.. పేద, మధ్య ఉన్నత వర్గాలు ఎవరి స్థాయికి తగ్గట్లు వారు చవితి పూజకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మ ఆనందంతో ఉండ్రాళ్లు తయారు చేస్తే .. ఇంట్లో మామిడి తోరణాలు కట్టి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎక్కడ చూసినా గురువారం గణపతి విగ్రహాల తరలింపు కనిపించింది.

చవితి ప్రాశస్త్యం..
కైలాసంలో ఒక రోజు పరమశివుడు బయటకు వెళ్లినప్పుడు పార్వతీ దేవి జలకాలాడడానికి వెళ్తుంది. కాపలా కోసం ఒక నిర్జీవమైన మట్టి బొమ్మను తయారు చేస్తుంది. తనకున్న శక్తితో దానికి జీవం పోసి నేను జలకాలాడి వచ్చేవరకు ఎవరినీ లోపలికి పంపవద్దు అని చెబుతుంది. కాపలా ఉన్న ఆ చిన్నారికి పరమశివుడు తెలియదు. ఆ సమయంలో బయట నుంచి కైలాసానికి వచ్చిన పరమశివుడు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా.. ఆ బాలుడు అడ్డుకుంటాడు. పరమశివుడికి కోపం వచ్చి బాలుడి శిరస్సుని మొండెం నుంచి వేరుచేస్తాడు. జలకాలాడి వచ్చిన పార్వతి అక్కడ జరిగిన సంఘటన చూసి విపరీతంగా దుఃఖిస్తుంది. అప్పుడు పరమశివుడు తన భటులను ఆదేశిస్తాడు. ఎక్కడైనా ఉత్తర దిక్కున పడుకున్న జీవి ముఖం ఉంటే వెంటనే తీసుకురండిని ఆదేశిస్తాడు. దీంతో వారు వెతుకుతుండగా అడవిలో ఒక గున్న ఏనుగు పడుకొని ఉంటుంది. దాని తలను తీసుకొని పరమశివుడి వద్దకు తీసుకెళ్తారు. దానిని ఆ బాలుడికి అతికించి జీవం పోయడంతో పార్వతీదేవి సంతోషిస్తుంది. అలా గజముఖంతో ఉన్న గణపతి ఆవిర్భావిస్తాడు. ఆ రోజునే మనం వినాయక చవితిగా జరుపుకొంటున్నాం.

నేడు వినాయక చవితి
జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలకు మండపాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని 36 వార్డులతో పాటు ఆయా మండలాల్లో నిర్వాహకులు మండపాలను సిద్ధం చేశారు. సుదూర ప్రాంతాలకు చెందిన వారు మందుగానే వినాయకులను తీసుకువెళ్లేందుకు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. వినాయకులతో పాటు పూజా సామగ్రి, పూలు, స్వీట్లను కొనుగోలు చేయడంతో మార్కెట్‌లో పండుగ వాతావరణం నెలకొంది. వినాయకులను తీసుకెళ్లే వాహనాలతో ట్రాఫిక్ స్తంభించింది. రెండు రోజుల పాటు ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు పట్టణ సీఐ జాన్‌దివాకర్ తెలిపారు.

మట్టి విగ్రహాలకు భలే గిరాకీ..
పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో పట్టణానికి చెందిన కోటగిరి గోపి తయారు చేస్తున్న మట్టి వినాయకులకు మార్కెట్‌లో భలే గిరాకీ ఉంది. లాభార్జనే ధ్యేయంగా కాకుండా ప్రజల్లో మట్టి వినాయకులను పూజించాలని అవగాహన కల్గించేందుకు ఐదేళ్లుగా విగ్రహాలను తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో మట్టి వినాయకులను పెద్ద మొత్తంలో ప్రతిష్ఠిస్తున్నారు.

పూజా పత్రుల్లో ఎన్నో ఔషధ గుణాలు
మండపాల్లో కొలువదీరనున్న వినాయకుడు 21 ప్రతులతో పూజలు అందుకోనున్నాడు. ఈ 21 పత్రాలతో చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, ఐష్టెశ్వరాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు. దీని గురించి వివిధ గ్రం థాల్లో ప్రస్తావించారు. ఈ 21 రకాల పత్రులు సాధారమైన ఆకులు కావు. ఇవన్నీ మహోత్కృష్టమైనవి, శక్తిమంతమైన ఔషధులు. వీటితో పూజ చేయడం, కొత్త మట్టితో చేసిన ప్రతిమ కలిసి వీచే గాలి మనలో ఉండేఅనారోగ్యాలను దూరం చేస్తుం ది. 9 రోజుల తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలి అనే సందేహం రావచ్చు. చెరువులు, బావులు, కుంటలు, నదులు కొత్త నీటితో కలుషితం అవుతుంటాయి. ఈ నీటిని శుభ్రం చేయడంతో 2 21 రకాల పత్రులు ఔషధాలుగా పనిచేస్తాయి. వీటిని నిమజ్జనం చేసిన 24 గంటల తర్వాత తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కలాయిడ్స్‌ను జలంలోకి వదులుతాయి. అవి నీటిలో బ్యాక్టీరియాను నిర్మూలించి ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనుక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం.

అర్క పత్రం (జిల్లేడు) : పక్షవాతం, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. ఈ పత్రితో పూజిస్తే విశేష ఫలం చేకూరుతుంది.
అశ్వత్త పత్రం (రావి ఆకు) : అతిసారం కంటి వ్యాధులను అరికడుతుంది.
గండకి (సీతాఫలం) : రక్తాన్ని శుద్ధిచేస్తుంది.
దత్తూర పత్రం (ఉమ్మెత్త ) : కీళ్ల రోగాలను నయం చేస్తుంది.
దూర్వారం (గరక) : చర్మ రోగాలు, అజీర్తిని అరికడుతుంది.
బిల్వ పత్రం(మారేడు) : కంటి జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది.
చూత పత్రం (మామిడి) : చిగుళ్ల బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
దాదిమి పత్రం (దానిమ్మ) : రక్తవృద్ధికి తోడ్పడుతుంది.
తులసీ పత్రం (తులసీ) : చర్మరోగాలు, జలుబు, దగ్గు, గొంతు సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
ఆపామార్గ (ఉత్తరేణి) : కడుపులో నులిపురుగులను అరికడుతుంది.
మరువక పత్రం (మరువం) : శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది.

కరవీర పత్రం( ఎర్ర గన్నేరు) : వెంట్రుకలను సంరక్షిస్తుంది.
విఘ్ణక్రాంత (విఘ్ణక్రాంతి) : జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది.
అర్జున పత్రం (తెల్లమద్ది) : శ్వాసకోస వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
శమీ పత్రం (జమ్మి ) : చర్మ వ్యాధులను అరికడుతుంది.
జాజీ పత్రం ( సన్నజాజి ) : తలనొప్పిని నివారిస్తుంది.
సింధూర పత్రం (వాలివి) : పంటినొప్పి, బాలింతలకు నొప్పి అరికడుతుంది.
మాచి పత్రం : ఉబ్బస వ్యాధిని అరికడుతుంది.
బృహతి పత్రం (నేల మునగ ) : వివిధ వ్యాధుల నివారణకు తోడ్పాటునందిస్తుంది.
బదిరి పత్రం (రేగు) : జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.
దేవదారు పత్రం (దేవదారు) :జ్ఞాపకశక్తి, జ్ఞాన వృద్ధికి తోడ్పాటునందిస్తుంది.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...