ఎస్సీలకు రుణాల జాతర


Thu,September 13, 2018 12:41 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సబ్సిడీ రుణాల పథకాన్ని మరింత సరళతరం చేస్తూ రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నది. జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ద్వారా ఈ రుణాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక ప్రణాళిక కింద రుణాలను అందజేయనున్నారు. గతంలో రుణాల అందజేతకు కచ్చితంగా బ్యాంకుల అనుమతి ధ్రువపత్రం ఉంటేగాని రుణాలు పొందేందుకు ఉండకపోయేది. అయితే ప్రభుత్వం కొత్తగా షెడ్యూల్ కులాల యువతి, యువకులకు అందజేసే సబ్సిడీ రుణాల విషయంలో బ్యాంకుల అనుమతి విధానాలను రద్దు చేసింది. బ్యాంకుతో సంబంధం లేకుండా నేరుగా సబ్సిడీ రుణాలు అందించే కొత్త విధానంతో ఎస్సీ యువతకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రుణాలు అందనున్నాయి.

వందకు పైగా రంగాల్లో సబ్సిడీ రుణాలు...
షెడ్యూల్ కులాల యువతి, యువకులకు 2018-19 ఆర్థిక సంవత్సరం కింద వార్షిక ప్రణాళికలో భాగంగా సుమారు వందకు పైగా రంగాల్లో సబ్సిడీ రుణాలు అందజేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. కలెక్టర్ ప్రశాంతి ఆదేశాల మేరకు నోటిఫికేషన్ జారీ చేసి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బి.మాణిక్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకుతో సంబంధం లేకుండా రూ.50వేల విలువ గల యూనిట్లకు సంబంధించి... టైలరింగ్, మగ్గం వర్క్, గాజుల దుకాణం, బార్బర్ షాపు, జ్యూస్ సెంటర్, ఫాన్ షాపు, మొబైల్ రిపేర్ షాపు, సైకిల్ రిపేరు షాపు, తదితర పథకాలు మంజూరు చేస్తామని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇక బ్యాంకు లింకేజి పథకాల కింద మొత్తం 81 రకాల వ్యాపారాలకు సబ్సిడీ రుణాలు అందజేయనున్నారు. ఇందులో 21 రకాల సబ్సిడీ రుణాలు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. పశు సంవర్ధక, మత్స్య, వ్యవసాయ ఆధారిత, చిన్న నీటి వనరులు, ఉద్యానవనం, పట్టుగుళ్ల పెంపకం, రవాణా రంగంలో ట్యాక్సి, కారు, ట్రాక్టర్ ట్రాలీ, ఆటోల వంటి యూనిట్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. యూనిట్ విలువ రూ.లక్ష నుంచి 12లక్షల వరకు అందజేసేందుకు ఈ పథకం వర్తించనుంది. అయితే అర్హత ఉన్న యువతి, యువకులు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలతో పాటు ఫొటోలు, రవాణా రంగంలో రుణం తీసుకోవాలనుకుంటే వీటన్నింటితో పాటు బ్యాడ్జీ నెంబర్లతో కూడిన డ్రైవింగ్ లైసెన్స్ కలిపి దరఖాస్తు చేయాలన్నారు. మీ సేవ కార్యాలయాల ద్వారా http://tsobmms.cgg. gov.inలో నమోదు చేసుకున్న తర్వాత పట్టణ ప్రాంతాల వారు మున్సిపల్ కమిషనర్లకు, గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీవోలకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...