భైంసా/ నమస్తే తెలంగాణ : ఆలు లేదు.. చూలు లేదు.. అన్న చందంగా తయారైంది. ముథోల్ కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి. ముందస్తు ఎన్నికల శంఖారావం పూరించిన టీఆర్ఎస్ అధికపతి, సీఎం కేసీఆర్ అభ్యర్థులను సైతం ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించడం తెలిసిందే. నిర్మల్ జిల్లాలోని మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేయడంతో జిల్లాతో పాటు ముథోల్ నియోజకవర్గం ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ భారీ ర్యాలీలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీలో మాత్రం పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. టీపీసీసీ నేతలంతా రాష్ట్రస్థాయి సమావేశాలతోనే సరిపెడుతున్నారు. మొదటి నుంచి ముథోల్ నియోజకవర్గంలో వర్గపోరుకు పెట్టింది పేరైన హస్తం పార్టీలో ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది.
ఖరారుకు ముందే పోటాపోటి
టీఆర్ఎస్ ప్రచారం హోరెత్తిస్తుంటే కాంగ్రెస్‌లో మాత్రం నాకే అవకాశం అంటూ అంతర్గతంగా, కొందరు బహిరంగంగా, మరికొందరు తగవులాడుతున్నారు. ముథోల్ నియోజవకర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, రామారావు పటేల్ రేసులో ఉండగా ఎన్ఆర్ఐకి చెందిన విజయ్‌కుమార్‌రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే టిక్కెట్ ఎవరికి వచ్చినా అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగేందుకు నారాయణరావు పటేల్, రామారావు పటేల్ ఉన్నట్లు సమాచారం. బీజేపీలో రమాదేవితో పాటు హిందూవాహిని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సరికొండ శ్రీనివాస్‌తో పాటు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు సి. శంకర్ కూడా బీజేపీ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఇలా కాంగ్రెస్, బీజేపీలో ప్రతి ఆశవాహ అభ్యర్థి కూడా ప్రయత్నాలతో పాటు గ్రూపులను సైతం ప్రోత్సహిస్తుండడం పార్టీలో మిగిలిన కొందరు కార్యకర్తలకు అంతు చిక్కడం లేదు.