పండుగలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి


Tue,September 11, 2018 12:56 AM

నిర్మల్‌టౌన్ : గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, మొహర్రం భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ ఎం.ప్రశాంతి, ఎస్పీ శశిధర్‌రాజు కోరారు. కలెక్టర్ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధికారులతో పాటు గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు, మైనార్టీ మత పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 11 రోజుల పాటు నిర్వహించే గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పండుగలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించినప్పుడే ప్రజలందరూ సంతోషంగా పాల్గొంటారన్నారు. నిర్మల్, భైంసా పట్టణ కేంద్రాల్లో నిఘాను మరింత పటిష్టం చేశామన్నారు. గణేశ్ మండపాల వద్ద భక్తి వాతావరణం నెలకొల్పేలా ఉత్సవ కమిటీ సభ్యులు తగిన చేసుకోవాలన్నారు. ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలన్నారు. ఎస్పీ శశిధర్‌రాజు మాట్లాడుతూ జిల్లాలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. గణేశ్ ఉత్సవాల వద్ద నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, మద్యం తాగడం, పేకాట ఆడడం లాంటివి చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి పుకార్లు నమ్మవద్దని సూచించారు. నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. మండపాల వద్ద కరెంట్ సరఫరాకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలని విద్యుత్తు శాఖ జిల్లా అధికారి ఉత్తం సూచించారు. 1.5 కేవీ విద్యుత్తు వినియోగం చేసుకునే వారు రూ. 1550, 1.5 నుంచి 2 కేవీల వరకు రూ. 2275, 3వ స్లాబ్, ఆపైన వినియోగించే వారు రూ. 2700 డీడీ చెల్లిస్తే కరెంటు కనెక్షన్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఉపాధ్యక్షుడు అజింబిన్ మోహియా, గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రత్ ఈశ్వర్, ఆర్డీవో ప్రసూనాంబ, మున్సిపల్ కమిషనర్లు జైరాం, రవిబాబు, విద్యుత్తు శాఖ ఎస్‌ఈ ఉత్తం, తహసీల్దార్లు నరేందర్, సుభాష్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...