సమరానికి సై


Sat,September 8, 2018 01:20 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ప్రభుత్వాన్ని రద్దు చేయడం.. గవర్నర్‌ను కలిసి ఆమోదించుకోవడం.. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం.. ఒకేరోజు చకచకా సాగిపోయాయి. జిల్లాలోని నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాలుండగా.. మూడు చోట్ల సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు ఖరారు చేశారు. నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్‌లో గడ్డిగారి విఠల్‌రెడ్డి, ఖానాపూర్‌లో ఆజ్మీరా రేఖనాయక్‌కు టికెట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు అభ్యర్థులు శుక్రవారం నియోజకవర్గానికి వచ్చారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి నిర్మల్ నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సోన్ నుంచి మంచిర్యాల చౌరస్తా మీదుగా మంత్రి ఇంటి వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేఖానాయక్‌కు బైక్ ర్యాలీలో ఘన స్వాగతం పలికారు. ముథోల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి విఠల్‌రెడ్డి బాసరలో అమ్మవారికి పూజలు నిర్వహించారు.

పార్టీ శ్రేణులు సిద్ధం
అభ్యర్థులను ప్రకటించడంతో ఏ క్షణాన ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం గడిచిన నాలుగేండ్ల మూడు నెలల్లో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేపట్టారో.. వాటి ఫలాలు ప్రజలకు ఏ విధంగా అందాయో వివరించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టగా.. వీటితో పేదల బతుకుల్లో వెలుగులు నిండాయి. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను వందశాతం నెరవేర్చడంతో పాటు హామీ ఇవ్వని, ఎవరూ అడుగని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో పేద, బడుగు, బలహీనవర్గాల వారి కన్నీళ్లు తుడిచారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా పథకాలను ప్రవేశపెట్టారు. దీంతో ఈ విషయాన్ని ప్రతి ఇంటింటికీ వెళ్లి టీఆర్‌ఎస్ శ్రేణులు చెప్పనున్నాయి.

ఇంటింటా ప్రచారం
ఇంటింటా ప్రచారం చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముగ్గురు సిట్టింగ్‌లు పాతవారే కావడంతో వీరందరికి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను పల్లెలు, ప్రజల చెంతకు తీసుకెళ్లారు. ముగ్గురు కూడా గతంలో నుంచి రాజకీయాల్లో ఉండడం, సిట్టింగ్‌లే కావడంతో ప్రజలతో సత్సంబంధాలు, పార్టీ శ్రేణులతో సమన్వయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధి, సమస్యల పరిష్కారం, వివిధ వర్గాలకు ఏ విధంగా అండగా నిలిచారో ప్రజల్లోకి వెళ్లి చెప్పనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రచారం జోరందుకుంది. మరికొన్ని చోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఇక పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. గ్రామాల వారీగా, మండలాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన కార్యచరణ రూపొందిస్తున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులను ప్రకటించేలోపే తాము ఒక విడత గ్రామాల్లోకి వెళ్లి ప్రచారాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...