సిట్టింగ్‌లకే పచ్చజెండా


Fri,September 7, 2018 12:04 AM

-నిర్మల్, ముథోల్, ఖానాపూర్ సెగ్మెంట్లకు అభ్యర్థుల ఖరారు
-మంత్రిగా కొనసాగనున్న అల్లోల
-కారు గుర్తుతో తొలిసారి బరిలో అల్లోల, విఠల్‌రెడ్డి
-రెండో సారి అవకాశం దక్కించుకున్న రేఖానాయక్
-జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు
నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: కారు జోరు పెంచింది. జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది.. అసెంబ్లీని రద్దు చేసేందుకు మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానించగా.. దీన్ని వెంటనే గవర్నర్ ఆమోదించారు.. ఇక ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్ కొనసాగగా.. జిల్లాకు చెందిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా కొనసాగుతారు.. ఊహించని విధంగా గులాబీ అధినేత కేసీఆర్ 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో సిట్టింగులకే టికెట్లు ఖరారు చేశారు. మూడు నియోజకవర్గాల్లోనూ పాతకాపులకే టికెట్లు ఇవ్వగా.. టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. మంత్రి అల్లోల, ముథోల్ తాజా మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి తొలిసారి కారు గుర్తుపై బరిలో దిగుతుండగా.. ఖానాపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ రెండో సారి టీఆర్‌ఎస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దూకుడుగా దూసుకుపోతోంది.. గురువారం రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేయడం, ఆ వెంటనే గవర్నర్ ఆమోదించడం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగేలా గవర్నర్ కోరడం.. ఇలా పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. జిల్లాకు చెందిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రిగా కొనసాగారు. అసెంబ్లీ రద్దు కావడంతో ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్ కొనసాగుతుండగా.. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కూడా ఆపద్ధర్మ మంత్రిగా కొనసాగనున్నారు. జిల్లాలోని ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా ఉన్న అజ్మీరా రేఖానాయక్, గడ్డిగారి విఠల్‌రెడ్డి గురువారం నుంచి తాజామాజీ ఎమ్మెల్యేలుగా మారిపోయారు. ఆపద్ధర్మ మంత్రితో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు గురువారం హైదరాబాద్‌లోనే ఉండగా.. పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థులతో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు.

అభ్యర్థుల పేర్లు వెల్లడి
టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవగా.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 105అసెంబ్లీ నియోజక వర్గాలకు అభ్యర్థులను కూడా పార్టీ అధినేత కేసీఆర్ ప్రటించారు. జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాలు ఉండగా.. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మూడు స్థానాల్లోనూ ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. మూడు చోట్లా అభ్యర్థులను ఖరారు చేయగా.. మళ్లీ సిట్టింగ్‌లకే అవకాశం కల్పించారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో పాతకాపులకే మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు అవకాశం కల్పించారు. నిర్మల్ నియోజకవర్గం అభ్యర్థిగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా అజ్మీరా రేఖానాయక్, ముథోల్ నియోజక వర్గం అభ్యర్థిగా గడ్డిగారి విఠల్‌రెడ్డి పేర్లను తొలి జాబితాలోనే ప్రకటించారు. దీంతో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఈ ముగ్గురు కూడా బరిలో దిగనున్నారు.

కారు గుర్తుగా తొలిసారి బరిలోకి విఠల్‌రెడ్డి
ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తాజామాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి కారు గుర్తు మీద తొలిసారిగా బరిలోకి దిగుతున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బీఎస్పీ నుంచి నిర్మల్ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందగా.. ఆ తర్వాత బీఎస్‌ఎల్‌పీని టీఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేశారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 సాధారణ ఎన్నికల్లో గడ్డిగారి విఠ్ఠల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి ముథోల్ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ తాజామాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ రెండో సారి కారు గుర్తు మీద పోటీ చేస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో అజ్మీరా రేఖా నాయక్ టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగగా.. విజయం సాధించారు.

టీఆర్‌ఎస్ శ్రేణుల్లో హర్షం
జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో సిట్టింగులకే టికెట్లు ఖరారు చేయడంపై టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. టీఆర్‌ఎస్ పార్టీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, గుబాబీ అధినేత కేసీఆర్, ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖా నాయక్, గడ్డిగారి విఠల్‌రెడ్డిలకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్వీట్లు పంచుతూ, తినిపించుకుని తమ ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. టీఆర్‌ఎస్ జెండాలు, ఫ్లెక్సీలు, ఫ్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహించారు. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇచ్చినందుకుగాను శుక్రవారం రోజున సోన్ నుంచి నిర్మల్ వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీని నిర్వహించనున్నారు.


ఓటర్ల జాబితా సిద్ధం
నిర్మల్ టౌన్: జిల్లాలో సమగ్ర ఓటర్ల ముసాయిదాను ప్రకటించడంతో పలు గ్రామాలకు పంపిణీ చేసే ఓటర్ల జాబితాను కలెక్టర్ కార్యాలయంలో గురువారం అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే బీఎల్‌వోల సమక్షంలో రూపొందించిన జాబితాను సంబంధిత కార్యదర్శుల ద్వారా గ్రామ పంచాయతీలకు పంపామని ఎన్నికల నిర్వాహకులు తెలిపారు.

ఖానాపూర్ నియోజకవర్గం
అభ్యర్థి పూర్తి పేరు: అజ్మీరా రేఖానాయక్
భర్త పేరు : అజ్మీరా శ్యాం నాయక్
పుట్టిన తేది : 19.12.1974
వివాహం : 10.08.1988
విద్యార్హత : ఎంఏ ఎల్ ఎల్ బీ
నివాస స్థలం : రాజీవ్‌నగర్, ఖానాపూర్
కూతరు, కొడుకు : పూజ, అక్షిత్
-రాజకీయ ప్రవేశం : 2009లో ఆసీఫాబాద్ జడ్పీటీసీగా రాజకీయ అరంగేట్రం చేసి గెలుపొందారు.
-2013లో ఏప్రిల్ 22న టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎన్నికల్లో తలపడ్డారు.
-2014 సంవత్సరంలో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 16 వేల ఓట్ల మెజారిటీతో సమీప టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు.
-2018లో మళ్లీ రెండో సారి టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.

పెంబిలో టీఆర్‌ఎస్ నాయకుల సంబురాలు
పెంబి: మండల కేంద్రంలో గురువారం టీఆర్‌ఎస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ఖా నాపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు పార్టీ నుంచి టికెట్‌ను ఖరారు చేయడంతో మండలంలోని టీఆర్‌ఎస్ నాయకులు టపాకాయలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. టీఆర్‌ఎస్ మండల అద్యక్షుడు పుప్పాల శంకర్, మాజీ సర్పంచ్ కున్సోత్ రమేశ్, ఎంపీటీసీ ఆరే రాజేందర్, నాయకులు శేఖర్ గౌడ్, లక్ష్మీనారాయణ, పుప్పాల మల్లేశ్, గాండ్ల శంకర్, చెర్పురి సుధాకర్, ఇస్మాయిల్, కూన భీమేష్, కౌట నరేందర్ పాల్గొన్నారు.

నిర్మల్ నియోజకవర్గం
పేరు : అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
తల్లిదండ్రులు : అల్లోల చిన్నమ్మ- నారాయణరెడ్డి
పుట్టిన తేదీ : 16.02.1949 (69 సంవత్సరాలు)
స్వస్థలం : ఎల్లపెల్లి, నిర్మల్ మండలం, జిల్లా నిర్మల్
చదువు : బీకాం, ఎల్.ఎల్.బీ
భార్య : విజయలక్ష్మి
కొడుకు : గౌతంరెడ్డి, కూతురు: పల్లవి
-1985లో తెలుగుదేశంలో చేరిక... పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక
-1987-91 ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నిక
-1991-96 ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా టీడీపీ తరపున విజయం (1992లో కాంగ్రెస్‌లో చేరిక)
-1999-2004 నిర్మల్ శాసనసభ్యుడిగా విజయం
-తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ ఫోరం కన్వీనర్‌గా ఎంపిక
-తెలంగాణ రిజనల్ కాంగ్రెస్ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా నియామకం
-2004 నుంచి 2008 నిర్మల్ శాసనసభ్యుడిగా కాంగ్రెస్ తరపున విజయం
-2008-09 ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక
-2014 బీఎస్పీ నుంచి పోటీ చేసి నిర్మల్ శాసనసభ్యుడిగా విజయం
-టీఆర్‌ఎస్‌లో చేరిక, తెలంగాణ రాష్ట్ర న్యాయ, గృహ, దేవాదాయశాఖల మంత్రిగా బాధ్యతలు

ముథోల్ నియోజకవర్గం
పేరు : గడ్డిగారి విఠల్ రెడ్డి
తండ్రిపేరు : గడ్డిగారి గడ్డెన్న
గ్రామం : దేగాం, భైంసా మండలం
వివాహం : 10-08-1970
విద్యార్హత : బీఏ, ఎల్‌ఎల్‌బి
భార్య పేరు : గడ్డిగారి లక్ష్మి
నివాస స్థలం : దేగాం
పుట్టిన తేదీ : 6-8-1954

-భైంసా పట్టణంలో న్యాయవాదిగా కొనసాగుతూ అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు.
-2006 నుంచి 2008 వరకు, 2010 నుంచి 2013 వరకు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కొనసాగారు.
-మొదట ఎమ్మెల్యేగా పోటీ 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి 183 ఓట్లతో ఓటమి పాలయ్యారు.
-2014లో కాంగ్రెస్ టికెట్‌తో బరిలోకి దిగి 14 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
-2014 ఆగష్టు 6వ తేదీన టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన 105 మంది తొలి జాబితాలో ముథోల్ నియోజకవర్గం నుంచి మరోసారి టికెట్ దక్కించుకున్నారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...