కంటి వైద్య శిబిరాలకు విశేష స్పందన


Wed,September 5, 2018 01:43 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో పేదల కండ్లలో వెలుగులు ప్రసాదిస్తున్నాయి. ఆగస్టు 15 నుంచి ప్రారంభమైన కంటి వెలుగు పథకంలో ఇప్పటివరకు 31,150 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. జిల్లాలో 19 మండలాలతో పాటు రెండు మున్సిపాలిటీలో మొత్తం 16 బృందాలు కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే జిల్లాలో 3150 మంది ఆరోగ్య పరీక్షలను నిర్వహించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఆయా కంటి వైద్య పరీక్షా కేంద్రాల్లో సిబ్బంది శిబిరాలకు వస్తున్న రోగులకు ఎన్‌రోల్‌మెంట్ చేసుకొని కంటి వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. కంటి జబ్బులు ఎక్కువగా ఉన్న వారికి శస్త్ర చికిత్సలకు కూడా సిఫార్స్ చేయడంతో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో శిబిరాలను సద్వినియోగం చేసుకునేందుకు ఉదయం నుంచే కంటి వైద్య శిబిరాలకు జనం తరలిరావడంతో సందడి నెలకొంది.

ప్రతిరోజు నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాలను జిల్లా వైద్య అధికారి జలపతినాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో మోహన్‌బాబు, నోడల్ అధికారి శ్రీనివాస్ సందర్శించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ఒక రోజు ముందుగానే ప్రచారం చేయడంతో కంటి జబ్బులు ఉన్నవారంతా ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక జిల్లాలో మంగళవారం 3150 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 300 మందికి కంటి ఆపరేషన్ల కోసం ఎల్‌వీ ప్రసాద్ దవాఖానకు సిఫార్స్ చేసినట్లు డాక్టర్లు వివరించారు. జిల్లాలో మొత్తం 5వేల మందికి ఇప్పటివరకు కండ్లద్దాలు పంపిణీ చేయగా.. మంగళవారం మరో 500 మందికి కండ్లద్దాలను పంపిణీ చేసినట్లు వారు వివరించారు. కంటి వెలుగు శిబిరం ఆన్‌లైన్ డాటాను ఎప్పటికప్పుడు సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఈశిబిరాల్లో ఆరోగ్య కార్యకర్తలతో పాటు ఆశా కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు, పంచాయతీశాఖ అధికారులు భాగస్వాములై విజయవంతానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...