ఆపదలో ఆపన్నహస్తం100

Thu,December 5, 2019 01:52 AM

-పోలీసులకు ఫోన్‌ చేయడం ప్రాథమిక హక్కు
-రక్షకభటులను తల్లిదండ్రులతో సమానం భావించాలి
-భయపడకుండా భయపెట్టే స్థాయికి ఆడపిల్ల ఎదగాలి
-విద్యాసంస్థల్లో బాలికా రక్షణ కమిటీలను నియమించాలి
-‘నా పోలీస్‌ నా భద్రత’లో ఎస్పీ డాక్టర్‌ చేతన

కోస్గిటౌన్‌ : ఆపద సమయాల్లో 100 ఆపన్న హస్తంలా పనిచేస్తుందని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోరడం ప్రాథమిక హక్కు అని ఎస్పీ డాక్టర్‌ చేతన విద్యార్థినులకు సూచించారు. బుధవారం పట్టణంలోని పంచాక్షరి ఫంక్షన్‌హాల్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘నా భద్రత నా పోలీసు’ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ నేను ఒక పోలీసు అధికారిగా కాకుండా మీతో ఒక మహిళగా మాట్లాడుతున్నానని అన్నారు. పోలీసులంటే రక్షకభటులని, తల్లిదండ్రులు పిల్లలకు రక్షణగా ఎలాగ ఉంటారో సమాజంలోని ప్రజలందరికీ పోలీసులు రక్షకులన్నారు. ముఖ్యంగా నీనేస్తం పేరుతో నారాయణపేట జిల్లాలో పోలీసులు మహిళలవద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నారని, జిల్లాలోని ప్రతి గ్రామంలో నీనేస్తం పేరుతో ఫిర్యాదు బాక్సు లు ఏర్పాటు చేసి మహిళల సమస్యలు పరిష్కరిస్తున్నారని గుర్తు చేశారు.

మహిళలు, విద్యార్థినులు ఎవరైనా ఏ సమస్య వచ్చినా నీనేస్తం బాక్సులో చిన్న ఫిర్యాదు రాసి వేస్తే చాలు సత్వరమే పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామన్నారు. సమాజంలో ఆడపిల్లలపై దాడులు జరగడం బాధకరమే, దోషులను కఠినంగా శిక్షించాలని ఉన్నప్పటికీ ఏ పోలీసు అయినా చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆడపిల్లలపై సమాజంలో ఎక్కడో ఓ చోట దాడులు జరుగుతున్నా ఆడపిళ్లలు సైతం కనీసం అవగాహన రాహిత్యంగా ఉండటం సరికాదని, ఆడపిల్లలు ఆపదలో ఏ విధంగా ఉండాలి, ఎలా స్పందించాలి అనే విషయాలపై కనీస అవగాహన ఉండాలన్నారు. 24 గంటలపాటు పోలీసులు అందుబాటులో ఉంటారని, ఏ అవసరం వచ్చినా 100కు ఫోన్‌ చేసినా తక్షణమే స్పందిస్తారని చెప్పారు. మండలంలోని ప్రతి పాఠశాల, కళాశాల నుంచి ఐదుగురు బాలికలను ఎంపిక చేసి బాలిక రక్షణ కమిటీని ఏర్పాటు చేసి వారికి మొదటగా అవగాహన కల్పించి వారిచే పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు అవగాహన కల్పించేలా ప్రణాళికలు తయారు చేయాలని మహిళలకు సూచించారు. గ్రామాలలో అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు బాలికల రక్షణపై అవగాహన కల్పించాలన్నారు.

నేటి నుంచి గ్రామాలలోని ప్రధాన కూడళ్లు పాఠశాలల వద్ద బాలికలు ఆపదలో ఉన్నప్పుడు 100, 112కు డయల్‌ చేయాలని పోస్టర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు సైతం ఆడపిల్లలు ధైర్యంగాఉండేలా ఇంటి వద్ద ధైర్యం చెప్పాలని సూచించారు. అంతకు ముందు పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థినులు బాలికల సమస్యలపై ప్రశ్నలు వేయగా వాటన్నింటికీ ఎలా స్పందించాలో ఎస్పీ వారికి వివరించారు. ముఖ్యంగా పాఠశాల వేళలకు బస్సులు రాక సాయంత్రం గ్రామాలకు విద్యార్థులు ఇంటికి వెళ్లేసరికి 7 గంటలు అవుతుందని చెప్పడంతో ఎస్పీ స్పందించి వెంటనే డిపో మేనేజర్‌తో మాట్లాడి సమయానికి బస్సులు వచ్చేలా చూస్తామని విద్యార్థులకు హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మధుసుదన్‌రావు, సీఐ ప్రేమ్‌కుమార్‌ మద్దూర్‌ ఎస్సై హరిప్రసాద్‌రెడ్డి, కోస్గి ఎస్సై నాగరాజు, సీడీపీవో స్వప్నప్రియ, ఏపీఎం నిర్మల, ఎంఈవో అంజలీదేవి, పీహెచ్‌ఎన్‌ శోబారాణి పాల్గొన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles