విధుల పట్ల నిర్లక్ష్యం సహించం

Thu,December 5, 2019 01:44 AM

-సమస్యలపై దృష్టి సారించాలి
-త్వరగా వాటిని పరిష్కరించాలి
-ప్రతి అంశాన్ని నాకు తెలియజేయాలి
-రాంపూర్‌ పలె ్లప్రగతిలో కలెక్టర్‌ వెంకట్రావు
-ప్లాస్టిక్‌ కవర్లు ఉండటంపై అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

నర్వ : విధులపట్ల నిర్లక్ష్యం వహించే అధికారులను ఎంత మాత్రం సహించబోమని కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు. బుధవారం కలెక్టర్‌ నర్వ మండలంలోని రాంపూర్‌లో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ముందుగా పాఠశాలను తనిఖీ చేసిన ఆయన పాఠశాల తరగతి గదులలో రేషన్‌ బియ్యం సంచులు ఉండడం, విద్యార్థులు కింద కూర్చొవడం చూసి అసంతృప్తి వ్యక్తం చేశా రు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్క లు నాటారు. అక్కడి నుంచి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి రికార్డులను పరిశీలించి, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అందించే పౌష్టికాహారం వివరాలను తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. అటు నుంచి గ్రామంలోని రేషన్‌ దుకాణం తనిఖీకి వెళ్తున్న క్రమంలో దారిలో విపరీతంగా ప్లాస్టిక్‌ కవర్లు కనిపించడంపై ఎంపీడీవో రమేశ్‌కుమార్‌, కార్యదర్శిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


స్వయంగా వారిచేత పరిసరాలను శుభ్రం చేయించారు. తరువాత గ్రామంలోని అంబేద్కర్‌ విగ్రహానికి వందనాలు సమర్పించి గ్రామంలోని వీధి వీధి కలియతిరిగి సమస్యలను స్వయంగా పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, గ్రామంలోగల పలు సమస్యలను వివరించగా వాటి పరిష్కారానికి సత్వరమే ఆదేశాలు జారీ చేస్తూ పెండింగ్‌లో ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌, విలేజ్‌ బుక్‌ కీపర్‌ ఉద్యోగులకు అక్కడే ఎంపిక నిర్వహించారు.

అటుపై ఉపాధి హామీ పెండింగ్‌ బిల్లులపై, పింఛన్లు పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంలో అధికారులకు ఇట్టి పనులకు సంబంధించిన ప్రతి అంశం వివరాలు తనకు సమర్పించాలని మూడు రోజులలో తాను స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. విధుల పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సస్పెండ్‌ చేయడం జరుగుతుందని, సంబంధిత సిబ్బందిని హెచ్చరించారు. చివరగా గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన కలెక్టర్‌ జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో రమేశ్‌కుమార్‌, ఆర్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డి, ఎంపీటీసీ పద్మమ్మ, ఉపసర్పంచ్‌ నాగరాజుతోపాటు గ్రామస్తులు ఉన్నారు.

14
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles