మరికల్ : నారాయణపేట, గద్వాల్, మహబుబ్‌నగర్ జిల్లాలోని ఏడు గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థినులు జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు శనివారం ప్రాంతీయ స్థాయిలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ పోటీల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలల ప్రాంతీయ అధికారి ప్లోరెన్స్రాణి, అదనపు అధికారి శ్రీనివాస్‌రెడ్డి, నారాయణపేట జిల్లా అధికారి దేవాసేన, స్థానిక గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్పీకర్‌గా, ప్రధానమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, తమ విధులను నిర్వహించారు. ఈ మాక్ పార్లమెంట్లో ఈ మద్య మృతి చెందిన పార్లమెంట్ సభ్యు లు అరుణ్‌జైట్లి, సుష్మాస్వరాజ్‌ల మృతికి సంతాపంగా రెండు నిమిషలు మౌనం పాటించారు. అనంతరం సభలో ప్రధాని, ప్రతిపక్ష పార్టీల నాయకుల మధ్య జరిగిన సంభాషణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలో నారాయణపేట గురుకుల పాఠశాల మొదటి బహుమతి సాధించగా గద్వాల గురుకుల పాఠశాల విద్యార్థినులు ద్వితీయ బహుమతి, మహబూబ్‌నగర్ విద్యార్థినులు మూడో బహుమతి సాధించారు. వీరికి మొదటి బహుమతిగా రూ.3 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.2వేలు, తృతీయ బహుమతిగా రూ.వెయ్యి చొప్పున నగదుతో పాటు షీల్డ్‌లను అందజేశారు. అలాగే పలువురు విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.