ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 కబడ్డీ పోటీలు ఉత్కంఠగా ముగిశాయి. బుధవారం జరిగిన తుదిపోరులో పాలమూరు బాలుర జట్టు విజేతగా అవతరించింది. రన్నరప్‌గా వరంగల్ జట్టు, తృతీయ స్థానంలో నల్గొండ జట్టు నిలిచింది. బాలికల విభాగంలో విజేతగా రంగారెడ్డి, రన్నర్ నల్గొండ, తృతీయ స్థానంలో ఖమ్మం బాలికల జట్టు స్థానం దక్కించుకున్నాయి.
బహుమతుల ప్రదానోత్సవం
కబడ్డీ పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడా జట్లకు గ్రామ సర్పంచ్ అనితానాగోజీ బహుమతి ప్రదానం చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా నాగర్‌కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, ఉమ్మడి పాలమూరు కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ పాపిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, ఓటమి గెలుపునకు నాంది అన్నారు. అనంతరం సొంతంగా విజేతలకు బహుమతులు అందజేశారు. పేద క్రీడాకారులకు ఎల్లప్పుడు చేయూతనందిస్థానని, ఢిల్లీలో జరిగే జాతీయ పోటీలలో పాల్గోనే క్రీడాకారులకు సహాయసహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. పాపిరెడ్డి మాట్లాడుతూ ఫైనల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.
వారు ఈనెల 17 నుంచి 22 వరకు ఢిల్లీలో జరిగే ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో రాష్ట్ర జట్టులో పాల్గొంటారని తెలిపారు. క్రీడలను దిగ్విజయంగా నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ ఆర్గనైజర్, యాదయ్యగౌడ్తోపాటు టోర్నమెంట్‌కు సహకరించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా సభ్యులు బాలరాజ్, విజయ్‌కుమార్, జగన్మోహన్గౌడ్, ఒడన్న, సర్పంచుల సంఘం అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, ఊర్కొండ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గిరినాయక్, నాయకులు జంగయ్య, మల్లేశ్‌గౌడ్, అశోక్‌రెడ్డి, రేపాని శ్రీనివాసులు, సిద్దు, యాదగిరి, జహీర్, అజార్, క్రీడాఉపాధ్యాయులు ప్రకాశ్, రమేశ్, పురంచంద్, ఆంజనేయులు, రమేశ్, మొహన్లాల్తో పాటు పలువురు పాల్గొన్నారు.