సమిష్టిగా జిల్లా అభివృద్ధి

Mon,October 21, 2019 01:48 AM

-గత పాలకుల నిర్లక్ష్యంతోనే నారాయణపేట వెనుకబాటు
-తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మారిన పరిస్థితులు
-వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు
-ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
-వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి : ఎంపీ మన్నె
-మక్తల్‌లో వ్యాపార సముదాయం ప్రారంభం

నారాయణపేట ప్రతినిధి/ నమస్తే తెలంగాణ: ఉమ్మడి పాలమూరు జిల్లాలో తరతరాలుగా వెనుకకు నెట్టివేయబడిన జిల్లా నారాయణపేట. దశాబ్దాల తరబడి పాలించిన ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని పట్టించుకున్న పాపానపోలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం రాత్రి మక్తల్ పట్టణంలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో రూ.కోటి 80 లక్షల వ్యయంతో నిర్మించిన వ్యాపార సముదాయ భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణానది అంటేనే ప్రతి ఒక్కరికి నారాయణపేట జిల్లాలోని మక్తల్ ప్రాంతం గుర్తుకు వస్తుంది. పక్క నుంచి కృష్ణా నీళ్లు వెళ్తున్నా తాగునీటికి, సాగునీటికి నోచుకోలేని పరిస్థితులు ఈ ప్రాంతానివని చెప్పారు. గత పాలకులందరూ ఈ ప్రాంతాన్ని చిన్నచూపు చూశారు. ఒక రకంగా వెనుకకు నెట్టివేసిన ప్రాంతంగా మిగిల్చారని ఆవేదనను వ్యక్తం చేశారు. అటువంటి ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం అయ్యాక పరిస్థితులు మారాయన్నారు. కృష్ణానదిలో మన వాటా నీటిని దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, రిజర్వాయర్ల నిర్మాణాలతో ఈ ప్రాంతమంతా ధాన్యాగారంగా మారుతుందన్నారు. పంటల దిగుబడి ఎక్కువగా వస్తూ రైతులే రాజులుగా చలామణి అవుతున్నారన్నారు. 24గంటల విద్యుత్ సరఫరా, రైతు బీమా, రైతుబంధు, వంటి పథకాలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయన్నారు.

వ్యవసాయానికి అందుతున్న ఆర్థిక సాయం, రైతులకు ఆపద కలిగితే బీమా పథకం అండగా నిలవడం చేపట్టిన ప్రాజెక్టులతో పుష్కలంగా సాగునీరు అందే పరిస్థితులు రైతులను రాజులుగా చేస్తున్నాయని చెప్పారు. నారాయణపేట జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో చేపట్టే ప్రతి పథకం ఈ జిల్లాలో అమలయ్యేలా కృషి చేస్తామన్నారు. ధాన్యం ఉత్పత్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కృష్ణా - మాగనూరు మండలాల మధ్య మరో మార్కెట్ యార్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన 50 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని ఆర్డీవోకు సూచించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు పాలమూరు - రంగారెడ్డి పథకం ద్వారా సాగునీటిని అందించి నారాయణపేట సమీపంలో ఉన్న జయమ్మ చెరువు నింపి మిగిలిన ప్రాంతాలన్నింటిని సస్యశ్యామలం చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే మిగిలిన అన్ని రంగాలు ఈ జిల్లాలో అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయన్నారు.

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ దినదినాభివృద్ధి సాధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపును పొందగలిగిందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా మార్కెట్ యార్డును రూపొందించడం జరిగిందని చెప్పారు. మార్కెట్ యార్డుతో వచ్చిన లాభాలతో వ్యాపార సముదాయ భవనాలను నిర్మించడం జరిగిందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతకుముందు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ వనజ, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సంఘం సభ్యురాలు సుచరితారెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్సిములుగౌడ్ తదితరులతో కలిసి వాణిజ్య సముదాయాలను ప్రారంభించారు. కార్యక్రమాలలో ఆర్డీవో శ్రీనివాసులు, మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆంజనేయులు, ఎంపీపీ వనజ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

పడమటి అంజన్నకు పూజలు
మక్తల్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి స్వగృహం నుంచి బయలుదేరిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్ వనజ, ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సంఘం సభ్యురాలు సుచరితారెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్సింహులుగౌడ్ తదితరులతో కలిసి నేరుగా దేవాలయానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రి ఇతర నేతలకు సాంప్రాదాయ రీతిలో స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు..

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles