గోదావరి జలాలతో రైతుల భూములు


Fri,November 22, 2019 03:57 AM

-గోదావరి జలాలకు కార్తీక దీపోత్సవం
-రైతులు, మహిళల ఆనందోత్సాహం
-పాల్గొన్న మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

చివ్వెంల : రాష్ట్రం పాడిపంటలతో సస్యశామలంగా ఉండాలని, ప్రతి చెలక భూమిలో నీరు పారించాలనే పట్టుదలతో సీఎం కేసీఆర్‌ ఉన్నారని, గోదావరి జలాలతో రైతుల భూములు తడుస్తుంటే కొంతమందికి కన్నీళ్లొస్తున్నాయని, గోదావరి జలాలతో నిండిన చెరువుల వద్ద అద్భుతదృశ్యం కనిపిస్తుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి చివ్వెంల మండలం ఐలాపురం గ్రామశివారులో గత నాగులమ్మచెరువులో గోదారమ్మకు కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని మహిళా రైతులతో కలిసి చెరువులోకి కార్తీక దీపాలను వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పుడు వచ్చే నీళ్లు చెరువులకే కాదు, పంటపొలాలకు కూడా నీళ్లు ఇవ్వడానికే కృషి చేస్తున్నామన్నారు. ఇకపై ప్రతి యేడాది రెండు పంటలకు నీళ్లు అందించేందుకు కృషి చేస్తామన్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఏ ఒక్క చెరువు కూడా అడుగు చూడకుండా నిత్యం గోదావరి నీళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి చెరువులో 365రోజులు నీళ్లు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారని తెలిపారు.

గోదావరి జలాలకు దీపాలు వెలిగిస్తున్న మా అక్కాచెల్లెళ్ల కళ్లు కోటి దీపాలకంటే ఎక్కువగా ప్రకాశిస్తున్నాయన్నారు. అజ్ఞానం పోగొట్టి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించడమే దీపారాదణ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. గత పాలకులు నీళ్లు ఇచ్చే ఉద్దేశంతో కాలువలు తవ్వలేదని కేవలం వాళ్ల కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే కాలువలు తవ్వి వదిలేశారని మండిపడ్డారు. గ్రామాల్లో ఎక్కడైనా నీటి ప్రవాహాలకు ఇబ్బందులొస్తే స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయాలన్నారు. ఇప్పటికే రూ. 600కోట్ల నిధులు కాలువల మరమ్మతులకు విడుదలై ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తిచేసేలా సీఎం కేసీఆర్‌కు సంకల్పబలం ఇచ్చి గోదావరి జలాలను తమ భూముల చెంతకు చేర్చిన భగవంతుడిని మా మహిళా రైతులు జ్యోతిరూపంలో ఆరాధించడం గొప్ప పరిణామమన్నారు. సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలతో పాటు 24గంటల కరెంట్‌ కేసీఆర్‌ సీఎం అయిన తరువాతనే అందుతున్నాయన్నారు. అంతకుముందు మంత్రి జగదీష్‌రెడ్డికి ఐలాపురం, గుర్రతండా, ఆంగోతుతండా మహిళా రైతు హరతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ ధరావత్‌ కుమారిబాబునాయక్‌, జడ్పీటీసీ భూక్యా సంజీవనాయక్‌, సర్పంచ్‌ బోడపట్ల సునితశ్రీను, వైస్‌ ఎంపీపీ జూలకంటి జీవన్‌రెడ్డి, ఎంపీటీసీ బుచ్చమ్మ, మాజీ ఎంపీపీ రైతు నర్సింహ్మరావు, బాషా, గుర్రం సత్యనారాయణరెడ్డి, పొదిల శంకర్‌, హరిసింగ్‌ పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...