మరో దఫా భూ కొనుగోలుకు సిద్ధ్దం


Wed,November 20, 2019 01:24 AM

- ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 500ఎకరాలు కొనుగోలుకు రూ.3కోట్లు విడుదల
- ఈ ఏడాది ఎస్సీలకు పంపిణీ చేసేందుకే..
- పట్టాదారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
- మార్కెట్ విలువ బట్టి చెల్లింపు : ఇన్‌చార్జి కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ, నమస్తే తెలంగాణ : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరో దఫా భూమి కొనుగోలు చేసి దళిత కుటుంబాల్లో అర్హులైన వారికి 3ఎకరాల చొప్పున పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. జిల్లా వ్యాప్తంగా 500 ఎకరాలు కొనుగోలు చేసి అర్హులకు అందజేయాలని ఆదేశించడంతో ఆ దిశగా పట్టాదారుల నుంచి అధికార యంత్రాంగం దరఖాస్తులు కోరుతోంది. జిల్లాలోని దళిత కుటుంబాల్లో భూమి లేని వారికి మూడెకరాలు, అరెకరం ఉన్న వారికి రెండున్నర ఎకరాలు, ఎకరం ఉన్న వారికి రెండు ఎకరాలు, రెండు ఎకరాలున్నవారికి ఎకరం చొప్పున పంపిణీ చేయనున్నారు. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రూ. 3 కోట్లతో 500 ఎకరాల కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మార్కెట్ విలువను బట్టి చెల్లింపు...
జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఆసక్తి కలిగిన భూ పట్టాదారులు తమ భూమి విక్రయానికి ఆమోదం తెలుపుతూ దరఖాస్తు చేసుకుంటే అక్కడి మార్కెట్ విలువకు అనుగుణంగా ప్రభుత్వ నిబంధనల మేరకు డబ్బులు చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోనున్నారు. నేల రకం, నీటి లభ్యతను సైతం పరిగణలోకి తీసుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులు మినహా మిగిలిన రైతులు ఎక్కువ భూమి ఉండి విక్రయించాలనుకుంటే దరఖాస్తుతోపాటు గ్రామం, మండలాన్ని తెలియజేస్తూ పట్టేదారు పేరు, కులం, చిరునామా సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్, సర్వే నెంబర్, విస్తీర్ణం, నేల రకం, సాగులో ఉన్నదా.. లేదా, మార్కెట్ విలువ, పట్టేదారు అమ్మే ధర తదితర వివరాలతో దరఖాస్తులు రాసి వాటికి సంబంధించిన జిరాక్స్ ప్రతులను ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ సూచించారు.

ఇప్పటి వరకు 612.22 ఎకరాల పంపిణీ...
జిల్లా వ్యాప్తంగా 2014-15 ఆర్థిక సం. నుంచి 2017-18 ఆర్థ్ధిక సం. వరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 612.22 ఎకరాల భూమిని అర్హులైన దళితులకు పంపిణీ చేశారు. 25 గ్రామాలకు చెందిన 234 మంది దళితులకు 22.476 కోట్లు వెచ్చించి ఒక్కొక్కరికి అర ఎకరం నుంచి మూడెకరాల వరకు అర్హతను, వారికున్న భూమిని దృష్టిలో పెట్టుకుని పంపిణీ చేయగా ఈ ఏడాది 500 ఎకరాలను కొనుగోలు చేసి అందజేసేందుకు ప్రభుత్వం రూ. 3 కోట్లు కేటాయించినట్లు ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక అధికారి వినోద్‌కుమార్ తెలిపారు.

ప్రత్యేక రాష్ట్ర ఫలితమే సాగునీటి ప్రాజెక్టులు
- విశ్రాంత ఇంజినీర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి
మర్రిగూడ : ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతే తెలంగాణలో పలు సాగు ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని నామాపురం గ్రామంలో ఫ్లోరైడ్ బాధితులు, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, శాస్త్రవేత్తలతో చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొట్టాలనే సంకల్పంతో ఈ ప్రాంతంలో సీఎం కేసీఆర్ శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా తాము నరకాన్ని అనుభవిస్తున్నామని ఫ్లోరైడ్ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. భవిష్యత్ తరాలను కాపాడేందుకు ప్రభుత్వం త్వరితగతిన శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా.రాజరెడ్డి, డా.కందారె, ఎన్నారై సుధీర్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాశ్, ప్రజాసంఘాల నాయకులు నెల్లికంటి సత్యం, బిచ్యానాయక్, ఫ్లోరోసిస్ ఉద్యమకారులు అంశల స్వామి, తిరుపతమ్మ, రజిత, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

మోత్కూరు కేజీబీవీ ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వేటు
మోత్కూరు : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్(ఎస్‌ఓ) యాదమ్మపై సస్పెన్షన్ వేటు వేస్తూ జిల్లా విద్యాధికారి చైతన్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఓ యాదమ్మ విధుల పట్ల అలసత్వం వహించడంతోపాటు, పాఠశాలకు చెందిన విద్యార్థినిని 10రోజులపాటు తన ఇంట్లో పని చేయించిందని ఆరోపణలు రావడంతో ఆమెను సస్పెండ్ చేసినట్లు సమాచారం. పాఠశాల నిర్వహణ తీరు, ఉద్యోగుల వ్యవహార శైలిపై తక్షణమే నివేదిక సమర్పించాలని ఎంఈఓ మన్నె అంజయ్యను ఆదేశించారు. జిల్లా ఉప విద్యాధికారి డీఈఓను విచారణ అధికారిగా నియమించినట్లు తెలిసింది.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...