హాస్టళ్లు, పాఠశాలల్లో వైద్య క్యాంపులు నిర్వహించాలి


Wed,November 20, 2019 01:21 AM

నల్లగొండకల్చరల్ : పాఠశాలలు, హాస్టళ్లల్లో వైద్య అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక వైద్యక్యాంపులు నిర్వహించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఇన్‌చార్జి కలెక్టర్ వి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు జి. శ్రీనివాసరావుతో కలిసి ప్రత్యేకంగా ఆధునీకరించిన కంప్యూటర్ గదిని, డీఎంహెచ్‌ఓ ఛాంబర్‌ను ప్రారంభించారు. అనంతరం సమావేశ మందిరంలో మెడికల్ ఆఫీసర్లు, ప్రోగ్రాం అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది చక్కగా పని చేస్తున్నారన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ వైద్యులు ఆయా గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లు సందర్శించి అక్కడున్న విద్యార్థులను పరీక్షించాలన్నారు. జిల్లాలోని స్లమ్ ఏరియాల్లో ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేస్తున్నారని శానిటేషన్ సమస్యను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కారమయ్యేలా చేస్తామన్నారు. జిల్లాలో ప్రయివేటు ఆసుపత్రులు రోగులను భయాందోళనకు గురిచేసి డబ్బులను గుంజుతున్నాయన్నారు. ప్రభుత్వ వైద్యులే రోగులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా వైద్యులు తమ పీహెచ్‌సీ టార్గెట్లు, లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. అందులో వ్యాధి నిరోదక టీకాలు, న్యూట్రేషన్స్, కు.ని. ఆపరేషన్లు, కంటివెలుగు, క్షయ వ్యాధి నిర్మూలన, మాతృ మరణాలు, భ్రూణ హత్యల నివారణ చట్టం, కేసీఆర్ కిట్ పథకాలపై సమీక్ష చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో అన్నిశాఖల విభాగాలకు సంబంధించి ఒకే గదిని ఏర్పాటు చేసి కంప్యూటర్లను ఏర్పాటుచేయడం ప్రశంసనీయమన్నారు. దీంతో జిల్లాలోని సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుందన్నారు. డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు మాట్లాడుతూ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించారు. ఈ కార్యక్రమంలో డెమో బి.వెంకన్న, డాక్టర్ సాంబశివరావు, కేశరవి, కృష్ణకుమారి, గీతావాణి, డీఎంఓ దుర్గయ్య, రాహుల్, హరికృష్ణ, ప్రభుత్వ వైద్యులు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...