శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి


Fri,November 8, 2019 03:46 AM

నల్లగొండసిటీ : అయోధ్య కేసు విషయంలో సుప్రీంకోర్టు త్వరలో తీర్పు వెలువరించనున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని ఎస్పీరంగనాథ్ కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం అన్ని రాజకీయ పార్టీలు, మత పెద్దలు, శాంతి సంఘం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్య తీర్పు వెలువడనున్న దృష్ట్యా ఎవరూ రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని, ఏ వర్గం కూడా ర్యాలీలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. అయోధ్య అంశంలో కోర్టు తీర్పును దేశ పౌరులు గౌరవించాలన్నారు. మతపర విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే సందేశాలు పంపినా, ప్రోత్సహించినా చర్యలు తప్పవన్నారు. మతం ఒక నమ్మకమని, అది ఎదుటి వారి మనోభావాలను కించపర్చేదిగా ఉండకూడదని పేర్కొన్నారు. అలా ఎవరు చేసినా నేరమన్నారు.

దేవుని వద్దకు చేరుకోవడానికి మతం ఒక దారి అని, ప్రతి మతంలో వారి సంప్రదాయాల ప్రకారం దేవున్ని పూజిస్తారని ఈ విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. స్వలాభం కోసం రెచ్చగొట్టేలా ఎవరు ప్రయత్నించినా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. బాబ్రి మసీదు కూల్చివేత తర్వాత చాలా మందిపై కేసులు నమోదై, వారు భవిష్యత్‌ను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అన్ని మతాల వారు సోదరభావంతో కలిసి మెలిసి ఉండాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి, సీఐలు సురేష్, భాష, ఎస్‌ఐలు నర్సింహులు, రాజశేఖర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెల్లి చంద్రశేఖర్, సీపీఐ, సీపీఎం నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి, సలీం, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్బగోని రమేష్, లతీఫ్, రావుల శ్రీనివాసరెడ్డి, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అహ్మద్‌కలీం, పిల్లి రామరాజు, సయ్యద్ హాశం, విశ్వహిందూపరిషత్ నాయకుల అభిలాష్, భజరంగ్ వెంకట్, సురేష్‌గుప్త, శాంతి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...