ఉనికిపాట్లు..!


Sun,November 3, 2019 04:14 AM

-అస్తిత్వం చాటుకునే అంశాలపైనే ప్రతిపక్షాల దృష్టి
-మున్సిపల్ పీఠాలపై ఆశలు అంతంత మాత్రమే
-కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీలదీ అదే పరిస్థితి
-హుజూర్‌నగర్ ఫలితంతో ఊపు మీదున్న టీఆర్‌ఎస్
-ఉమ్మడి జిల్లాలో అన్ని పీఠాలపై గులాబీ గురి
-రేపో, మాపో నోటిఫికేషన్ నేపథ్యంలో చర్చోపచర్చలు

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : 43వేల పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో హుజూర్‌నగర్ ఉప ఎన్నికను గెలుచుకున్న టీఆర్‌ఎస్‌లో ఆ ఘన విజయపు ఉత్సాహం తొణికిసలాడుతోంది. వరుస ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్న ఆ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీల్లో మాత్రం మున్సిపోల్స్ పై ఏ మాత్రం అంచనాలు లేని పరిస్థితి కనిపిస్తోంది. నల్లగొండ జిల్లాలో నల్లగొండతోపాటు మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, చండూర్, చిట్యాల, నందికొండ.. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి, మోత్కూరు, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలకు అతి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. రేపో మాపో నోటిఫికేషన్ విడుదలవుతుందనే అంచనా సైతం నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజకీయ ఆశావహులు తమ ఏర్పాట్లలో సిద్ధమయ్యారు కూడా. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల్లో మాత్రం విభిన్నవాతావరణం కనిపిస్తోంది.

పక్కా ప్రణాళికతో వెళ్తున్న టీఆర్‌ఎస్...
మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో అన్ని పురపాలికలపైనా గులాబీ జెండా ఎగరేసే లక్ష్యంతో టీఆర్‌ఎస్ శ్రేణులు అత్యంత పక్కా ప్రణాళికతో పని చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల నుంచి పట్టణాల్లో చేపట్టిన అభివృద్ధిని వివరించడంతోపాటు.. ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు సైతం విరివిగా చేపడుతున్నారు. మరోవైపు రాజకీయ అంశాల పైనా దృష్టి కేంద్రీకరించి.. వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని తమ నియోజకవర్గాల్లోని పట్టణ ప్రాంతాల్లో పర్యటించాలని పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రణాళికలు వేసుకొని పని చేస్తున్నారు. కౌన్సిలర్ టిక్కెట్ల కోసం ఒత్తిడి అధికంగా ఉన్న నేపథ్యంలో పూర్తి జాగ్రత్తతో గెలుపు గుర్రాలను గుర్తించే ప్రక్రియను సైతం ఇప్పటికే కొన్ని సెంటర్లలో అమలు చేస్తున్నారు. గతేడాది శాసనసభ ఎన్నికలు.. ఆ తర్వాత పంచాయతీ, స్థానిక సంస్థలతోపాటు మొన్నటి హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ ఘన విజయం సాధించిన ఉత్సాహంతో అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేస్తామనే ధీమాను ఆ పార్టీ అగ్ర నాయకత్వం వ్యక్తం చేస్తోంది.

ప్రతిపక్షాల్లో కరువైన మున్సిపల్ సందడి...
అధికార పార్టీలో మున్సిపల్ ఎన్నికల సందడి తారాస్థాయిలో కనిపిస్తుంటే.. ప్రతిపక్ష పార్టీల్లో మాత్రం మచ్చుకు కూడా దర్శనమివ్వడం లేదు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లో సందడి పూర్తిగా కరువైంది. చాలా ప్రాంతాల్లో అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోందని కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలే చెప్తుండటం ఆ పార్టీ పరిస్థితిని చాటుతోంది. హుజూర్‌నగర్‌లో డిపాజిట్ కూడా దక్కించుకోలేని బీజేపీ, టీడీపీలతో పాటు ఏ మాత్రం ప్రభా వం చూపలేకపోయిన సీపీఐ, సీపీఎంలు సైతం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉనికిని చాటుకునే అంశంపైనే మల్లగుల్లాలు పడుతున్నట్లు ఆయా పార్టీల కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. ఉనికిని చాటుకోవడం మినహా ఒక్క మున్సిపల్ పీఠాన్ని సైతం తాము గెలుచుకోలేమనే కాంగ్రెస్‌లో నెలకొందని.. కనీసం కౌన్సిలర్ స్థానాలైనా గెలుచుకుంటే చాలనే ఆలోచనలో ఇతర ప్రతిపక్షాలు ఉన్నాయని.. రాజకీయ విశ్లేషకుల అంచనా.

175
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles