స్ధానికులకే ఉద్యోగాలు


Sat,November 2, 2019 01:15 AM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో పర్యావరణహితంగా స్థాపించే పరిశ్రమల్లో సింహభాగం స్థానిక యువతకే ఉపాధి కల్పన, 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు, రెండు వేల ఎకరాల్లో పార్కు విస్తరణ చేపడుతామని రాష్ట్ర ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరాలజల్లు కురిపించారు. శుక్రవారం చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో ఏర్పాటు చేసిన గ్రీన్ ఇండిస్ట్రియల్ పార్కు పైలాన్‌ను ఆవిష్కరించిన ఆయన అనంతరం పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ), తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ఆధ్వర్యంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం దీనిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. రూ.6 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కూడా ప్రారంభించారు. పార్కు విస్తరణకు అవసరమైన భూసేకరణకు కలెక్టర్ అనితారామచంద్రన్ సిద్ధంగా ఉండాలని సూచించారు. పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్ పూర్తి ప్రణాళికతో కార్యాచరణను చేపట్టాలని స్పష్టం చేశారు.వేలాది సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు జరుగనున్నందున 132 కేవీ సబ్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వాల నిర్వాకం, నిర్లక్ష్యం వల్ల చౌటుప్పల్ ప్రాంతంలో ఏర్పాటైన పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు కామన్ ఎఫిలెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంతేగాకుండా భూమి కోల్పోతున్న రైతులకు న్యాయబద్దమైన నష్టపరిహారం అందించడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు. స్వల్పమైన ధరలకే పారిశ్రామికవేత్తలకు భూములను కేటాయిస్తున్నామని చెప్పారు. రైతుల నుంచి రూ.35 లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. అధునాతనమైన రోడ్లు, అంతర్గత డ్రైనేజీ, అంతర్గత కరెంటు సరఫరా, అంతర్గత గ్యాసు ఇలా అన్ని అధునాతన ప్దదతిలోనే పార్కులో పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. రైతుల నుంచి అతి తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని చెప్పారు.

పర్యావరణరహితంగా నిర్వహణ..
పర్యావరణరహితంగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. 435 ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేసినా మరింత స్థలం కావాలని కోరుతున్నారని, పార్కు విస్తరణకు అవసరమైన భూసేకరణకు వెంటనే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును 2 వేల ఎకరాలకు విస్తరిస్తామన్నారు. పార్కులో అంతర్గత రోడ్లు, కరెంటు, నీటి వసతి పనులు వేగంగా పూర్తి చేస్తామన్నారు. ఏ పరిశ్రమ ఏర్పాటు చేసినా మహిళలకు ప్రత్యేక కోటా కేటాయిస్తున్నట్లు చెప్పారు. వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కు, సంగారెడ్డి జిల్లాలో దేశంలోనే అతి పెద్ద మెడికల్ డివైజెస్ పార్కు, ప్లాస్టిక్ పార్కు, మైక్రో ప్రాసెసింగ్ పార్కు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశామని తెలిపారు.

ధన్యవాదలు తెలిపిన మంత్రి కేటీఆర్..
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు సాకారం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మంత్రి కేటీఆర్ ధన్యవాదలు తెలిపారు. తెలంగాణ నాయకులకు పాలన వచ్చా.. అని ఎగతాళి చేసినవాళ్లే నేడు మన విధానాలను అనుసరిస్తున్నారన్నారు. మాది తెలంగాణ అని గర్వంగా చెపుకునే స్థాయికి వచ్చామన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామన్నారు. 15 రోజుల్లో అనుమతులు రాకుంటే డీమ్డ్ అప్రూవల్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేసిన అధికారులకు రోజుకు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నామని చెప్పారు. టీఎస్‌ఐపాస్ ద్వారా 12లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. పరిశ్రమల విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న విధానం రేపు దేశంలో అన్ని రాష్ర్టాలకు రోల్‌మోడల్ అపుతుందన్నారు. ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రికి ప్రభుత్వం అండగా నిలబడుతున్నదన్నారు. 70 శాతం ఉద్యోగాలు ఇచ్చేది ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలేని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిశ్రమలకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నామన్నారు.

అభివృద్ధి మరింత వేగిరం..
ఇప్పటివరకు జిల్లాలో పారిశ్రామికంగా ప్రభావితం చేయదగిన పరిశ్రమలు లేవు. ఇక నుంచి వేలాది మంది పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల సుమారు 50 వేల మందికి ఉపాధి లభించే పరిస్థితులు మరి కొన్ని నెలల్లోనే వాస్తవరూపం దాల్చనున్నది. 450 పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నందున ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి మరింత వేగిరం కానున్నది. తలసరి ఆదాయం పెరగడంతో పాటు జాతీయ స్థూల ఉత్పత్తి తద్వారా దేశం ప్రగతి పథంలో పయనించేందుకు రాష్ట్రం మార్గదర్శకత్వం వహించే రోజులు రానున్నాయని మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. దేశంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణం చేయాలంటే దండుమల్కాపూర్‌కు రావాల్సిందే అనేంతటి స్థాయిలో అభివృద్ధి జరుగుతున్నదని మంత్రి భరోసా కల్పించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న టీఎస్‌ఐఎస్, ఐపాస్ విధానం ఎంతటి సత్ఫలితాలను ఇస్తున్నదో అవగతమవుతున్నది.

ప్రస్తుతం పార్కు ఏర్పాటుతో పరిశ్రమల్లో 20వేల మందికి ప్రత్యక్ష్యంగా 15వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నది. కేటీఆర్ ప్రకటనతో పార్కు సమీపంలోని 1500 ఎకరాల భూమిని కూడా సేకరించి విస్తరణ పనులు పూర్తి చేస్తే మరో 50 నుంచి 60వేల మందికి ఉపాధి లభిస్తుందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కు నిర్మాణం పనులు జరుగుతున్నందున పారిశ్రామికవేత్తల నుంచి విశేషమైన ఆధరణ లభిస్తున్నది. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న అసాధారణ నిర్ణయాల వల్ల దండుమల్కాపురం దేశంలోనే ఇప్పుడు పేరున్న ప్రాంతంగా ఎదిగే అవకాశం కలుగుతున్నది. మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రి కేటీఆర్ చూపించిన చొరవపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును రెండు వేల ఎకరాల్లో విస్తరించడంతో పాటు స్థానిక యువతకు సింహ భాగం ఉద్యోగాలు దక్కేందుకు దండుమల్కాపురంలో 10 ఎకరాల్లో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న మంత్రి కేటీఆర్ ప్రకటన పారిశ్రామికవేత్తల్లో ఆనందం నింపింది.

కొత్త లోకంలోకి వెళ్లిన అనుభూతి..
మంత్రి జగదీశ్‌రెడ్డి
సభలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు పైలాన్ దాటుకుని ముందుకు వస్తుంటే కొత్త లోకంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతున్నదన్నారు. చైనా తరహాలో ఇతర నగరాల్లోని సాంకేతికత జోడించి పార్కును అభివృద్ధి చేసిన తీరు ప్రశంసనీయమని చెప్పారు. తాము సీఎం కేసీఆర్‌తో కలిసి చైనాకు వెళ్లినప్పుడు వారు అనుసరిస్తున్న విధానాలు, గ్రీనరీ అబ్బురపరిచాయని చెప్పారు. ఫార్మా కంపెనీలకు వెళ్లినా ఇతర భారీ పరిశ్రమలకు వెళ్లినా ఇక్కడ కంపెనీ ఉన్నదా? అనే తీరున గ్రీనరీ, అక్కడి రోడ్లు ఉన్న తీరుతో పాటు టెక్నాలజీని అందిపుచ్చుకున్న విధానం తమను ఆకర్షించాయని చెప్పారు. అదే తరహాలో ఇక్కడి పార్కు రూపుదిద్దుకున్నదని చెప్పారు. పారిశ్రామికవేత్తలు కొత్త పోకడలను అందిపుచ్చుకుని ముందుకుసాగడం అభినందనీయమని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధిని ఎవరూ ఆపలేరని చెప్పారు. ప్రతేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ సరఫరా లేక పరిశ్రమలు మూతపడుతాయని చెప్పారని.. కానీ రాష్ట్రం ఏర్పడిన రెండున్నరేండ్ల్లలోనే విద్యుత్ సమస్యను అధిగమించామన్నారు.

ఎమ్మెస్‌ఎంఈ పరిశ్రమలకు మొట్టమొదటి పార్కు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎమ్మెస్‌ఎంఈ) ప్రత్యేక పరిశ్రమలకు దండు మల్కాపురం మొట్టమొదటి పార్కు. ఎమ్మెస్‌ఎంఈ పార్కులకు స్థలాలు కేటాయించాలని టీఫ్ సంస్థ తనను కోరింది. గత ఉమ్మడి రాష్ట్రంలో తమ సంస్థకు కనీసం గుంట భూమి కూడా కేటాయించాలేదు. దీంతో విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాగా వెంటనే ఆయన స్పందించి స్థలాలు చూసుకోవాలని చెప్పారు. అందులో భాగంగానే ఇక్కడ పార్కు ఏర్పాటుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. వెంటనే వాటికి సంబంధించిన పక్రియను సీఎం కేసీఆర్ త్వరితగతిన పూర్తిచేశారు. దీంతో 440 ఎకరాలు పార్కు కోసం కేటాయించగా 450 మంది స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మరో 1000 మంది కూడా ఈ పార్కులోనే స్థలాలు కేటాయించాలని అడుగుతున్నారు. పార్కులోపల విశాలమైన 150,80,60 ఫీట్ల రోడ్డు ఏర్పాటు చేశాం. ఆటోనగర్, మౌలాలి ప్రాంతాల్లోని పార్కులో రోడ్డు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడా పెద్ద రోడ్లు ఏర్పాటు చేశాం. రోడ్లు, డ్రైనేజీలే కాకుండా పార్కుకోసం కూడా 10 ఎకరాలు కేటాయించాం. డ్రైవర్లు సైతం విశ్రాంతి తీసుకోవడాని ప్రత్యేక వసతి గృహాలు నిర్మిస్తున్నాం.

-టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు
జిల్లాపై సీఎంకు ప్రత్యేక అభిమానం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం. ఉద్యమ సమయంలోనే ఇక్కడి ఫ్లోరైడ్ సమస్యను ఆదిలాబాద్, కరీంనగర్ సభల్లో నాతో ఆయన చర్చించారు. అక్కడి విషయాన్ని ఈ జిల్లాలో ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతే.. రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తే ఫ్లోరైడ్ సమస్యపై అధిక నిధులు నల్లగొండకు కేటాయించడానికి వీలు ఉంటుందని చెప్పేవారు. దాంతో మిషన్‌భగీరథ పార్కును కూడా ఇక్కడే ప్రారంభించారు. సీఎం కేసీఆర్ 20 సార్లు జిల్లాను సందర్శించారు. దామరచర్ల పవర్‌ప్రాజెక్టుకు రూ.30వేల కోట్లు ఖర్చుచేశారు. యాదాద్రి టెంపుల్ సిటీని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌కు పరిశ్రమలపై మంచి విజన్ ఉన్నది. చైనాకు సీఎంతో కలిసివెళ్లినప్పుడు ఫార్మా పరిశ్రమల దగ్గరకు వెళ్లే వరకు కనిపించదు. అక్కడ పరిశ్రమల కట్టడాలు కనిపించకుండా గ్రీనరీ ఏర్పాటు చేస్తారు. వాటి మాదిరిగా పరిశ్రమలు స్థాపించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. దండు మల్కాపురం పార్కును పచ్చదనంగా తీర్చిదిద్దాలని నిర్వాహకులకు సూచించాం. దేశం దండు మల్కాపురం పరిశ్రమల వైవు చూస్తున్నది. అదేవిధంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఉద్యమ సమయంలోనే ప్రణాళికలు తయారు చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో ఎదురయ్యే కరెంట్‌కష్టాలను ముందస్తు ఆలోచనలతోనే అధిగమించారు.
-విద్యుత్‌శాఖ మంత్రి గుంతకడ్ల జగదీశ్‌రెడ్డి

దండు మల్కాపురం దేశంలోనే గొప్ప మోడల్ పార్కు..
అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, అవుటర్‌రింగ్ రోడ్డుకు అతిదగ్గరలో పార్కు ఉన్నది. పూర్తిగా కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు కావడంతో పార్కుకు మంచి భవిష్యత్ ఉన్నది. మంచి వాతవరణంలో పరిశ్రమలు నెలకొల్పడం వాటికి మరింత శక్తి పెరుగుతుంది. ఈ ప్రదేశాన్ని చూస్తే విహార యాత్రకు వెళ్లినట్లు కనిపిస్తున్నది. ప్రాంతం అభివృద్ధి జరిగితే మా పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నదే రైతుల సంకల్పం. భూములు పోయినా పర్వాలేదు తమ బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నదే రైతుల ఉద్దేశం. ఇందుకోసం భూసేకరణలో కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు.
-శాసనమండలి విప్, కర్నె ప్రభాకర్

పారిశ్రామిక వేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది..
పారిశ్రామిక వేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. తెలంగాణలో ఇప్పటికీ 15 ఇండస్ట్రియల్‌పార్కులను ప్రభుత్వం స్థాపించింది. గత ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 3వేల ఎకరాల మాత్రమే ప్రభుత్వ ఆధినంలో ఉండేది. ప్రస్తుతం 1.43 ఎకరాల భూములను గుర్తించాం. వాటి ద్వారా 4వేల ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసుకోవచ్చు. దాంట్లో కొన్ని భూములకు క్లియరెన్స్ తీసుకొని ప్రభుత్వం 15 పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తున్నది. దండు మల్కాపురంలో 450 ఎకరాలు పరిశ్రమలకోసం టీఫ్‌కు ఇవ్వడం జరిగింది. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి ప్రభుత్వం రూ.6కోట్లు ఖర్చుచేసింది.
-టీఎస్‌ఐఐసీ ఎండీ, వైస్ చైర్మన్ వెంకటనర్సింహారెడ్డి

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...