గోదావరి జలాలతో నెరవేరుతున్న రైతన్న కల


Wed,October 23, 2019 02:31 AM

పెన్‌పహాడ్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ‘మన నీటి వాటా మనకు దక్కుతుంది..ప్రతి నీటి బొట్టును వినియోగించుకుంటాం..అని నాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న మాటలు నేడు అక్షరాలా నిజం చేస్తూ రైతన్నల కలలను సాకారం చేస్తున్నారని విద్యుత్‌ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని భక్తళాపురం శివారులోని ఎస్సారెస్పీ స్టేజ్‌-2 డీబీఎం-71కాల్వ వద్ద గోదావరి జలాలకు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి ‘జలపూజ’ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గత ప్రభుత్వాలు కాంట్రాక్టుల కోసమే కాల్వలు తవ్వాయి తప్ప రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ఏమాత్రం కాదన్నారు. సంపాదనే ధ్యేయంగా కాల్వలు తవ్వారని, అందుకు ఉదాహరణగా భక్తళాపురం శివారులో డీబీఎం-71కాల్వ వద్ద అసంపూర్తిగా, అడ్డుగా ఉన్న గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌ పైపులైన్‌ పనులే అన్నారు. గత ప్రభుత్వాలు ఏనాడైనా కనీసం కేంద్ర ప్రభుత్వానికి అనుమతుల కోసం దరఖాస్తు చేయలేదన్నారు. తాను 2014ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు తేవాలని దృఢ సంకల్పంతో 42రోజులపాటు కాల్వ వెంబడి తిరిగి సొంత ఖర్చులు వెచ్చించి ఆనవాలు కోల్పోయిన కాల్వకు మరమ్మతులు చేయించి రాయి చెరువులోకి గోదావరి జలాలు తెప్పించానని తెలిపారు.

అంతేకాకుండా 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గెయిల్‌ వద్ద అడ్డుగా ఉన్న పైపులైన్‌ పనులు పూర్తి చేయించి ఈ దీపావళి నాటికి గోదావరి జలాలతో మండలంలోని ప్రతి చెరువును, కుంటను నింపుతానన్న హామీ చిన్నగారకుంటతండాలో రైతుల సాక్షిగా ఇచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు గెయిల్‌ అనుమతితో, సీఎం కేసీఆర్‌ సహకారంతో సుమారు రూ.3కోట్లతో అండర్‌ టన్నెల్‌ పనులు పూర్తిచేయించి హామీని నిలబెట్టుకున్నట్లు చెప్పారు. రైతాంగానికి గోదావరి జలాలు అందించాలి, జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నదే సీఎం కేసీఆర్‌, తన సంకల్పమని, ఇప్పుడు గోదావరి జలాల రాకతో రైతుల దశాబ్దాల కల నేరవేరిందన్నారు. ఎస్సీరెస్పీ కాల్వ పరిధిలోని రైతులు గోదావరి జలాల వెంట ఆనందంతో పరుగులు పెడుతుంటే తనకు ఎంతో సంతోషంగా ఉందని మంత్రి చిరునవ్వుతో వ్యక్తం చేశారు. మాట తప్పకుండా, మడిమ తిప్పకుండా రైతుల ఆశయం నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు రైతులందరూ రుణపడి ఉంటారని వారి తరుపున సీఎంకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌, సూర్యాపేట జడ్పీటీసీ జీడి భిక్షం, ఎంపీటీసీ వాంకుడోతు జ్యోతి, వెన్న సీతారాంరెడ్డి, సర్పంచులు నెమ్మాది నగేష్‌, బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తొగరు కళావతి, చెన్ను శ్రీనివాస్‌రెడ్డి, బిట్టు నాగేశ్వర్‌రావు, మండాది నగేష్‌, తూముల ఇంద్రసేనారావు, మామిడి అంజయ్య, సూదిరెడ్డి సత్యనారాయణరెడ్డి, దొంగరి యుగేంధర్‌, సముద్రాల రాంబాబు, మామిడి వెంటకయ్య తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...