టీఆర్‌ఎస్‌తోనే ముస్లింల జీవితాలకు భరోసా


Wed,October 16, 2019 01:10 AM

- పలు సంక్షేమ పథకాలతో ఆత్మగౌరవం పెంపు
- 12శాతం రిజర్వేషన్‌కు కేంద్రంపై ఒత్తిడి
- కాంగ్రెస్ వల్లే హుజూర్‌నగర్‌లో కుంటుపడిన అభివృద్ధి : హోంమంత్రి మహమూద్ అలీ
- ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి : మంత్రి జగదీష్‌రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే ముస్లింల జీవితాలు బాగుపడి వారి భవిష్యత్తుకు భరోసా ఏర్పడిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం చిలుకూరులో నిర్వహించిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ముస్లింల ఆత్మగౌరవం పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, హుజూర్‌నగర్‌లో అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్ గెలవాలని అన్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలో లేకపోవడం వల్లే కోదాడ, హుజూర్‌నగర్‌లలో అభివృద్ధి చేయలేక పోయామని వాస్తవం ఒప్పుకున్న ఉత్తమ్ సతీమణికి ఓటు వేయడం వల్ల ఒనగూరే ప్రయోజనం లేదనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.

చిలుకూరు : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఎన్నో పథకాలు అమలు చేస్తూ వారి జీవితాల భద్రతకు భరోసా కల్పించిందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్రా పాలకుల వలస పాలనలో ముస్లిం మైనార్టీలు నిరుపేదలుగా మారిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్ అధికారం చేపట్టగానే ముస్లిం మైనార్టీల ఆత్మగౌరవాన్ని పెంచడంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. నిరుపేద ముస్లిం యువతుల వివాహాలకు షాదీముబారక్, విద్యార్థుల చదువులకు రాష్ట్రంలో 204మైనార్టీ గురుకులాలు, కళాశాలలు ఏర్పాటు చేసిందని కొనియాడారు. శాసన సభలో ఏకగ్రీవంగా 12శాతం రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపడంతోపాటు చట్టంగా మారేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తుందన్నారు. ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తూ దేశ చిత్రపటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టానికి గుర్తింపు తెచ్చారన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లు విచక్షణతో ఓట్లు వేయాలని కోరారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ అభ్యర్థి సైదిరెడ్డికే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. అధికారంలో లేకపోవడం వల్లే కోదాడ, హుజూర్‌నగర్‌లలో అభివృద్ధి చేయలేకపోయామనే వాస్తవం ఒప్పుకున్న ఉత్తమ్ తన సతీమణికి ఓటు వేయడం వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం లేదని పరోక్షంగా ఒప్పుకున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. గత ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిపోయినా సైదిరెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటున్న విషయాన్ని ఓటర్లు గుర్తించాలన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడైన సైదిరెడ్డిని గెలిపిస్తే రికార్డు స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని, తాను ప్రజలకు భరోసా ఇస్తున్నానన్నారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ సైదిరెడ్డిని గెలిపించుకొని సీఎంకు కానుకగా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, వేమిరెడ్డి నర్సింహారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కమిటీ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, హజ్ కమిటీ చైర్మన్ మజీఉల్లా, ఖాదీ చైర్మన్ యూసఫ్ జాహిద్, కో ఆప్షన్ సభ్యుడు జానీమియా, ముస్లిం మైనార్టీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...